ప్రస్తుతం కాలంలో మధుమేహ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నిజానికి జీవక్రియకు సంబంధించిన అనేక శారీరక విధులను నిర్వహించడానికి నిద్ర ఎంతో అవసరం. మంచి నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనకు తెలుసు. కానీ, మనలో చాలామందికి పరిమితికి మించి నిద్రపోవడం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని తెలియదు. అంతే కాదు నిద్ర పోయే సమయాన్ని తరచూ మార్చుకునే వారు షుగర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని కొత్త పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
షుగర్ వ్యాధిగ్రస్తులు తమ జీవనశైలి విషయంలో చాలా విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాధిని ఆహారం, జీవనశైలిలో మార్పులు, వ్యాయామం ద్వారా మాత్రమే నియంత్రించవచ్చు. అయితే నిద్ర కూడా మధుమేహం ఉన్నవాళ్లకు చాలా కీలకమైనది. ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడుతుంటే అది అతని నిద్ర విధానాన్ని ప్రభావితం చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్ తన షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవటం కోసం కనీసం ఏడెనిమిది గంటలపాటు మంచి నిద్రపోవాలని వైద్య నిపుణులు చెబుతారు.
అయితే తాజా పరిశోధన ప్రకారం ప్రజలు తమ నిద్ర వ్యవధిని 31 నుంచి 45 నిముషాల పాటు మార్చుకోవడం అంటే పడుకొనే సమయాన్నిపెంచడం లేదా తగ్గించడం వల్ల 15 శాతం డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. ఇదే వ్యవధి గంటకు మించి ఉంటే ఆ ప్రమాదం 59 శాతం పెరుగుతుందట. అంటే అతి నిద్ర, నిద్ర లేమి రెండూ కూడా డయాబెటిస్‌కు దారితీసే ప్రమాదం ఉందన్న మాట. నిద్ర లేకపోవటం వల్ల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడటమే కాకుండా తీవ్ర రక్తపోటు, ఊబకాయం, మానసిక ఒత్తిడి, హృద్రోగ సంబంధ వ్యాధులు సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.