సమాజ హితమే రచనా శిల్పం


సమాజ హితమే రావిశాస్త్రి రచనా శిల్పం *జూలై 30 రావిశాస్త్రి జయంతి

“రచయిత అయిన ప్రతిఒక్కరూ తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను” అంటూ సమాజహితమే తన లక్ష్యంగా రచనలు చేసిన రావిశాస్త్రి పూర్తిపేరు రాచకొండ విశ్వనాధశాస్త్రి. ఆయన వృత్తి రీత్యా న్యాయవాది, కథా రచయిత. కథల్లో కూడా ఆయన న్యాయవాదే. నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం “వాదించారు”. సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి “పిండ” గల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసారు.

1922, జూలై 30న శ్రీకాకుళంలో నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు రావి శాస్త్రి జన్మించారు. ఈయన స్వస్థలము అనకాపల్లి దగ్గర తుమ్మపాల గ్రామం. ఈయన తండ్రి, న్యాయవాది తల్లి, సహితీకారిణి.

రావి శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తత్వ శాస్త్రములో బీ.ఏ (ఆనర్స్) చదివి, మద్రాసు యూనివర్సిటీ నుండి 1946లో లా పట్టభద్రుడయ్యారు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని 1950లో సొంత ప్రాక్టీసు పెట్టుకున్నారు.
1947 ప్రాంతంలో న్యాయవాది వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగారు. పట్టణ జీవితంలో వస్తున్న పెనుమార్పులను గమనించారు. గురజాడ అప్పారావు, శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు. అమానుషత్వం పెరుగుతున్న నమాజంలో గిలగిలలాడే వారి ఆరాటాలను తన రచనలలో చిత్రించారు. రావిశాస్త్రి కథా కథన పద్థతి చాలా పదునైనది, కాపీ చేస్తే తప్ప అనితరసాధ్యం అని గుర్తింపు పొందారు.

తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. జేంసు జాయిస్ “చైతన్య స్రవంతి” ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల ఇది. జేంసు జాయిస్ రచనా పద్థతిని మొదటిసారిగా తెలుగు కథలకు అన్వయించినది కూడా రావిశాస్త్రినే. ఇది ఆయన మొట్టమొదటి నవల. ఈ నవలను ఆయన 1952లో రచించారు. తరువాత రాజు మహిషీ,రత్తాలు-రాంబాబు అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించారు. తన జీవిత చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించారు. అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా ఈ అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే.

ఆంధ్రలో మద్యపాన నిషేధ చట్టం తెచ్చి పెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ ఆయన అద్భుతంగా రాసిన ఆరుసారా కథలు తెలుగు కథా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి అందరిని ఆలోచింపచేసాయి. అధికార గర్వానికి ధనమదం తోడైతే పై వర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఆయన నిజం నాటకంలో వ్యక్తం చేసారు.

ఆయన రచనల్లో కథాసాగరం (1955), ఆరుసారా కథలు (1961), రాచకొండ కథలు (1966), ఆరుసారో కథలు (1967), రాజు మహిషి (1968), కలకంఠి (1969), బానిస కథలు (1972), ఋక్కులు (1973), ఆరు చిత్రాలు (1974), రత్తాలు-రాంబాబు (1975), సొమ్ములు పోనాయండి, గోవులోస్తున్నాయి జాగ్రత్త, బంగారం, ఇల్లు నవలలు, నిజం నాటకం, తిరస్కృతి నాటిక, విషాదం నాటిక మంచి గుర్తింపు పొందాయి.

1983లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణను ప్రకటిస్తే దానిని రావిశాస్త్రి తిరస్కరించారు. అంతే కాకుండా 1966లో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చివేసారు.

ఆయన కథకుడే కాదు నటుడు కూడా . ఆయన వ్రాసిన నిజం నాటకంలోను, గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకంలోను నటించారు. నిజం నాటకం ఆరోజుల్లోనే, అంటే 1962 ప్రాంతంలో, వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.

1922 జూలై 30న పుట్టి, పీడిత, తాడిత ప్రజల పక్షాన న్యాయంకోసం పోరాడి, విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాల నెదిరించి నెలల తరబడి జైలుపాలై, ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితుల కోసం, భ్రష్టుల కోసం, బాధాసర్పదష్టుల కోసం దగాపడ్డ తమ్ముల కోసం, చల్లారిన సంసారల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం.. తుది శ్వాసవరకు అవిశ్రాంతంగా ఉద్యమించి 1993, నవంబర్ 10 న రావిశాస్త్రి పెన్ను, కన్నుమూశారు.

Scroll to Top