తెలుగు అక్షరం

పక్షపాతం లేని అక్షరం ఎప్పుడూ నీ పక్షమేనంటుంది
మునివేళ్ళతో దిద్దించుకొని మురిసిపోవాలనుకుంటుంది
మనసున్న కవులతో మదిని పులకరింప చేస్తుంది
తానంటే ఇష్టమైన వారి వైపు క్రీగంట చూస్తుంది

పదాల మధ్య ఒదిగొదిగి పొందికగా ఇముడుకుంటుంది
పదాల పల్లవై భావాల చరణమై పాటతో సంగీతం పలికిస్తుంది
సంగీత బాణీకి స్వరాలాపనై నృత్య రూపకంగా నాట్యం చేస్తుంది
సప్తస్వరాల సుమధుర గీతాల చదువులమ్మతల్లి అక్కున చేరింది

ముసిముసినవ్వుల ముద్దమందారంలా మారాము చేస్తుంది
సునిశితమైన మానవతా సంబంధాలు సుందరంగా వర్ణిస్తుంది
సమాజంలోని అసమానతలపై మంత్రదండమై మందలిస్తుంది
మమతల అల్లికలో మల్లెల సువాసనలు వెదజల్లుతుంది

పల్లె పాటకు జనపదాలకు జానపదమై జ్వలిస్తుంది
కావ్యాల కనికట్టు గ్రంథాల గూఢము గుప్తంగ ఉంచుతుంది
ధరణిలో చరిత్రకు ధవళారుతులు పట్టి ధగధగా మెరుస్తుంది
అజరామరమైన అమర భాషకు వెన్నెముకగా నిలుస్తుంది

పదహారణాల పల్లె పడుచులా అందానికే వన్నె తెస్తుంది
సరసాల సందడితో వగలాడి వయ్యారాలు వలకబోస్తుంది
అమ్మ, అక్క, అన్న, అత్తా అన్నీ తానై పలకరిస్తుంది
ఔనన్నా, కాదన్నా నేనున్నానని కలిసివస్తుంది

—మల్లికేశ్వర రావు కొంచాడ, మెల్బోర్న్, ఆస్ట్రేలియా

Scroll to Top