తాయి నృత్యాంజలి

శివతాండవంతో కైలాసగిరి వాసుని భూలోకానికి రప్పించారు. శివ ధనుస్సుని విరచి సీతను పెండ్లాడిన రామయ్య ఘట్టం రసరమ్యతతో మెప్పించారు. భామాకలాపంతో సత్యభామ వయ్యారాలకు వంత పాడారు. ‘ఒకపరి నొకపరి’ అన్నమాచార్య కీర్తలకు అవపోసన పట్టారు. కూచిపూడి జావళీలను అవలీలగా చేసి చూపించారు. దశావతారాల దర్శనం చేయించారు. ప్రేక్షకులందరినీ రసాస్వాదనలో ఓలలాడించారు. తరతరాల మన సాంప్రదాయాలను నృత్యరూపంలో తీర్చిదిద్దిన ఎందరో గురువులను గౌరవభావంతో స్మరించారు, తరించారు.

మొదటిసారి…
నాట్యమే ప్రధానాంశంగా కూచిపూడి నాట్యానికి అంజలి ఘటించి మెల్బోర్న్ నగరంలో మొదటిసారిగా తెలుగు సంఘం నిర్వహించిన ‘నృత్యాంజలి’ కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరంగా జరిగింది. వివిధ సంస్థలలో నాట్యం నేర్చుకుంటున్న శిష్యులతో పాటు గురువులు కూడా రంగస్థల ప్రదర్శన చేసి ప్రేక్షకులను మంత్రముగ్డులను చేసారు. కళలకు నిలయమై, రాసాస్వాదకుల స్వంతమైన సువిశాలమైన మెల్బోర్న్ నగరంలోని వివిధ ప్రాంతాలలో కూచిపూడి నాట్యం నేర్పిస్తున్న ఎన్నో సంస్థల సమన్వయంతో నిర్వహించిన కార్యక్రమం అత్యంత మనోహరంగా జరిగింది. తెలుగు వారి సాంప్రదాయమైన కూచిపూడి కళకు ఇంత ఆదరణ ఉందా అని ముక్కున వ్రేలు వేసుకున్నవారు లేకపోలేదు. వయసుతో సంబంధం లేకుండా సుమారు 60 మంది కళాకారులు విభిన్నమైన నృత్య రూపకాలు ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యచకితులను చేసారు.

అజరామరం…
ఒకప్పుడు ఇటువంటి శాస్త్రీయ కళలు ప్రదర్శిస్తే ‘ఎవరు చూస్తారు?’ అని ప్రశ్నించిన రోజులున్నాయి. కానీ ఈ కార్యక్రమానికి కూర్చోవడానికి కుర్చీలు లేకపోయినా ఆద్యంతమూ నిలబడి చూసిన ప్రేక్షకులబట్టి మన సత్సాంప్రదాయ కళలు అజరామరమని చెప్పకనే చెబుతున్నాయి. వేల సంవత్సరాల సంస్కృతి కలిగిన ఏ సమాజానికైనా ఎత్తు పల్లాలు ఉండడం సర్వసాధారణం. అలాగే కొన్ని సమయాలలో ఇతర భాషా సంస్కృతులు పైచేయి వలన మన కళలకు గుర్తింపు తగ్గిందే కానీ, వాటి మూలాలు మరుగున పడలేదు. ఇటువంటి కార్యక్రమాలు ఇకముందు కూడా నిర్వహించి మన కళలకు సమున్నతమైన స్థానాన్ని కల్పించాలని పలువురు కోరుకుంటున్నారు.

గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ సంస్థ అధినేతలు నిత్యం వారి వారి ఉద్యోగ నిర్వహణ చేస్తూ, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ మన కళ పట్ల ఉన్న అభిమానంతో భావితరాలకు అందివ్వాలన్న తపనతో అకుంఠిత దీక్షతో ఎంతోమంది పిల్లలకు కూచిపూడి నృత్యం నేర్పించడం ముదావహం. వారందరికీ ఇక్కడి తెలుగు సమాజం నీరాజనం పడుతోంది. ఇదొక యజ్ఞంలా ఈ బృహత్కార్యాన్ని చేపట్టిన వారందరూ శ్లాఘనీయులే.

విన్నపం…
గురువులందరికీ ఒక విన్నపం. శతాబ్దాల క్రితం మన సిద్ధ గురువులు రూపుదిద్దిన వన్నె తరగని ఎన్నో రూపకాలను మనం ప్రదర్శిస్తూ వస్తున్నాము. అందులో మన పురాణాలు, ఇతిహాసాల్లోని వైవిధ్యమైన పాత్రలను సజీవ పాత్రలుగా చిత్రీకరించి మనకందించారు. మన జీవనశైలి, సామాజిక పరిస్థితులు, మొదలైన సమకాలీన పరిస్థితులకనుగుణంగా సందర్బోచితమైన పాత్రలను సృష్టించి నృత్య రూపకాలను కృషి చేసి సృష్టించగలిగితే బాగుంటుంది. దీని ద్వారా పిల్లలకు ముఖ్యంగా కూచిపూడి నృత్యంలోని మెళుకువలు నేర్చుకొని క్రొత్త నృత్య రూపకాల దిద్దుబాటులో ప్రావీణ్యత పెంపొందించుకోగలరని ఆశాభావం.

కార్యక్రమంలో పాల్గొన్న కూచిపూడి సంస్థలు:
1. శ్రీ సాయి నటరాజ కూచిపూడి డాన్స్ స్కూల్ – శ్రీమతి శ్రీదేవి చల్లపల్లి
2. అభినయ నృత్యమాల కూచిపూడి డాన్స్ స్కూల్ – శ్రీమతి పద్మ చిలకమర్రి
3. నృత్యరూపం – శ్రీమతి రూప ప్రవీణ్
4. సాయి నృత్యాలయ – సాయి శ్రావణి తటికోల
5. నాట్యప్రియ కూచిపూడి డాన్స్ స్కూల్ – శ్రీమతి స్వప్నశ్రీ మూగ
6. తరంగిణి డాన్స్ – శ్రీమతి శ్వేత బొల్లం
7. నర్తనశాల అకాడమీ అఫ్ మ్యూజిక్ & డాన్స్ – శ్రీమతి శ్రావణి తెన్నేటి
8. విశ్వ తాండవం డాన్స్ అకాడమీ – శ్రీమతి రమ్య గుంటుపల్లి

ఈ కార్యక్రమానికి శ్రీమతి వింధ్యవాసిని వంగిపురం గారు వ్యాఖ్యాతగా, ధ్వని బ్రహ్మ శ్రీ వడ్డిరాజు శ్రీనివాస్ గారు శబ్దగ్రాహకులుగా సహాయ సహకారాలందించారు. కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన స్వచ్చంద సేవకులకు, వ్యాపార సంస్థలకు తాయి అధ్యక్షులు శ్రీ చక్రి చయనం గారు కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top