గృహిణి లేని గృహము

గ్రహ గతులు తప్పిన గగనము,
,గ్రహణం పట్టిన , రవి ,రేరాజుల తోయం ,
శాంతి సౌఖ్య సౌభాగ్య ,శూన్యం ॥గృహిణి ॥

ప్రతి కార్యమునకు, ,సలహా సంప్రదింపులు,
ప్రతి అక్కరకు ఇల్లాలి అగత్య మెంతో,
మెట్టి నింటిని గౌరవించి ఆదరించు కోడలు,
పుట్టినింటిని సదా ప్రేమించు పుత్రిక ,
పతిదేవుని ప్రణయ సీమల
విహరింప జేయు మగనాలిగ ॥గృహిణి ॥

కన్నబిడ్డల కన్నుల నుంచి
కాచి పెంచు కారుణ్యమూర్తి
ఎన్నికైన మైత్రీ ,బాంధవ్య బంధములు ,
నైతిక విలువల దెలిపి బుద్ధి, సుద్దులు గరపి ,
అడుగులు నడతలు తడబడనీక ,
అనుక్షణం శ్రమించి ,సమీక్షించి
అనుంగు బిడ్డల భవిత
బంగారు బాటగా మలచు మాతృ మూర్తి ॥గృహిణి॥

కలిమి లేములు కష్ట సుఖాలు,
కాని బాధలు ఏవైన కలసి మెలగు ,
చేకొన్నవాని చేయూతగ ,
చిన్న పెద్ద ఉద్యోగ విధుల శ్రమించి ,
ధన సముపార్జనతో సహకరించు
సహధర్మ చారిణి॥ గృహిణి ॥

తర్జన భర్జనలు, తగాదాలన్ని ,
తీరుగ సామరస్య విధిని ,
సమన్వయ పరచి గృహము
శాంతి సౌఖ్యముల విలసిల్లజేయు
శాంత స్త్రీమూర్తి ॥గృహిణి॥
—————————————–
కామేశ్వరి సాంబమూర్తి భమిడిపాటి

Scroll to Top