శ్రీకృష్ణ రాయబార సందేశము

కౌరవ బలములన్నియు అణగె! బ్రతుకు నాశనమై పోయే!
బంధుమిత్రులు సమసె! రాజ్యలక్ష్మి ప్రాభవమ్ముజారిపోయె!
ఎవరు చెప్పినను వినెనే! ఎగిరెగిరిపడి పొమ్మనె కదా రారాజు!
మట్టి కలిసెను తనువు! సర్వనాశనమయ్యె యశస్సు!

సర్వబలములు తానె! సర్వబలగములు తానె! జీవకోటి యునికి తానె!
మేటిధాటి యుక్తులన్నియు తానె! ప్రాణికోటి సర్వశక్తులు తానె!
సర్వగతులు తానె! సర్వస్వమును తానె! సర్వసృష్టియు తానె!
అటుచూచిన తానె! ఇటుచూచిన తానె! ఎటుచూచిన తానె!

పరతత్వమనగ పరదేశమున లేదు! పరికించక కలదు తనదు దేహమందె!
దైవబలముపొందిన ధరణి నీడేరురా! నీవు కోరిన ఫలము తధ్యముగ నొకనాడు!
పాపచింతన వీడి పరహితము కోరుమా! పరమార్ధ చింతనయే పరమశ్రేయఃకరము!

–డా. రాంప్రకాష్ ఎర్రమిల్లి

Scroll to Top