పోషకాల నిధి పిస్తా

పిస్తా పప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి పోషకాల నిధిగా పేరుపొందాయి. అయితే, వీటిని మితంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటిలో కేలరీలు కూడా ఎక్కువ ఉంటాయి. రోజుకు గుప్పెడు (సుమారు 30 గ్రాములు) పిస్తా పప్పులు తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పిస్తా పప్పులో మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కండరాల నిర్మాణానికి, శరీర ఎదుగుదలకు ప్రోటీన్ చాలా అవసరం. పిస్తా పప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి ఫైబర్ సహాయపడుతుంది. ఈ పప్పులో ఇవి దండిగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పిస్తాలో ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

విటమిన్ బి6, థయామిన్, విటమిన్ ఇ వంటి విటమిన్లు పిస్తాలో లభిస్తాయి. ఇవి శరీరంలోని వివిధ అవయవాల పనితీరు మెరుగుపరుస్తాయి. పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్ వంటి ఖనిజాలు పిస్తాలో ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని తగ్గించే యాంటీఆక్సిడెంట్లు పిస్తాలో పుష్కలంగా ఉంటాయి.

పిస్తా పప్పులు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పిస్తా పప్పుల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం. పిస్తాలోని యాంటీఆక్సిడెంట్లు కూడా మధుమేహం వల్ల కలిగే సమస్యలు తగ్గించడంలో సహాయ పడతాయి.

పిస్తా పప్పుల్లో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగి, ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తాయి. తద్వారా తక్కువ కేలరీలు తీసుకోవడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతాయి. పిస్తా పప్పుల్లో ల్యూటిన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటిశుక్లం, వయసు సంబంధిత దృష్టి క్షీణత వంటి కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పిస్తాలోని విటమిన్ ఇ, ఫోలేట్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

పిస్తా పప్పుల్లోని విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండటానికి సహాయపడతాయి. ఇవి చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గించి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. పిస్తా పప్పుల్లోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Scroll to Top