ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో వచ్చే పండుగ దీపావళి. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందగా జరుపుకుంటారు. దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి.. నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ. హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్తులు ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినమే దీపావళి ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ ఏడాది కొందరు అక్టోబరు 31న, మరికొందరు నవంబరు 1న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటో తెలుసుకుందాం
పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రజలాలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతరమెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్దరిస్తాడు. ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుని చూసి, నిషిద్దకాలమైన సంధ్యా సంయములో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షసలక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెపుతాడు.
ఆ మాటలకు బాధ పడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి, కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్లిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది.
జనకమహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యొతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగ భావిస్తూ చక్కగా పూజచేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరిని ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధముగా కొన్ని యుగాలు గడిసిపోయాయి. అహంకారముతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన అదితి మాత చెవికుండలాలను తస్కరించి దేవతలను, దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమయిన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకుని సంహరించమని ప్రార్థిస్తారు.
అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది. కానీ ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ గుర్తులేవు. ఆ సత్యభామ దేవి నేను కూడా మీతోపాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుడిని అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలసి అశ్వసైన్యంతో ప్రాగ్జ్యోతిష్యపురము వెళతాడు.
అక్కడ శ్రీ కృష్ణుడికి నరకాసురునికి మధ్య ఘోర యుధ్ధము జరుగుతుంది. కాని విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వలన నరకుడిని సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుధ్ధమధ్యలో మూర్చపోయినట్లు నటిస్తాడు. కళ్ళముందు భర్త మూర్ఛపోవటము చూసిన సత్యభామదేవి వెంటనే, విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురనమీదకు బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతులతో మరణిస్తాడు. బంధింప బడిన రాకుమార్తెలు మమ్ములనందరిని నీవే వివాహమాడమని ప్రార్ధిస్తారు. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ వివాహమాడుతాడు.
ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజుని నరకచతుర్దశి అంటారు. ఈ రోజు ప్రతి సంవత్సరం ఆశ్వీజమాసం కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది. ఆ రోజునా నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు. ఆ తరువాత రోజు, అంటే ఆశ్వీజమాస అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు.
బౌద్ధ జాతక కథల్లో దీపోత్సవం, దీపదానానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. బుద్ధుని చుట్టూ దీపాలు పెట్టి పూజించేవారని కూడా వాటిలో ప్రస్తావించారు. దీపావళికి కూతురిని, అల్లుడిని ఇంటికి పిలిచే ఆచారం పూర్వకాలంలో ఉండేది. అందుకు ప్రమాణంగా నాగానందం అనే కావ్యంలో విశ్వవసు అనే రాజు తన పుత్రిక మలయవతికి దీపావళి సందర్భంగా పుట్టింటి మర్యాదలు చేసినట్లు ఉంది. విజయనగర సామ్రాజ్య కాలంలో దీపావళిని అంతులేని ఆనందోత్సాహాలతో జరుపుకునే వారని చరిత్ర చెబుతోంది. దీపం వెలిగించడం వల్ల అపమృత్యువు నశిస్తుంది. అమావాస్య, చతుర్దశి రోజుల్లో దీపదానం చేయడం వల్ల యమబాధ తొలుగుతుంది.
దీపం వెలిగించడం జ్ఞాన ప్రచోదనకు సంకేతం. మన చుట్టూ ఉన్న అజ్ఞానమనే చీకటిని పారద్రోలి విజ్ఞానమనే కాంతిని ఆహ్వానించడమే దీపారాధనలో అంతరార్థం. దీపం వెలుగులో మనకు మూడు రంగులు కనిపిస్తాయి. అవి నీలం, పసుపు, తెలుపు. ఈ మూడు రంగులు త్రిజగన్మాతలైన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతికి ప్రతిరూపాలు. అంటే దీపారాధన చేయడం ద్వారా శక్తి త్రయాన్ని అర్చించినట్లవుతుంది. మరోకోణంలో మనిషిలోని సత్వ, రజ, తమో గుణాలకు దీపకాంతిలోని మూడు రంగులను ప్రతిరూపాలుగా చెప్పుకోవచ్చు.
ఏదిఏమైనప్పటికీ దీపారాధన మనిషిలోని జ్ఞానచైతన్యాన్ని ఉద్దీపనం చేయడానికి ఉపకరిస్తుంది. దీపావళి వచ్చేనాటికి వాతావరణం ఎంతో తడిగా ఉంటుంది. వర్షాల కారణంగా క్రిమికీటకాల సంచారం ఎక్కువ అవుతుంది. దీపావళి టపాసుల నుంచి వచ్చే పొగ వీటిని నశింపజేస్తుంది. టపాసుల నుంచి వచ్చే ధ్వనికి భయపడి క్రూరజంతువులు ఇళ్లనుంచి దూరంగా వెళ్తాయి
ధన త్రయోదశి..
ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మీ, కుబేరులను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. బంగారం, వెండి కాకుండా ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసి శుభం జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృతభాండం అవుతుందని చాలా మంది నమ్ముతారు.
ధన్వంతరి జయంతి..
ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. ఆరోగ్యమే మహాభాగ్యం.. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీరసాగర మథనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్యశక్తులతోపాటు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలివచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుని అంశ అని.. ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధన త్రయోదశి ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది.