భోగజోగి

సాగుబడిలో పశ్చిమానా
కలుపుమొక్కవు మడిలోన
నాణ్యమైన విత్తువైనా
నారుమడిలో నేలవంగిన నువ్వెవరు….

మలయమారుతం కాలేక
ద్వీపదీపం కాంతిగాక
దిక్కులేని పశ్చిమానా
దిగులుపడినా నలుపురాయిల నువ్వెవరు….

సనాతనంలో పునీతంకాక
సంఘసేవ ఎంగిటాకులా
ప్రక్కటెదురుల బెరుకులాగ
పండ్లగంపలో పాసిపొయిన నువ్వెవరు….

నీరులేని పంటచేనులో
తర్రుతాలు దిగుబడేరా
అంటుగట్టిన చెట్టుకొమ్మలా
సంకరపు వంకరలైన నువ్వెవరు…

అరువుసడిల అక్షరాలతో
ఆగమైన అంగిలాగుతో
సలుపుతున్న రాచపుండుతో
తూలుతున్న భోగజోగి నువ్వెవరు….

-ప్రభాకర్ బచ్చు

Scroll to Top