పెంట్ హౌసు రెంటుకి


ఒక చిన్న అట్ట మీద ‘ఇల్లు అద్దెకివ్వబడును’ అని వ్రాసి ఇంటి బయట గేటుకి వ్రేలాడదీసి ఉండడం చూసి ఎగిరి గంతేసాడు ముత్తి.
బయటి నుండి చూస్తే పెద్ద భవంతి. గ్రౌండ్ ఫ్లోర్, ఒకటవ అంతస్తు, పైన పెంట్ హౌసులా ఉంది. ఇందులో ఏది ఖాళీగా ఉండొచ్చు! ప్రక్కనున్న తన భార్య రత్తి నడిగాడు. ‘మనకి ఏ పోర్షన్ అయితే సరిపోద్దంటావ్?’
‘ఆ! పగలంతా కష్టపడి పనిచేసి రేతిరి కసింత తలదాసుకోనికి ఏదైతేనేటి? మంచోడివే, ఒకపాలి అడిగి సూడ్రాదేటి! ఏది ఖాళీగా ఉందో!’
‘అలాగే నేవే! నీకడక్కుండా నేనెప్పుడైనా ఏటి సేసినానా?’
‘ఓసోస్! గొప్పలు సెప్పకు. మొన్న బాంకికెల్లి నా సంతకమెట్టీసి డబ్బులు నొక్కీలేదా! నాకు మంట రేగిందంటే అన్నీ కక్కీ గల్ను. ముందు వచ్చిన పంజూడు. లేకపోతే తిరగమోతలోని ఆవగింజ లాగ గిలగిల కొట్టుకోవేటి! అన్నా!’
ఎక్కువ మాట్లాడితే ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుందని గేటు దగ్గరకెళ్ళి శబ్దం వచ్చేట్టుగా గట్టిగా గేటుని ఊపేడు. ఎవరూ కనబడడం లేదు. మళ్ళీ గేటుని ఊపేడు. అయినా లాభం లేదు.
ప్రక్కనే ఏదో నల్ల బొడిపి లాగా రత్తికికి కనబడింది. టక్కున ‘ఇక్కడేదో బొడిపిలాగుంది. నొక్కి సూడు, వస్తారేమో!’
బెల్లు నొక్కాడు ముత్తి. పై అంతస్తు నుండి వెంటనే కిర్రుమని శబ్దంతో తలుపు తీయడం వినిపించింది.
‘సూసేవా! నాను సెప్తేనే నీకు పనౌద్ది, అన్నీ తెలిసినట్టు పంట్లామేసి భుజాలెగరేస్తే పనైపోదు.’ ఎత్తిపొడుపో, ఎద్దేవానో తెలియదు.
‘సర్లేవే! నీ బుర్రలో సెల్లు ఫోను సిప్పుంది, అందుకే మీట కనపడగానే నీకు బల్బెలిగింది!’ అన్నాడు. అది ప్రశంసో, ఎత్తిపొడుపో మరి.
మళ్ళీ ‘ఒక్క నిముషమూరుకో, పెద్దాయన వత్తన్నాడు’.
ఇద్దరూ అటువైపు చూస్తున్నారు.
పెద్దాయన చూస్తే భారీ విగ్రహం. మిలిటరీలోనో, పోలీసు ఉద్యోగం చేసి రిటైర్ అయినట్టున్నాడు.
ముత్తికి కొంత సంశయం, ఇల్లు అద్దెకిస్తాడా అని. అదే మాట రత్తితో అన్నాడు.
‘ఆ మాట, ఈ మాట అనేసి నీ దొంగ బుద్ధి సూపమాకా! అసలే పోలీసోడులాగా ఉన్నాడు, నీవసలు మాట్లాడకు. నాను సూసుకుంతాను గందా!’
‘మగోడునైయ్యుండి నాను మాటాడక పొతే, పెద్దాయన దగ్గర బాగోదు గందా!’
‘ఎవడన్నాడు నువ్వు మగోడువని? నా ఎదురుగ రమ్మను! నాకు తెలీదేటీ?’
‘ఊరుకోయే! పెద్దాయన వింటే బాగోదు’
ఇంతలో పెద్దాయన దగ్గరికి వచ్చాడు.
‘ఏంటయ్యా! మిట్ట మధ్యాహ్నం ఇలా వచ్చారు?’
ముత్తి ఎక్కడ మొదలెడతాడోనని రత్తి అందుకుంది.
‘దండాలయ్యా! మరే, మరే…’
‘చల్లకొచ్చి ముంత దాస్తావెందుకమ్మా! నీళ్ళు నమలకుండా ఎందుకొచ్చావో చెప్పు’ పెద్దాయన మెల్లగా అడిగాడు. ఎదురుగా ఆడపిల్ల నిగనిగలాడుతూ సిగ్గులొలకబోస్తుందని తాను కూడా గ్రహించాడు.
‘అయ్యగోరు! ఇల్లు.. అద్దెకని… బోర్డు….’ మరికొంత సిగ్గు ప్రదర్శించింది రత్తి.
‘ఓస్! దానికెందుకమ్మా, అంత మొహమాటపడతావ్! అవును ప్రస్తుతానికి కింద పోర్షనూ, పైన పెంటు హౌస్ ఖాళీగా ఉన్నాయి. మీకేది కావాలో చెప్పండి. ఇంతకీ మీరేం చేస్తారో చెప్పలేదు’
‘అదేనయ్యగోరు! మేము ఏపారం చేసుకుంటాము. కింద పోర్షనైతే బాగుంటదేమో…’ ముత్తి నసిగాడు.
ఇప్పటికే ఇల్లు ఖాళీగా ఉండి చాలా రోజులైంది. ఇంతకు ముందున్నవారు కొంత సొమ్ము ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు వ్యాపారం అంటున్నారు గనుక కొంత ఎక్కువ అద్దె చెప్పి మొదటి నష్టం కూడా పూడ్చుకోవచ్చని రామనాధం గారు మనసులో కొంత సంబరపడిపోయారు.
‘ఇంట్లోకి రండి, తీరిగ్గా మాట్లాకుందాము’ ఆహ్వానించాడు.
ముత్తి, రత్తి ఎంతో మురిసిపోయారు. అద్దె సంగతి ఎలా ఉన్నా అయ్యగారు ఎంతో మంచివారని లోలోన ఆనందపడిపోయారు. అమ్మగారిని కూడా చూసే అవకాశం ఉంటుందని తెగ సంబరపడిపోయారు. అయ్యగారి కంటే అమ్మగారు మరెంతో సౌమ్యులై ఉంటారని చూడడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
మెట్లెక్కి వసారా నుండి డ్రాయింగ్ గదిలో అడుగు పెట్టారో లేదో చుట్టూ కలయజూసి, అమ్మో! అని ముక్కుపై వ్రేలు వేసుకున్నారు. గదిలో ఉన్న ఫర్నిచర్, అద్దాల బీరువాలు, ఖరీదైన తివాచీలు, అందమైన హంగులతో కూడిన బొమ్మలు, నగిషీలు చెక్కిన శిల్పాలు, కళారూపాలైన చిత్రాలు, అబ్బా ఏమి సంపద! అనుకున్నారు.
రామనాధం ఇరువురినీ సోఫాలో కూర్చోమన్నారు. అయితే ముత్తి, రత్తి ‘అయ్యా! మేము సాలా సిన్నోళ్ళము. కిందే కూసుంటాము.’ అన్నారు.
‘అయ్యో! ఫర్లేదు. సొఫా పైన కూర్హోండి’ అన్నాడు రామనాధం. ఇద్దరూ కూర్చొన్నారు.
‘బయట బాగా ఎండగా ఉంది. మంచి నీళ్ళు తీసుకుంటారా?’
ముత్తి, రత్తి ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. చాలా సంతోషపడిపోయారు. కాదనలేక తలూపేరు.
అమ్మగారు శకుంతల పళ్ళెంలో రెండు గ్లాసులతో నీళ్ళు పట్టుకొచ్చింది. అమ్మగారిని చూసి నమస్కారం చేస్తూ ఎంతో వినయంతో రత్తి, ముత్తి లేచి నిల్చొన్నారు.
‘ఫర్లేదు, ఫర్లేదు కూర్చోండి’ అంది శకుంతల. మళ్ళీ కూర్చొన్నారు.
ఎదురుగా సోఫాలో శకుంతల కూర్చొంది.
‘వీళ్ళు వ్యాపారం చేస్తుంటారట! ఇల్లు అద్దె కోసం వచ్చారు.’ రామనాధం సావధానంగా చెప్పాడు.
‘ఏం వ్యాపారమూ!’ ఆశ్చర్యంగా చూసింది శకుంతల.
‘ధాన్యం, మిరపకాయలు, మినుములు, పెసలు….’ ఏకరువు పెట్టింది రత్తి.
‘అబ్బో! పెద్ద వ్యాపారమే! ఎన్నాళ్ళ నుండి చేస్తున్నారు?’ శకుంతల గారి ఉత్సాహానికి అవధులు లేవు.
‘ఇంచుమించు పది సంవత్సరాలౌతుంది అమ్మగోరు’ ముత్తి మెల్లగా చెప్పాడు.
‘ఇంతకీ మీదేవూరు?’ శకుంతల అడిగింది.
‘మాదమ్మగోరు…’ ముత్తి చెప్పబోయాడు.
రత్తి అందుకుంది.
‘మాదమ్మగోరు, వైజాగ్ కి కొంచెం దగ్గర అనకాపల్లికి కొంచెం దూరం, నడిమినుంటది, పల్లెటూరుకి పెద్దది, టౌనుకి చిన్నది లాగ ఉంటదమ్మగోరు.’
‘మరి అంత దూరం నుండి ఇక్కడకొచ్చారు?’ శకుంతల వాకబు.
‘అదేనండమ్మగోరు! ఏపారం సేసుకుంటూ అలా ఎలిపొచ్చినామమ్మగోరు. దారే తెల్లేదు! పది సంవత్సారానైపోనాది.’ రత్తి వివరణ.
‘వీళ్ళు నమ్మకస్తులేనా?’ శకుంతలకి ఇంకా కొంత సంశయం. ‘అయినా ఒకటో తేదీకి అద్దె అందితే ఎవరైతే మనకేంటి!’ అనుకుంది.
రామానాధం గారు కూడా సరిగ్గా అలాగే ఆలోచిస్తున్నారు.
రామనాధం తమ పేర్లు చెప్పి అడిగారు. ‘ఇంతకీ మీ పేర్లు చెప్పనే లేదు.’
‘నా పేరు మృత్యుంజయ రావు, దానికి ఓ పెద్ద కథ ఉంది. అందరూ పొట్టి పేరు ముత్తి అంతారయ్యా! మా యావిడి పేరు రత్నం, ముద్దుగా రత్తి అని పిలిసికుంతను.’ ముత్తి కనపడని సిగ్గుతో వివరించాడు.
‘ఓహో! ముత్తి, రత్తి! కత్తిలా భలే కుదిరింది కదా! అందరికీ ఇష్టమున్నా ఇలా కుదరాలంటే కష్టం.’ రామనాధం వచ్చినకాడికి ప్రాస కలిపి చెప్పాడు.
‘ఒక్క నిమిషం మీరిద్దరు ఇక్కడే కూర్చోండి. లోపలకెళ్ళి మా ఆవిడతో ఒక మాట మాట్లాడి వస్తాను’ అన్నాడు రామనాధం.
రామనాధం, శకుంతల కలిసి లోనికి వెళ్ళారు.
— *** —

‘ఏమంటావ్?’ శకుంతలని అడిగాడు రామనాధం.
‘మీరేమనుకుంటున్నారు?’ తిరిగి ప్రశ్న.
‘ఆధార్ కార్డులు, ఇతర వివరాలు తీసుకోవాలి. నాకెందుకో ఫరవాలేదనిపిస్తుంది.’ గట్టిగా చెప్పకపోయినా నమ్మకం కుదిరినట్లు ఒక సంకేతాన్నిచ్చాడు. శకుంతల ఉద్దేశ్యం కూడా పూర్తిగా తెలుసుకుంటే మంచిదని.
‘నాక్కూడా అదే అనిపిస్తుంది. ఇల్లు ఖాళీగా ఉండి ఇప్పటికే చాలా కాలమయింది. ఖాళీగా ఉన్నపుడు మరమ్మత్తులకి, మెంట్ నేన్సుకి చాలా ఖర్చవుతుంది. ప్రస్తుతానికి క్రింద పోర్షనిస్తే సరిపోతుంది.’ అంది శకుంతల.
హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నాడు రామనాధం. శకుంతల ఎక్కడ మెలిక పెడుతుందో, వచ్చే అద్దె కాస్త రాకుండా పోతుందోనని కొంత భయపడ్డాడు. పైగా ఇదివరకున్నవారు మూడు నెలలు అద్దె చెల్లించకుండా ఉడాయించారు. అధార్ కార్డులు గురించి చెప్పి ఇదివరకట్లా కాకుండా ఇప్పుడు మంచి జాగ్రత్త తీసుకుంటున్నట్లు శ్రీమతిని మెప్పించానని తెగ మురిసిపోయాడు.
‘అధార్ కార్డులు కాకుండా ఇంకేమైనా బయానా లాంటిది అడుగుదామా?’ మరోమారు రూఢిపరచుకుంటే బాగుంటుందని శకుంతలనడిగాడు రామనాధం.
‘పోలీసు డిపార్ట్మెంటులో పని చేసి రిటైర్ అయ్యారు గదా! మీకే ఎక్కువ తెలియాలి!’ తెలివిగా మాట్లాడానని ముసిముసిగా నవ్వింది శకుంతల.
భాష వ్యంగంగా ఉన్నా భావం సూటిగా ఉందని ఏడవలేక నవ్వాడు రామనాధం.
మరోమారు అలోచించి ‘మూడు నెలలకి బయానా కూడా తీసుకుంటే మంచిది. ఇంతకుమించి మనమేమీ చేయలేం’ అన్నాడు.
‘అది సరే! ఇంతకు మునుపు, వారు అద్దెకున్న ఇంటివారితో కూడా మాట్లాడొచ్చు కదా!’
‘అది కూడా అడుగుదాము! కానీ వాళ్ళు ఎవరివో ఫోను నంబర్లిస్తే సరైనవో కావో నిర్ధారించుకోవడం కష్టం శకుంతలా!’ దీనంగా అన్నాడు రామనాధం. ‘అయినా పోలీసోడి చేతినుండి బయటపడి బ్రతకగలరా? చెప్పు. అంతగా కావాలంటే మా సూపర్ బాస్ కి ఒక మాట చెప్పి ఉంచుతాను.’ ఈసారి గట్టి నమ్మకంతో చెప్పాడు.
‘ఇంట్లో ఏమైనా అయితే నేను చూసుకోగలను గానీ బయట తేడాలొస్తే మీరే చూసుకోవాలి. ఆ తరువాత నన్నని ఏం లాభం లేదు మరి! ఇంకో విషయం. ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే! పెంటు హౌసు కాదు సుమా!’ శకుంతల హెచ్చరించింది.
‘నీవేమీ భయపడకు! నేనన్నీ చూసుకుంటాను గదా!’ భరోసా ఇచ్చాడు రామనాధం.
‘అద్దె ఎంతని చెప్పాలి?’ అడిగాడు రామనాధం.
‘ఇంతకు ముందున్నవాళ్ళు సుమారు పాతిక వేలు వరకూ చుక్కలు చూపించారు. అది కూడా మనం లెక్కల్లో కలుపుకోవాలి గదా!’ శకుంతల అంది.
‘అదే మరి! పది వేలు చెప్పి బేరమాడితే ఎనిమిదికి దిగుదాం’ అన్నాడు రామనాధం.
ఇద్దరూ హాలులోకి వచ్చారు.
— *** —

‘మీ ఆధార్ కార్డులు తెచ్చారా?’ రామనాధం ముత్తిని చూసి అడిగాడు.
‘అయ్యగోరు! పట్టుకోని తిరుగుతున్నాము. ఎక్కడికెళ్లినా అవే గందా ముందు అడగటం!’ రత్తి సంచిలోనుంచి తీసి చేతికిచ్చింది.
‘అబ్బా! కార్డులడుగుతారని ముందే తెలిసి తెచ్చుకున్నారన్న మాట, మీకు చాలా అనుభవముంది. మరింకేం!’ రెండు కార్డులూ చూస్తూ అన్నాడు రామనాధం.
‘అవునయ్యగారో! ఎక్కడికెళ్లినా ఆధారే ఆధారం!’ రత్తి మాట కలిపింది.

(తరువాయి భాగం త్వరలో)

--మల్లికేశ్వర రావు కొంచాడ 
Scroll to Top