అమ్మను నమ్మితి

నా మనమ్మున సువాక్కును నిల్పిన వాగ్దేవిని నమ్మితి
నిర్మల నా హృదయమ్ము నీదుగ చేసిన ఉమాసుతుని నమ్మితి
కమ్మని కళనిమ్మని యడిగిన కావ్యమ్ము చదువుకొమ్మని
యానతినిచ్చిన చదువుల తల్లిని నమ్మితి
కవితాస్త్రాలయ కధలు కధనాలు కవితల కవనాలు
కొమ్మలు గల కావ్యకన్యను నమ్మితి
ప్రవాసమ్మున తెలుగు భాషను ప్రవాహమ్ముగా
సమాచరించమన్న నీ ఆనతి నమ్మితి
సమ్మతిగ గెలుపొందిన నా హితులను నమ్మితి
పార్వతీ పరమేశులంటి జననీజనకుల నమ్మితి
అడగక నాకిచ్చిన బంధు పరివారము నమ్మితి
నా హృదిని మంచి భావమ్ముతో ముంచెత్తి
వాగ్భూషణమిచ్చిన అంబను నమ్మితి
కలుపు లేని మంచి తలపుల నిచ్చి
మది పులకింపుల గిలిగింతలు కలిగించిన
అమ్మ భారతీ నిన్ను సదా నమ్మితి

Scroll to Top