నడిరేయి….

నడిజాములో నిను నిద్దరలేపి
నువ్వూహించని ప్రశ్నలు అడిగి
నీ తలపుల తలుపుల తాళం తీసి
నీ చుట్ట్టూ చీకటిబూజులు దులిపి
నీ కనులకు కమ్మని కలలను తొడిగి
నీ మనసుకి హాయిని పంచే
ప్రణయవిపంచిని మ్రోగనిస్తా!
నీ ఊహకి స్థాయిని పెంచే
స్ఫూర్తిగీతికలేవో ఆలపిస్తా!

రాతిరినదిలో మిలమిలలాడే
కోటితారకల కలువల నడుమ
సంపూర్ణచంద్ర హంసాహాసాన్ని
నీ మనోఫలకంపై ఆవిష్కరించి
నా కవితాధారతో అభిషేకిస్తా!

వ్యోమసాగరం అవతలి ఒడ్డుకి
ఊహానౌకలో నిను తీసుకువెళ్ళి
బ్రహ్మాండాన్ని బద్ధలు కొట్టిన
సృష్టిస్థితిలయ కారణమూర్తుల
ఐక్యరూపమౌ అద్వైతమూర్తికి
సప్తస్వరదళ సహస్రసుమాలతో
అపూర్వరీతిగ అర్చన చేస్తా!

ఆకాశం తన ప్రేమనంతా
మబ్బులుగా మార్చి కుమ్మరించగా
ఆ కురిసే చినుకులు ప్రేమలేఖలై
వడివడిగా ఈ భువిని చేరగా
ఈ వాన కోసం వేచిన వసుధ
పులకించి పంచిన సంగమగంధం
వాసనలన్నీ వివరిస్తా, వర్ణిస్తా!!

–రమాకాంత రెడ్డి మెల్బోర్న్

Scroll to Top