మూడు తరాల తోట

నిఖిల్ ముభావంగా, మౌనంగా ఉన్నాడు.
‘ఏం నాన్నా అలా ఉన్నావు?‘ తాతయ్య అడిగాడు.
‘ఏం లేదు తాతయ్య. బాగానే ఉన్నాను‘ అబద్ధమాడాడు. అబద్ధామాడినట్లు ఇద్దరికీ తెలుసు.

నిశ్శబ్దంలో నిగ్గు తేల్చగల సత్తా తాతగారిది. పెద్ద చదువు చదవకపోయినా మనసులు చదవగల 70 ఏళ్ల జీవితానుభవం. అక్షర జ్ఞానం పెద్దగా లేకపోయినా లోకజ్ఞానం ఉన్న మనిషి. ఊళ్ళో ఉన్న ప్రాధమిక పాఠశాలలో ఐదో తరగతి చదివినా తీరిక సమయంలో భగవద్గీత, పురాణాలు, కావ్యాలు ఎన్నో చదివాడు. చదువు అబ్బలేదు గానీ సంస్కారవంతుడయ్యాడు.

నలుగురు సంతానం. ఊళ్ళో సుమారు మూడు తరాల మనుషల మనస్తత్వాలను మదించి మమతల పల్లకి పట్టిన బోయీ. అడిగినవారికి లేదనకుండా ఊరు క్షేమమే ధ్యేయంగా అందరినీ కలుపుకొని పోయే స్వభావం. తన 70 ఏళ్ల జీవితంలో ఊరే స్వర్గం అని ఆక్కడే జీవించాడు. ఊరి కోసం జీవితాన్ని అర్పించాడు.

పేరు పురుషోత్తం నాయుడు. ఊళ్ళో అందరూ నాయుడు గారు అని గౌరవంగా పిలుస్తారు. పదేళ్ళ వయసువారి నుండి సమకాలీకులవరకూ అందరికీ ఆదర్శ పురుషుడు.

నిఖిల్ రెండో అబ్బాయి ఏకైక పుత్రుడు. హైదరాబాదులో చదువుకుంటూ ఉంటాడు. వయసు 12 సంవత్సరాలు. వేసవి సెలవులకని తాతయ్య, నానమ్మలను చూడాలని వచ్చాడు. వచ్చి మూడు రోజులైనా ఎందుకో ముభావంగా ఉంటున్నాడు. కొడుకు కోడలు వచ్చారు కానీ నిఖిల్ విషయమేమీ పట్టించుకోవడం లేదు.

‘ఎందుకో నిఖిల్ లో ఆ సంతోషంగానీ, కళ్ళల్లో మెరుపు గానీ కనిపించడం లేదు. ఎప్పుడూ సెల్ ఫోను పట్టుకునో, లాప్ టాప్ పట్టుకునో గదిలోకి వెళ్లి ఆడుకుంటూ ఉంటాడు. ‘ఆడుకుంటూ ఉంటాడు’ అనేకంటే మదనపడుతూ ఉంటాడు. భోజనం సమయానికి పిలిస్తే బయటికి వచ్చి గబగబా అన్నం తిని వెళ్ళిపోతాడు. గత సంవత్సరం వచ్చినపుడు ఇటువంటి ప్రవర్తన నిఖిల్ లో లేదు. సరదాగా నవ్వుతూ ఊళ్ళో పిల్లలతో ఆడుకునేవాడు. ఒక్క సంవత్సరంలో ఇంత మార్పు రావడానికి కారణం ఏమయ్యుంటుంది? వాడి అమ్మా, నాన్న కూడా ఏమీ జరగనట్లే ప్రవర్తిస్తున్నారు. అంతా ఆశ్చర్యంగా ఉంది.’ పురుషోత్తమ నాయుడుగారికే అన్నీ సందేహాలు, సంశయాలు! కానీ నిఖిల్ సమస్య ఏమిటో ముందు తెలుసుకోవాలన్న తపన పెరిగింది.
-*****-

తెల్లవారగానే కాలకృత్యాలు తీర్చుకొని కాస్త టీ త్రాగి నాయుడు గారికి పొలం వైపు వెళ్లి రావడం అలవాటు.
ఆ రోజు నిఖిల్ ని తీసుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ‘పొలం చూపించినట్లూ ఉంటుంది, వాడి సమస్యేమిటో తేల్చినట్లూ ఉంటుంది’ అనుకున్నాడు.
నిఖిల్ ఇంకా లేవలేదు. ఇంకా కొంచెం సేపు ఆగి నిద్ర లేపితే బావుంటుందని గడపలో పచార్లు చేస్తున్నాడు. భార్య గౌరమ్మ ‘ఈ రోజు ఇంకా పొలం వెళ్లలేదా’ అని అడిగింది.
‘నిఖిల్ కూడా నాతో పొలంకి వస్తానన్నాడు. ఇంకా లేవలేదు గదా అని ఎదురుచూస్తున్నాను’ అబద్ధం చెప్పాడు నాయుడు గారు.
గౌరమ్మ ఎంతో మురిసిపోయింది. పట్నంలో పిల్లలు పొలం చూసే అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? మనవడే తాతతో పొలం వెళ్తానన్నాడంటే ‘ఏం అదృష్టం చేసుకున్నానో నేను!’ అనుకుంది.
గౌరమ్మ మనవడ్ని లేపి ఎక్కడ అడుగుతుందోనని నాయుడుగారికి గుబులు పెరిగింది.
‘వాడిని అప్పుడే లేపొద్దు. లేచింతర్వాతే మేమిద్దరం వెళ్తాము’ అని మెల్లగా చెప్పినా కఠువుగా అన్నాడు.
అరగంట తరువాత నిఖిల్ నిద్ర లేచాడు. నాయుడు గారు ఎప్పుడు లేస్తాడా అని కాచుక్కూచున్నాడు కాబట్టి ఎవరూ చూడకుండా గబగబా నిఖిల్ దగ్గరకు వెళ్లి ‘ఏం తాతా నిద్ర లేచావా? పద ఈరోజు మనం పొలంకి వెళ్దాం’ అన్నాడు.
ఈసారి ఆశ్చర్యపోవడం నిఖిల్ వంతైంది. నాయుడు గారు మెల్లగా బ్రతిమాలి ‘నువ్వు బ్రష్ చేసుకొని కాసిన్ని పాలు తాగితే, మనం వెళ్దాం’ అన్నాడు.
తాత మాట కాదనలేక అయిష్టంగానే పక్కపై నుండి లేచి పళ్ళు దోముకున్నాడు. కాసిన్ని పాలు త్రాగి బూట్లు వేసుకోబోయాడు.
నాయుడు గారు చూసి చిన్నగా నవ్వి ‘చెప్పులుంటే వేసుకో నాన్నా, పొలం గట్ల మీద బూట్లు పాడైపోతాయి’ అన్నాడు.
బుంగమూతి పెట్టి చెప్పులేసుకున్నాడు.
ఎలాగైతేనేం ఒక అబద్ధమాడి ప్రయాణానికి సన్నద్ధం అయ్యారు. నిఖిల్ మాత్రం ‘తాతయ్య ఎప్పుడూ పొలం చూడడానికి రమ్మనలేదు. ఈ రోజు ఎందుకు పనిగట్టుకొని మరీ తీసుకెళ్తున్నాడు?’ ఆశ్చర్యంగా ఉన్నా అనుమానంగా కూడా ఉంది.
వీధిలోనుండి ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుపడ్డ వాళ్ళంతా ‘పెదనాన్నని, బాబాయి అని, కొందరు అన్నని, మామని’ సంబోదిస్తూ ‘మనవడిని పొలంకి తీసుకెళ్తున్నావా?’ అని అడుగుతూ ఉన్నారు.
నిఖిల్ కి ఆశ్చర్యంగా ఉంది. ఇంతమంది చుట్టాలు ఉన్నారా! అని.
ఊరు దాటి పొలాల్లోకి వెళ్ళగానే అదే ప్రశ్న వేసాడు. ‘తాతయ్యా, మనకి ఇంతమంది చుట్టాలున్నారా? అందరూ నిన్ను వరస కట్టి మరీ పలకరిస్తున్నారు’ ప్రశ్న ఆశ్చర్యకరమైనా తాతయ్యకు మంచి సమాధానం చెప్పే అవకాశం దొరికింది.
‘మీ పట్నంలో అందరినీ ఆంటీ, అంకుల్ అని పిలుస్తారు కదూ! ఆ పిలుపులో బలమేముంటుంది చెప్పు. ఇక్కడ చుట్టాలు కాకపోయినా మనుషుల్లో మమతలు నిండి ఉంటాయి. వరుస కట్టిన పిలుపులో ఒక బలమైన బంధం ఉంటుంది. డబ్బు, ధనమూ లేకపోయినా అనుబంధాలు పంచుకొని బ్రతుకుతారు. అవెప్పుడూ శాశ్వతము కాదు నాన్నా. బంధాలు, అనుబంధాలే చివరకు మిగిలేవి.’ అన్నాడు తాతయ్య.
నిఖిల్ కి పూర్తిగా అర్ధం కాలేదు. కానీ డబ్బుకి, బంధాలకి తేడా ఉందని తెలిసింది.
-*****-

పొలాల్లో నడుస్తున్నారు. నిఖిల్ కి వింతగా లేకపోయినా క్రొత్తగా ఉంది.
‘నన్ను పిలిచాడు కానీ, తాతయ్య నాన్ననెందుకు పిలవలేదు? నేనేం సలహాలివ్వగలను?’ తనను ఏదో సలహాలడగడానికి పిలిచాడని ఒకింత గర్వం.
కొంత దూరం వెళ్ళిన తరువాత నాయుడు గారు చుట్టూ 3600 ఒకమారు చూసాడు. వారికి దగ్గరలో ఎవరూ లేరని నిర్ధారించుకొని మెల్లగా నిఖిల్ తో మాటలు కలిపాడు.
‘నాన్నా నిఖిల్’ మెల్లగా పిలిచాడు.
‘ఏంటి తాతయ్యా?’
‘బాగా చదువుకుంటున్నావా?’
‘ఊ, బాగానే చదువుకుంటున్నాను. 7వ తరగతి నుండి 8వ తరగతికి వచ్చాను గదా తాతయ్యా!’ అన్నాడు.
‘మీ బడిలో నీకు మంచి స్నేహితులున్నారా?’ తాతయ్య మళ్ళీ ప్రశ్న.
‘అందరూ మంచి వాళ్ళు కాదు గానీ, కొందరు మంచి వాళ్ళే తాతయ్య’ నిఖిల్ నిక్కచ్చిగా చెప్పాడు.
‘మంచి వాళ్ళు కాదంటే?’ కుతూహలంగా అడిగాడు తాతయ్య.
‘అంటే వాళ్ళు సెల్ ఫోన్ లో ఏవేవో చూస్తుంటారు, ఏదేదో మాట్లాడుతారు’ సగం అర్ధమయి, సగం అర్ధం కాకుండా చెప్పాడు నిఖిల్.
‘అంటే సినిమాలా?’
‘కాదు, తెలుగులో ఎలా చెప్పాలో నాకు తెలియదు’ కొంచెం విసుక్కున్నాడు నిఖిల్.
‘మరి వాళ్ళ అమ్మా, నాన్న ఏమీ అనరా?’ అమాయకంగా అడిగాడు తాతయ్య.
‘మొన్నీ మధ్య వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ వాడొద్దని కోప్పడితే మాపై అంతస్తులోని నా ఫ్రెండ్ కిందకి దూకి చచ్చిపోయాడు తాతయ్యా? వాళ్ళింట్లో పాపం ముగ్గురే ఉంటారు. మా ఫ్రెండ్, వాడి అమ్మ, నాన్న’ చెప్పాడు నిఖిల్.
‘అయ్యో! అందుకనా నీవు కొంచెం దిగులుగా ఉన్నావు?’ మెల్లగా అడిగాడు.
‘అందుకు కాదు తాతయ్యా, నేను బాగానే ఉన్నాను. ఇంతకీ మనం ఏ పొలం చూడడానికి వెళ్తున్నాం?’ మాట మార్చే ప్రయత్నం చేసాడు నిఖిల్.
‘అబ్బో! ఏమో అనుకున్నాను కానీ గడుగ్గాయే’ అనుకున్నాడు నాయుడు గారు. ఇంకా కొంత సమయం తరువాత అడిగితే మంచిదనుకొని ముందుకు నడుస్తూ ‘చిన్నప్పుడు మీ నాన్న, పెద నాన్న, మీ మేనత్తలు ఆడుకునే ఒక తోట ఉంది. అది చూపిద్దామని నిన్ను తీసుకొచ్చాను. కొంచెం దూరం అయినా నీకు బాగా నచ్చుతుందని…’ నాయుడు గారు ఒక అబద్ధానికి మరో అబద్ధం జోడించారు.
-*****-

కొంత దూరం నిశ్శబ్దంగా నడిచారు.
నిఖిల్ చేత ఎలా నిజం చెప్పించాలా అన్నది నాయుడుగారి ఆలోచన. వాడికి ఏదో ఒక సంఘటన చెప్పి ముగ్గులో దింపితే మంచిదన్న ఆలోచన వచ్చింది. అంతలో తోట రానే వచ్చింది.
తోటలో మామిడి, జామ, దానిమ్మ, రేగు, నేరేడు, తాటి, అన్ని రకాల పండ్ల చెట్లు, చుట్టూ టేకు చెట్లున్నాయి.
‘ఇదేంటి తాతయ్య, ఇంత పెద్ద తోట మనకుందని నాకు తెలియనే లేదు. ఎవరూ చెప్పలేదు!’ అన్నాడు ఆశ్చర్యంగా. తోట చుట్టూ కలయజూశాడు. అబ్బ! ప్రకృతి అంతా ఈ తోటలోనే ఉందని ఇంత పచ్చదనం ఎప్పుడూ చూసే అవకాశం రాలేదని అనుకున్నాడు. తనలో తానే ఏదో తన్మయత్వంలో మునిగిపోతున్నాడు.
ఎండాకాలం కాసే పండ్లు ఎంత అందంగా ఉన్నాయి. కొన్ని పళ్ళు తానెప్పుడూ చూడనేలేదు. కొన్ని పళ్ళు నేల మీద పరుపు పరిచినట్లు పడి ఉంటే మొబైల్ ఫోన్ తో ఫోటోలు తీసాడు. ఒక్కొక్క ఫోటో మళ్ళీ మళ్ళీ చూసుకున్నాడు.
మామిడి చెట్ల దగ్గరకు వెళ్లి ఎగిరెగిరి కాయలు తెంపుతున్నాడు. నేరేడు పళ్ళు వింతగా ఉండటంతో తలపైకెత్తి చూస్తున్నాడు. నీడివ్వని తాటిచెట్టు పండు కొస్తే ఎలా ఉంటుందోనని ఊహించుకుంటున్నాడు. కొన్ని పూల చెట్ల దగ్గరకు వెళ్లి పూలను తాకీతాకనట్లు చేయిని కదుపుతున్నాడు. పూల మొక్కలు తనతో దోబూచులాడుతూ ఉంటే తాను కూడా చిలిపిగా మాట్లాడుతున్నాడు. సీతాకోక చిలుకలు పూలపై వాలుతుంటే పట్టుకోవడానికి పరిగెడుతున్నాడు.
ఉడుతలు వింతగా అటూ, ఇటూ పరిగెడుతున్నాయి. పంచరంగుల రామచిలుకలు చెట్లపైన ఎగురుతున్నాయి.
దూరంగా కొండ శిఖరాల్లా అక్కడక్కడా పుట్టలున్నాయి. నిఖిల్ తోటలో అటూ, ఇటూ పరిగెత్తుకుంటూ తిరుగుతున్నాడు.
ఇదొక వింత ప్రపంచంలా ఉంది నిఖిల్ కి. తాతయ్య ప్రక్కనే ఉన్నట్లు కూడా గమనించట్లేదు.
నాయుడు గారు నిఖిల్ ని గమనిస్తూ ఉన్నాడు. వాడి కళ్ళల్లో మళ్ళీ మెరుపు కనబడుతోంది. సంతోషం తొణికిసలాడుతోంది.
నాయుడు గారు నిఖిల్ దగ్గరికొచ్చి ‘అందుకే మరి, ఈ రోజు నిన్నింత దూరం తీసుకొచ్చాను. మనకి పొలాలే కాదు తోటలు కూడా ఉన్నాయని నీకు తెలియాలి కదా! నీకు బాగా నచ్చినట్లుంది, అవునా!’ అన్నాడు.
‘ఈ తోట నా బాల్యం నుండి నీ బాల్యం వరకూ – అంటే మూడు తరాలకి వారధన్న మాట.’ నిట్టూర్చాడు నాయుడు గారు.
తాతయ్య చెబుతుంటే ఎంతో కుతూహలంగా వింటున్నాడు నిఖిల్. ‘తాతయ్య ఎక్కువ చదువుకోలేదు కానీ అమ్మ, నాన్న ఎప్పుడూ వాడని తెలుగు పదాలు వింటున్నాను. వినడానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి’ అనుకుని ‘ఇక్కడ ఎంత కథుందో? ఏం నేర్పుతుందోనని!!’ తాతయ్య చెప్పే కథలు వినడానికి సిద్ధం అవుతున్నాడు.
‘నా చిన్నప్పుడు వేసవి సెలవులకి మా జట్టుగాళ్ళందరమూ మనిషొక వస్తువు తెచ్చి అంటే ఉప్పు, కారం, దినుసులు, అగ్గి పెట్టె, వండటానికి గిన్నె – ఇక్కడ పచ్చి మామిడికాయల సరిసేవ పులుసు చేసుకొని తినేవాళ్ళం. అదుగో ఆ పక్కన బావుంది చూడు, అందులో నీళ్ళు త్రాగి సాయంత్రం ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇక్కడే కోతి కొమ్మచ్చి ఆటలు ఆడి చక్కగా వేసవి సెలవులు గడిపేవాళ్ళం’ నాయుడుగారు మళ్ళీ ఒకమారు బాల్యానికి వెళ్లి వచ్చినంత పొంగిపోయారు.
‘ప్చ్… పట్నంలో మాకెప్పుడూ తోట చూసే అవకాశమే లేదు తాతయ్య. ఎప్పుడో పైఅంతస్థు నుండి కిందకి దిగి ఎవరో కనపడితే ఒక నవ్వు నవ్వడం తప్ప ఫ్రెండ్స్ తో మాట్లాడే అవకాశం కూడా ఉండదు.’ దిగాలుగా అన్నాడు నిఖిల్.
మనవడు దారిలో పడుతున్నాడన్న విషయం నాయుడు గారు గ్రహించాడు. అసలు విషయం ఇప్పుడే కాకుండా ఇంకా కొంచెంసేపు అయిన తరువాత అడిగితే బాగుంటుందని అనుకున్నాడు.
‘ఇంకా మీ జనరేషన్ అంటే ‘తరం’ అన్నారు కదా ఇందాక, వేరే ఇన్సిడెంట్స్ ఉంటే చెప్పండి తాతయ్య’ నిఖిలే మళ్ళీ అడిగాడు.
‘ఇన్సిడెంట్స్ అంటే… సంఘటనలా?’ తాతయ్య ప్రశ్న.
‘ఔను తాతయ్యా’ నిఖిల్ ఆంగ్ల పదాలు వాడుతున్నందుకు కొంచెం చిన్నబుచ్చుకున్నాడు.
‘మా తరం కంటే మీ నాన్న తరంలో మంచి ఆసక్తికరమైన విషయం చెబుతాను’ అన్నాడు నాయుడు గారు. ‘మరి నీవు నవ్వుకుంటావో, తిట్టుకుంటావో నీ ఇష్టం.’
నిఖిల్ చెవులు రిక్కించి వింటున్నాడు. నాన్నకి సంబందించింది గదా! లోలోన నాన్నని ఎప్పుడైనా కవ్వించే అవకాశం రావచ్చు అనుకున్నాడు.
‘చెప్పండి తాతయ్య’ అన్నాడు నిఖిల్.
నిఖిల్ కుతూహలం చూసి ఆనందమేసింది నాయుడు గారికి. అంతే ఉత్సాహంతో తరువాత కథ మొదలుపెట్టాడు.
‘ఒకసారి వేసవి సెలవుల్లో మీ నాన్న వాడి స్నేహితులతో వీధి అరుగు మీద బొమ్మ, బొరుసు ఆడుతుంటే వాడిని పిలిచి గట్టిగా రెండు అంటించాను. అంతే, వాడు కోపం పట్టలేక ఇంట్లోకి గబగబా వెళ్లి వాడి డబ్బులు దాచుకున్న సీలుకాయ (మట్టితో తయారుచేసిన కిడ్డి బ్యాంకు) బద్దలుకొట్టి ఒక తువ్వాలులో చిల్లర మూటకట్టి ఇంట్లోనుంచి పారిపోయి ఈ తోటకే వచ్చాడు. ఇక్కడ చిల్లర లెక్కబెట్టుకుంటూ ఉంటే మీ చిన తాతయ్య చూసి ఇంటికి తీసుకొచ్చాడు.
‘ఇంతకీ మీ నాన్న ఆ డబ్బు తీసుకొని ఎక్కడికి వెళదామనుకున్నావు? అని అడిగితే కలకత్తా’ అని సమాధానం ఇచ్చాడు. అప్పుడే కలకత్తా వెళ్లుంటే ఇప్పుడెక్కడుండే వాడో? ఎలా ఉండేవాడో!’ తాతయ్య గొంతులో స్వరం మారడం, కళ్ళు చెమర్చడం నిఖిల్ గమనించాడు. తలపాగా తీసి తువ్వాలుతో కంటి తడి కనురెప్ప దాటకుండా తుడుచుకోవడం ఆ మనసులో బాధ కంటే రెండు మనసులు పెనవేసుకున్న అనుబంధానికి ఒక సుగంధంలా అనిపించింది.
‘పైకి ఎంతో గంభీరంగా కనిపించినా తాతయ్య మనస్సు మాత్రం వెన్నపూస’ అనుకున్నాడు నిఖిల్. తాను మాత్రం ఏమీ గమనించనట్లు మరోవైపు చూస్తున్నాడు.
మెల్లగా తేరుకొని నాయుడు గారు తన లక్ష్యాన్ని గుర్తు చేసుకున్నాడు.
‘చూసావా! ఈ తోట వెనుక ఎంత కథ ఉందో! ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. చెప్పాలంటే నీ సెలవులు సరిపోవు మరి!!’ అన్నాడు నాయుడు గారు. కాలచక్రంలో 60 ఏళ్ళు వెనక్కి వెళ్లి వచ్చినంత సంతోషం.
‘భలే బాగున్నాయి తాతయ్యా. ఇంకా అత్తలు, పెదనాన్న కథలుంటే చెప్పు. ఇవి నిజంగా జరిగిన కథలు కదా! మా స్నేహితులకి చెబితే ఎంతో సంతోషిస్తారు. లంచ్ టైం లో నేను అందరికీ ఈ కథలు చెప్తాను’ అని ఎంతో ఉత్సాహం చూపించాడు.
‘తప్పకుండా నిఖిల్. నీవు వినాలే గానీ మీ నానమ్మ కూడా బోలెడన్ని కథలు చెబుతుంది.’ అని కథల ప్రహసనం అక్కడితో ముగించాడు నాయుడు.
ఏమైతేనేం మనవడ్ని మళ్ళీ ఉల్లాసంగా చూడగలిగాడు. ముఖంలో పూర్వపు కళ, మెరుపు చూసి ఎంతో ఆనందపడిపోయాడు. తనకి తానే ఒకసారి భుజం తట్టి ‘శభాష్’ అనుకొని లోలోన మురిసిపోయాడు.
-*****-

హైదరాబాదులో క్రిక్కిరిసిన బస్సులు, బస్తాలు మోసినట్లు పుస్తకాలు, తినడానికి అనారోగ్యకరమైన పిజ్జాలు, బర్గర్లు – చూడడానికి కోట్లకొలది మనుషులు కానీ మనసు విప్పి మాట్లాడుదామంటే ఒక్కడూ కనబడడు. ఒకడిని వెనక్కి నెట్టి ముందుకెళ్లాలని అనుకునే వారే కానీ, తాను ముందు కెళ్తూ ఇతరుల్ని కూడా తీసుకెళ్లాలన్న ఆలోచనే ఉండదు. ఎక్కడ చూసినా ఉరుకులు, పరుగులు.
ఇక్కడ మనసులతో అనుబంధాలు పెనవేసుకొని ఆప్యాయంగా, అమాయకంగా మాట్లాడేవారే అందరూ! ఎదుటి మనిషిని గౌరవించడం, సంఘీభావంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడం. సహజమైన వాతావరణం.
ఎంత వ్యత్యాసం! నిఖిల్ కి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. కానీ తాతయ్యతో తన మనసులోని మాట చెప్పదలచుకోలేదు.
‘ఈ తోటలో ఉంటే ఎందుకో నిరాశ, నిస్పృహ అనిపించడం లేదు. ఈ తోటతో తనకి కూడా కొంత అనుబంధం ఉందనిపిస్తోంది’ అనుకున్నాడు నిఖిల్. ఈ తోటలోని చెట్లు గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుంటే బాగుంటుందని మనసులో ఒక చిన్న ఆశ పుట్టింది.
‘తాతయ్యా ఈ తోటలో ఇంత మంచి చెట్లు వేసారు కదా! ఇవి నాటినపుడు ఏ ఉదేశ్యంతో నాటారు?’ కుతూహలంతో అడిగాడు నిఖిల్.
తాతయ్య నవ్వుతూ ‘చాలా మంచి ప్రశ్న వేసావు నాయనా! నీకు అర్ధం అయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ప్రపంచంలో ఉన్న జీవరాసులన్నీ ఏదో ఒక రూపంలో ప్రకృతికి సహాయ పడుతూ ఉంటాయి. అయితే మానవులకే ఇవ్వాలా, తీసుకోవలానన్న విచక్షణా జ్ఞానం ఉంటుంది. ఎక్కువ శాతం తీసుకోవడానికే ఇష్టపడతారు. అందుకే ఈ చెట్లు నాటినపుడు తమ నిస్వార్ధమైన నీడతో పండ్లు కూడా ఇస్తాయని అనుకున్నాను. కొన్ని వందల పక్షులకి గూడునిస్తాయని ఆశించాను.’ అన్నాడు.
‘మరి ఇంత పెద్దగా ఎదిగి మంచి పండ్లు ఇస్తున్నాయంటే అప్పుడు నీవెంతో కష్టపడి ఉండాలి గదా తాతయ్యా!’ కుతూహలంగా అడిగాడు నిఖిల్.
‘అవును నిఖిల్. నేను చిన్నప్పుడు ప్రతీ రోజు ఈ తోటకి వచ్చి ప్రతీ మొక్కను జాగ్రత్తగా గమనించేవాడిని. ఏదైనా పురుగు పట్టి మొక్కల పెరుగుదల ఆగిపోతే మందులు వేయడం, ప్రతీరోజు నీళ్ళు పెట్టడం అన్నీ జాగ్రత్తగా చూసేవాడిని. చిన్నపుడు పిల్లల్లో ఆత్మస్థైర్యం ఎలా పెంచ గలుగుతామో మొక్క చిన్నదిగా ఉన్నపుడు వాటికి స్తిరత్వం కూడా అలాగే కలిగించాలి.’
‘ఆత్మస్థైర్యం అంటే ఏంటి తాతయ్యా?’ నిఖిల్ అడిగాడు.
‘తనకు తానుగా నిలబడగలిగి తన మీద తాను నమ్మకం పెంచుకోవడం’ తనకి తెలిసినంతలో చెప్పాడు నాయుడు గారు.
ఈ తోటతో గత రెండు తరాలు పెనవేసుకున్న బంధం మూడో తరానికి చెందిన నాతో మరింత బలోపేతం అవుతుందని పొంగిపోయాడు.
కొద్ది నిమిషాల తరువాత ‘ఇంటికి వెళ్దాం తాతయ్యా’ అన్నాడు. నాయుడు గారు నిరుత్సాహపడినా తొత్తురపాటు కనబడకుండా సరే అన్నాడు.
దారిపొడవునా ఇద్దరూ మౌనంలో అంతర్మధనం ఆస్వాదిస్తూ ఇంటికి చేరారు.
తదుపరి వారం రోజులు నిఖిల్ తాతయ్యతో పొలం వెళ్లి అక్కడనుండి తోటకు వెళ్ళడం సరదాగా మాట్లాడడం చేస్తున్నాడు కానీ అసలు విషయం చెప్పలేదు. నాయుడు గారు కూడా అడగాలని ఉన్నా అడగడానికి సంశయిస్తూ కాలమే అన్ని సమస్యలకీ పరిష్కారం చూపగలదని తన పెద్దరికానికి ఎక్కడా భంగపాటు రాకుండా నిఖిల్ ని జాగ్రత్తగా గమనిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.
కొడుకునడిగితే కసురుకుంటాడనే ఒక ఆలోచన. నిఖిల్ ఏమీ చెప్పడం లేదు. వాళ్ళు తిరిగి వెళ్ళే రోజు దగ్గర పడుతోంది. నేనేమీ చేయలేకపోయాననే బాధ మనసును ఊగిసలాడిస్తుంది.
-*****-

సెలవులు పూర్తయ్యాయి. తిరిగి వెళ్ళే రోజు రానే వచ్చింది. ‘ఈ రోజైనా నిఖిల్ తో మాట్లాడే అవకాశం వస్తుందా!’ నాయుడు గారికి సందేహం.
ఉదయాన్నే లేచి టీ త్రాగి అటూ, ఇటూ పచార్లు చేస్తున్నాడు నాయుడు గారు.
కొడుకు కోడలు పెట్టెలు సర్దుకుంటున్నారు. గౌరమ్మ వారికి కావలసిన అప్పడాలు, సున్నుండలు, అరిసెలు, కారం, మసాలా దినుసులు ఇంట్లో పనిచేసేవాళ్ళ సాయంతో పొట్లాలు కట్టించి సంచిల్లో సర్దుతుంది. ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటూ తీరికలేకుండా ఉన్నారు.
సామానులన్నీ సర్ది ఇక భోజన ఫలహారాలు తినడానికి సిద్ధమౌతూ నిఖిల్ ని పిలవడానికి గౌరమ్మ వాడి గదికి వెళ్లి చూస్తే అక్కడ లేడు. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటాడని అనుకుంటూ స్నానాల గదిలో ఉన్నాడేమో చూడమని కోడలికి పురమాయించింది. డాబా పైన ఉన్నాడేమోనని పనిమనిషిని పంపించింది.
ఇంట్లో ఎక్కడా లేడని నిర్ధారించుకొని గబగబా వెళ్లి అరుగుమీద కూర్చున్న నాయుడు గారితో ‘నిఖిల్ ఇంట్లో లేడు. నీవేమైనా చూసావా?’ అని అడిగింది.
‘అబ్బే లేదు, వాడు పట్నం వెళ్తాడనే నేను పొలం వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నాను’ అబద్ధం ఆడాడు నాయుడు గారు.
‘అయ్యో ఎవరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు?’ తల గోక్కుంది గౌరమ్మ
నాయుడు గారు కూడా ‘గంట నుండి నేనిక్కడే ఉన్నాను, నాకు కనబడకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? నేను లేకుండా పొలం వెళ్ళడు గదా!.’ తనలో తానే గొణుక్కున్నాడు.
మళ్ళీ ఎందుకో ‘పట్నం వెళ్లాలని ఏ అఘాయిత్యానికి పాల్పడలేదు కదా!’ ఈ ఆలోచన రాగానే నాయుడు గారికి గుండె దడ పెరిగింది. ఊరంతటికీ పెద్దరికం చేసిన నాయుడు గారు మనవడు విషయం వచ్చేసరికి డీలా పడిపోయాడు. మనసు మనసులో నిలవడం లేదు. కాలు నేలపై నిలబడడం లేదు.
‘ఇన్నాళ్ళు కాలం వృధా చేసి నేను తప్పు చేసాను. నాకు ఈ ప్రాయశ్చిత్తము జరగాల్సిందే. ఈ పాపానికి నాదే బాధ్యత. దేవుడా ఈ వయసులో నాకెందుకీ శిక్ష?‘ కన్నీళ్లు ఆగడం లేదు.
మెదడు తిమ్మిరెక్కి ఆకాశం వైపు చూస్తుంటే ఆలోచనలకు ఆనకట్ట పడింది.
ఎందుకో ఒక్కసారి తోట గుర్తుకొచ్చింది.
గత కొద్దిరోజులుగా నిఖిల్ ఎక్కువసార్లు తోటకెళ్లాలని అడిగి ఇద్దరూ కలిసి వెళ్ళడం జరిగింది. ఒకమారు తోటలో చూస్తే అనుమానం తొలగిపోతుందని ఒక్కడే బయల్దేరాడు.
-*****-

ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తానొక్కడే ధైర్యంగా వెళ్ళడం ఒక సాహసమే. కానీ ఏదైనా అఘాయిత్యం జరిగి నలుగురికీ తెలిస్తే తనే బాధ్యత వహించాలన్న మనస్థాపం గుండెను పిండేస్తుంది. తెలియకుండానే పరుగు పరుగున తోట చేరుకున్నాడు. వయసుకు దగ్గ పని కాదు గానీ లెక్కచేయలేదు. వళ్ళంతా బాగా చెమటెక్కింది. దృష్టంతా నిఖిల్ పైనే వుంది.
తోట దగ్గరికి చేరుకుంటూనే కంటికి కనిపించినంత దూరం నుండి అన్ని మూలలు నిఖిల్ కోసమే తన కళ్ళు వెతుకుతున్నాయి. చెట్టో, నీడో ఏది కనపడినా నిఖిల్ అయ్యుంటాడని మరింతగా పరిగెడుతున్నాడు. అన్ని వైపులా చూసాడు. గత వారం రోజులుగా ఇద్దరూ వచ్చి కూర్చున్న గట్టు దగ్గర ఉండొచ్చని మెల్లగా అటు అడుగులు వేసాడు. తన అంచనా నిజమైంది. కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు. ఈ సారి ఆపుకోలేకపోయాడు. చిన్న పిల్లాడిలా భోరున ఏడ్చాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి నిఖిల్ ని వాటేసుకున్నాడు. ఇంకా గట్టిగా ఎక్కి, ఎక్కి ఏడ్చాడు.
‘నిఖిల్! నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. దేవుడు నా మాట విన్నాడు. మళ్ళీ నిన్ను చూడగలిగాను’ అన్నాడు నాయుడు గారు ఏడుస్తూ.
నిఖిల్ కి తాతయ్య ఎందుకు ఏడుస్తున్నాడో అర్ధం కాలేదు. కానీ తాను మాత్రం ఏ అనుభూతికి లోనుకాకుండా నిశ్చలమైన మనస్సుతో ఒక స్థాణువులా ఉన్నాడు.
ఇద్దరి మధ్య కొంచెం సేపు మౌనం.
-*****-

నిఖిల్ తాతయ్యతో ‘నా గురించి నీవు పడుతున్న బాధ నేను అర్ధం చేసుకున్నాను తాతయ్యా. కానీ మా అమ్మా, నాన్నా ఎప్పుడూ నీవు ఆలోచించినంతగా నా గురించి ఆలోచించలేదు.’ అన్నాడు.
మళ్ళీ నిశ్శబ్దం. నిఖిల్ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. వాడిని అలానే కొంచెం సేపు ఏడవనిస్తే మనసు కొంత బరువు తగ్గుతుందని నాయుడుగారు హృదయానికి హత్తుకొని తన రెండు చేతులతో నిఖిల్ వీపుపై నిమిరాడు. రెండు నిమిషాల తరువాత నెమ్మదిగా నిఖిల్ ఏడుపు తగ్గింది. దగ్గరలో ఉన్న గట్టు మీద ఇద్దరూ కూర్చున్నారు.
‘తాతయ్యా! ఇంట్లో ఎప్పుడూ అమ్మా, నాన్న చిన్న చిన్న విషయాలకు దెబ్బలాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా దెబ్బలాడుతూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో చెప్పాలో తెలీదు. కొన్నిసార్లు కొట్టుకున్నంత రాద్దాంతం జరుగుతుంది. నేను ఇంట్లో ఉన్నానన్న విషయం పూర్తిగా మరచిపోతారు.
నా గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంటాను. కొన్ని రోజులైతే భోజనం లేకుండా అలానే పడుకుంటాను. కానీ వాళ్ళేమీ పట్టించుకోరు. ఎవరి అహం వారిది. అలా కొన్ని వారాలు, నెలలు ఇంట్లో మాటల్లేకుండా కాలం గడిచిపోతుంటుంది. చిన్నప్పుడు నాకు ఏమీ అర్ధం అయ్యేది కాదు. అందుకని చదువులోపడి అన్నీ మరచిపోయేవాడిని. ఇప్పుడు చదువు మీద పూర్తిగా శ్రద్ధ పోయింది తాతయ్యా. నేనింక హైదరాబాదు వెళ్ళకూడదనుకుంటున్నాను’ నిఖిల్ తన మనసులోని మాట చెప్పాడు.
ఈసారి నాయుడుగారు విభ్రాంతికి గురయ్యారు. ‘ఇంత పిన్న వయసులో నరక యాతన అనుభావిస్తున్నాడా నా మనవడు? తనలో తానే మధనపడుతూ బాల్యంలో అంతర్మధనానికి గురౌతున్నాడా?’
‘నా పిల్లలు నలుగురికీ దగ్గరుండి పాఠాలు చెప్పకపోయినా స్పూర్తినందించే చైతన్య మూర్తులు కావాలని ఆకాంక్షించాను. ఈ ఊరొచ్చి ఉంటారన్న నమ్మకం లేకపోయినా చిన్నప్పటినుండి ఏదోరకంగా వారి అభివృద్ధికి తోడ్పడి తమ పిల్లల భవితకు బాటలు వేయగలరని ఎంతోమంది నమ్మకాన్ని వమ్ము చేయరన్న ఆశాభావం నిరాశగా మారదని ప్రశాంతంగా నిదురపోయాను.’ నాయుడు గారిలో ఉద్వేగం.
ఇద్దరి మధ్య కొంచెంసేపు మళ్ళీ నిశ్శబ్దం రాజ్యమేలింది. మౌనంలో అగ్ని గోళాలు బ్రద్దలౌతున్నాయి. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు.
‘ఈ తోటలో ప్రతీ మొక్క, చెట్టు నాతో మాట్లాడుతున్నట్లుంటుంది. ఇక్కడికి రాగానే ఆత్మీయంగా పలకరించినట్లుంటుంది. చూడు, ఈ బంతిపూవు ఎలా నవ్వుతోందో! హైదరాబాదులో మనుషులకంటే ఈ చెట్లే నయం తాతయ్యా’ అన్నాడు నిఖిల్.
నాయుడు గారు మెల్లగా ‘మీ నాన్నతో నేను మాట్లాడుతాను బాబు’ అని ఇద్దరూ వెనుదిరిగారు.
గౌరమ్మ, రాఘవ, సుశీల వీరిద్దరూ మాట్లాడుతున్న సంభాషణలు వింటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు.
నాయుడు గారు రాఘవ, సుశీల వైపు ‘మీరు చేస్తున్న నిర్వాకం ఏమిటి? వాడి బాగోగులు కనిపెట్టకుండా ఏం వెనకేసుకొస్తున్నారు? ఇదేనా మీ సంస్కారం?’ అన్నట్లు తీక్షణంగా చూసాడు. వారిద్దరూ కన్నీళ్ళతో నేలవైపు చూస్తూ ఉండిపోయారు.
గౌరమ్మ మాత్రం ‘అయ్యో నాయనా నీలో ఇంత బాధ దాగి ఉందా!’ అని నిఖిల్ ని గట్టిగా కౌగిలించుకొంది.
నాయుడు గారు నిఖిల్ దగ్గరకొచ్చి ‘నీవు బాగా చదువుకోవాలి నాయనా! ఈ చెట్లు నీకు స్పూర్తినిచ్చే మానవ రూపాలు. ఇక్కడనుండి కొన్ని మొక్కల్ని తీసుకెళ్ళి మీ బాల్కనీలో పెంచుకో.’
‘మనుషులకుండే అహం, స్వార్ధం వీటికుండవు. ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాయి. ఇంటికొస్తే పలకరిస్తాయి. బయటకెళ్తే ఎప్పుడొస్తావా అని ఎదురుచూస్తూ ఉంటాయి.’
‘ఈ చెట్లు ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి తమ ధర్మం నిర్వర్తించడానికి తదేక దృష్టితో ఏపుగా ఎదిగి తమ వారసత్వ సంపదను మనకు ఎలా పంచిపెడుతున్నాయో నీవు కూడా అలానే కొన్ని తారాలకు స్పూర్తిదాయకం కాగలవని ఆశ పడుతున్నాను’ అన్నాడు.
తాతయ్య ఆశీర్వచనానికి సంతోషంతో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ‘అలాగే తాతయ్యా’ అన్నాడు నిఖిల్.
‘ఏదైతేనేం ఈ తోట ముచ్చటైన మూడోతరానికి కూడా చరిత్రగా నిలిచింది’ అన్నాడు నాయుడు గారు.
మల్లికేశ్వర రావు కొంచాడ
మెల్బోర్న్, ఆస్ట్రేలియా

Scroll to Top