ఉగాది కవిసమ్మేళనం

దూరమైనను నించుక భారమనక
ఎట్టి భయమును లేక మేమిందరమును
ప్రాచ్యదేశానికేతెంచి పరవశించు
చున్న, మాతృప్రదేశమ్ము నెన్నెదము మదిని!! 1

చింతపండు లేక చిరుధాన్యములు లేక
వెనిగరే శరణ్య మనుచు వేరు
దిక్కులేక, యిచటి తినుబండములలోన
దినుసుమార్చి తినుచు తిరిగెదమిట 2

కన్న వారల మరి సన్నిహితులందరన్
వదలి పెట్టి ఒంటి వారమైతి
మిచట సమయ మెరిగి యెంతయో స్పూర్తితోడ
సాగుచుంటి మయ్య సాధు రీతి 3

ఉరక లెత్తేడి బ్రతుకులో ఊరు మరచి
పరుగు లెత్తేడి నడకలో కరగిపోయి
తీరికనునది లేకయే కోరికలకు
బానిసలమగు రీతియే భారమయ్యె 4

ఇంటి సరుకు తోడ ఇంటింట పండుగ
తెలుగు దనము కూర్చి తేనెలొలుక
పంచె చీర విధము యంచితమగుచుండ
మంచి మాటలెల్ల మధురమయ్యె 5

తెలుగు భాషయే కలగల్పి వెలుగులీన
తరతమంబులు లేక యందరము కలిసి
భావి జీవిత లక్ష్యంపు బాట వేసి
సాగ నెంచితిమిచ్చోట సాధు లగుచు 6

మాట లాడుట కొఱకు మా మదిని తలచి
ఫోను ఎత్తిన చాలట మేను మరచి
బిల్లు ఎంతగునోయని భీతి చెంది
మిన్నకుందుము మౌనాన ఖిన్నపడుచు 7

పెళ్లి మాట యనిన పిల్లలొప్పకయున్న
గుండె లోన యెంతొ గుబులు పుట్టు
నెప్పు డగునొ పెళ్లి నేమిచేయుదుననగ
చెప్పజాలనైతి తిప్పలయ్యె 8

చదువు కొనగ వచ్చి పొదుపు చేయగనెంచి
దొరికిన పని జేసి దొరల చెంత
పగలు రేయి యనక పడినకష్టాలెన్నొ
చెప్పరాని వయ్యె చేదు గతులు 9

క్రొత్త దేశము మరియు క్రొంగొత్త ప్రజలు
మిన్ను దాకెడి భవనాలు చెన్ను మీర
సుందరమ్మగు వనములు సొంపు నింప
చూడ ముచ్చట గానుండి శోభ లొసగె 10

కాలక్రమమున మేమిట కలసిపోయి
తెలుగు సంపద నిచ్చోట నిలుపుకొనుచు
తెలుగు దీప్తుల దశదిశల్ వెలుగునట్లు
దీక్ష బూనితిమయ్య మా తెలివి మేర 11

కాని దేశము కావున ఖచ్చితముగ
గొప్ప క్రమశిక్షణము బూని కూర్మి నింపి
కలిసిపోవుదమిచ్చట గల జనంబు
తోడ క్షీరనీరన్యాయ ధోరణి వలె! 12

కూత బండినెక్కి కూర్చొనగ నపుడు
ప్రక్క నున్న వాడు పలుకు తెలుగు
చక్కనైన భాష చక్కర తేనియన్
గల్పినట్టులుండు ఘనముగాను 13

తెనుగు వంటలన్ని మనకు దొరకుచుండ
పూట కూళ్ళ యింటి ఫుడ్డు ట్రక్కు
నిండ, చింత లేదు పండగ పూటయున్
సంతసానతినెడి సరణిగలదు!! 14

నృత్య, సంగీత నర్తన నిత్య మయ్యె
పద్య రచనారవళి మాకు ఉద్యమమయె
కవిత మాకొక క్రీడగా కానిపించు
వాటి వినవచ్చు మీకివే వందనాలు! 15

Scroll to Top