వయసు – చేదు నిజాలు

ఎన్నెన్నో మలుపులు తిరిగిన వయసు
అనుభవాల అంచులు చూసిన వయసు
కష్టాలెన్నో దాటి అలసి పోయిన వయసు
నిశ్చింతగా కాలం గడపాలనుకునే వయసు

పిల్లలక్షేమమే పరమార్ధం అనుకున్న వయసు
మొన్నటి దాకా అందరిలాగే ఛెంగున దూకిన వయసు
పోను పోను కళ్ళు కాళ్ళు స్వాధీనం కాని వయసు
ఇపుడెందుకూ పనికిరామని మథనపడే వయసు

రెక్కలు వచ్చి పిల్లలు ఎగిరితే సంతోషించిన వయసు
ఊరూరా తిరిగి వాళ్ళకు సరైన జోడీని కుదిర్చిన వయసు
జోడీ రాగానే విడి విడి బ్రతుకులై కుదిపేసిన వయసు
అర్ధంకాని ఈసడింపుల రంపపు కోతల వయసు

మనుమలు మనవరాళ్ళతో గడపాలనుకునే వయసు
ఆలుమగలు ఒకరికొకరు తప్ప ఒంటరైన వయసు
గతంలో తీయటి ఙ్ఞాపకాల్ని నెమరేస్తున్న వయసు
మళ్ళీ అరవై ఇరవై అయితే బావుణ్ణన్న వయసు

సొంత వూరిలోనే ప్రవాస జీవనమైన వయసు
ఎవరైనా ప్రేమతో పలకరిస్తారని ఎదురు చూసే వయసు
ఊహించని ఆర్ధిక అసమానతల మధ్య నలిగిన వయసు
మనుషులకన్నా చేతికర్రతో సావాసం మేలిమన్న వయసు

వయసు …
ఓ మనసున్న వయసు …
దేనికో ఈ తపసు !

—Dr. వేణుగోపాల్ రాజుపాలెం

Scroll to Top