తెలుగు అక్షరము – సీస పద్యమాలిక


సీ.
తెలుగు యక్షరములు తేనెలొలుకుచుండ
     అమ్మభాషకు నెంతొ యంద మొసగ
తల్లిభాషమనకు తలమానికమటంచు
     ఎల్లలెరుగకుండ ఎదిగినావు
తెలుగు భాష మనకు వెలుగు చూపుననుచు
     ప్రముఖులందరు కూడి పరవశించె
వాజ్మయి తోడుగా వంతపాడగ నేడు
     ప్రణతులిడుతునీకు ప్రజ్ఞతోడ – 1

సీ.
సిరిగలవానికి సరిపోలు గీతమై
     సరస సందేశమ్ము వరస గూర్చు
శివమెత్తి పాడంగ శివగంగ పారంగ
     భవుడు మెచ్చెను నిన్ను భాగ్యమనుచు
సిరులు కురియు నట్టి సింగారమును గల్గి
     పరులసూయపడెడి సరళ రూపు
వయ్యార మునుపంచు వగలాడి వైనీవు
     సరస సంభాషణము సలుపగలవు – 2

సీ.
ఒక పాట స్వరములై నొక పాద గణములై
     ఒక పద్య పాదమై వికచ మయ్యె
సాహితీ వనములో సౌగంధములు జల్లి
     సుందరమౌ తెల్గు నందనమయ్యె
సంగీత సభలలో సంప్రీతి నొందించి
     రాగాల కృతులలో రమ్యమయ్యె
గాయనీ గాయక గాత్రంబు పసిగట్టి
     గరళ కంఠుడు మెచ్చె ఘనముగాను – 3

సీ.
కావ్యప్రవచనాలు కవనధారలు కాగ
     పద్యనాటకములు ప్రగతికెక్కి
లలితార్ధ్ర లహరులు సెలఏరులైపొంగి
     శతక కావ్యములిట సంతరించె
అవధాన ప్రక్రియలు అవధులు దాటంగ
     ఆనందముప్పొంగె నంతరమున
సకల సంపదలతో సౌభాగ్యముగనిల్చె
     నిష్పక్షపాతమై అక్షరమ్ము! – 4

సీ.
మా పల్లె పాటకు గోపల్లెగామార్చి
     మంచిపదములెంచి పంచినావు
మనసున్న కవులతో మమ్ములను కలుపుచు
     కవితలల్లించిగ కథలు చెప్పి
క్రీగంట చూపుల గిలిగింతలను పెట్టి
     వరసనవ్వులతోడ వరలుచుండు
సరస సయ్యాటలు సాహితీ సుమములై
     సంధ్యకాంతుల తోడ సంతరించె – 5

సీ.
అసమానతల దృంచి ఆదరమ్మును పెంచి
     అందరి గౌరవమందజేసి
స్వపర భేదమ్ములు సమ్మతింపకుమని
     మానవాళినొక సోపానమొసగి
నీతివాక్యములందు నిండుదనముతోడ
     నిక్కముగానుండు చక్కగాను
ఎంతని వర్ణింతు ఏమని చెప్పెద
     నీదు ప్రతిభ నెంచ లేదు శక్తి – 6

సీ.
మమతలల్లినతల్లి మంచి మాటలు జెప్పి
     మనసు హాయిని గొల్పె మరల మరల
మునివ్రేళ్ళు జోడించి మురిపాన వ్రాయగా
     ముసిముసి నవ్వుల ముత్యమయ్యె
ఇతిహాస గ్రంథాలు ఇంపైన కథలలో
     ముద్దుగానుండు మున్ముద్దు కాగ
నిక్షిప్తమైయున్న నిధివంటి భావాలు
     సంక్షిప్తముగ దెల్పు సంహితముగ – 7

సీ.
పదహారణాల సంపన్న పడుచువీవు
     పరువంపు నగవుతో పలుకరించు
జడగంట జుంకాలు జాజుల యందాలు
     కురుల పేర్చగ నీవు సిరులు కురియ
పల్లెయందము చూడ పలుతీర్లు వర్ణించి
     మల్లె మందారమై పల్లవించు
మాయింటి తరుణివై మహలక్ష్మి సిగనుండి
     జాలువారిన విరి జగతి మెచ్చ – 8

సీ.
అమ్మ యక్కయు నీవెయై ప్రేమలొలుకగా
     పలుకరించెడి తీరు బహు విధమ్ము
బంధాలు నాత్మీయ బంధంబు వర్ణింప
     బలమైన శక్తిగ మలచి నావు
మమతలల్లి మదికి మల్లెల వాసన
     వెదజల్లి మమకార వెల్లువయన
సునిశిత సుమధుర సుగుణాల రాశివై
     తెలుగు ఆక్షరమ! మా వెలుగు నీవు – 9

సీ.
నిలువెత్తు లక్ష్మివై యిలకీర్తికాంతవై
     తెలుగు భాషకునెంతొ వెలుగునిచ్చి
అక్షర క్రాంతిగా ఆకాశ వీధిలో
     నక్షత్ర కూటమిన్ నడచుచుండ
మిరుమిట్లు గొలుపుచు మేరుపర్వతమంత
     ముదమంది మదిలోన మురియుచుండ
వందనమ్ములు నీకు వాజ్మయ పుత్రికా!
     వరదవై మాకిట వరములిమ్ము

తే.గీ
పక్షపాతము లేకుండ యక్షరములు
శక్తి నంతయు చూపించి యుక్తిమేర
సాహితీ స్రవంతి ఘనత సౌమ్యమనగ
నింగి నంటెనాస్త్రేలియా నిండుదనము – 10

మల్లికేశ్వర రావు కొంచాడ

Scroll to Top