సుమ్మ గుడ్డ!

అప్పటి గేపకం!

అమ్మని!
ఇంటి ముందు
చెట్టు కొమ్మ!
లెమ్మని ఎపుడు
లేపిందో గానీ!

నిమ్మళంగా నిద్రోతున్న
నా నుదిటిపై!
ఓ కమ్మని సంతకం!

గాఢ నిద్ర ఊరి
మధ్య దారిలో!
సుమ్మ గుడ్డ తో
అమ్మ నడక!

కులం కంచె కట్టిన
ఊర బావి నీరు!
కడవలో ఒంపేందుకు!
వూపిరి గాలి కూడా,
సేద కి తెలిసేది కాదు!

భళ్ళున తెళ్ళారాక!
అమ్మ నెత్తిన!
సుమ్మ గుడ్డ పై!
తట్ట మొలిసేది!

గట్టు మన్ను ఎత్తుతోనో!
మట్టి పెళ్ళలు మోస్తోనో!
పెంట కసవ పెరుకుతోనో!

సుమ్మ గుడ్డ!
సున్నితంగా,
అమ్మ తలకు ఆసరా అయ్యేది!

గోధూళివేళ కు,
ఎండ మొత్తం!
చెమ్మగా మారి!
సుమ్మ గుడ్డలో ఇంకి పోయేది!

మునిమాపు వేళ!
హమ్మయ్య!
అని అమ్మ !
సుమ్మ గుడ్డని!
సిలక్కొయ్యకు తగిలిస్తే!

అంత వరకు!
భావురు మంటూ!
అవురు మంటున్న!
ఇంటాకలి!
బ్రేవ్ మనే చిన్న తేన్పు!

సిలక్కొయ్య పై,
సుమ్మ గుడ్డ!
రేపటి ఆకలికి దాపలాగ!
మటం వేసుకునేది!

భరోసాగా!
అమ్మ చెయ్యి!
నా కడుపు పై!
జోలాలి దరువేసేది!

సుమ్మ గుడ్డ!
ఆనాడు!
అమ్మ సొత్తు!
మా ఆకలికి పొత్తు!

మీ…✍🏼విక్టరీ శంకర్ పాతపత్నం, శ్రీకాకుళం జిల్లా

Scroll to Top