
భారతీయ దిగ్గజ గాయని ఆశా భోంస్లే అస్తమయం.
భారతీయ దిగ్గజ గాయని ఆశా భోంస్లే ఇకలేరు. ఆశా భోంస్లే 92 ఏళ్ల వయస్సులో 2026 ఏప్రిల్ 12న కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో తీవ్రమైన అలసట, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో చేరిన ఆమె, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకడంతో శనివారం ఆమె తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేర్చారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా ఆమె మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సంగీత ప్రియులు, సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టులు పెడుతున్నారు. దిగ్గజ గాయని పాడిన పాటలను గుర్తు చేసుకుంటున్నారు.
ఆశా మంగేష్కర్ సాంగ్లీలోని గోర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. అప్పటి సాల్యూట్ సంస్థానమైన సాంగ్లీ సంస్థానంలో (ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది), సంగీత కుటుంబానికి చెందిన పండిట్ దీనానాథ్ మంగేష్కర్, మరియు అతని భార్య శేవంతి దంపతులకు ఆమె జన్మించారు. దీనానాథ్ మరాఠీ – కొంకణి మూలాలున్న వారు కాగా, శేవంతి గుజరాతీ మహిళ. దీనానాథ్ మరాఠీ సంగీత రంగస్థలంపై నటుడు మరియు శాస్త్రీయ గాయకుడు. ఆమె తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి మరణించారు. దాంతో వారి కుటుంబం పూణే నుండి కొల్హాపూర్‌కు, ఆపై ముంబైకి మారింది. ఆమె మరియు ఆమె అక్క లతా మంగేష్కర్ తమ కుటుంబాన్ని పోషించడానికి సినిమాల్లో పాడటం మరియు నటించడం ప్రారంభించారు. ఆమె తన మొదటి సినిమా పాట “చలా చలా నవ్ బాలా”ను మరాఠీ చిత్రం ‘మాఝా బాల్’ (1943) కోసం పాడారు. ఈ చిత్రానికి దత్తా దవ్జేకర్ సంగీతం అందించారు. హన్సరాజ్ బెహ్ల్ రూపొందించిన ‘చునారియా’ (1948) చిత్రంలోని “సావన్ ఆయా” పాటతో ఆమె హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు, అయితే అదే సంవత్సరంలో ‘చునారియా’ కంటే ముందు ‘అంధోన్ కీ దునియా’ అనే చిత్రం విడుదలైంది; ఈ రెండు చిత్రాలలోనూ ఆమె మూడేసి పాటలు పాడారు. ఆమె మొదటి సోలో హిందీ సినిమా పాట ‘రాత్ కీ రాణి’ (1949) చిత్రం కోసం పాడారు.
ఆమె సోదరీమణులు లతా ఉషా మంగేష్కర్లు నేపథ్య గాయకులుగా రాణించారు. ఆమె అక్క మీనా మంగేష్కర్ తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీత దర్శకులు. బాలీవుడ్ గాయనిగా 1943లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె వెయ్యికి పై చిలుకు హిందీ సినిమాల్లో పాటలు పాడింది. మరో గాయనియైన లతా మంగేష్కర్ కు ఆమె సోదరి. సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.
ఆమె సంగీత ప్రస్థానంలో తెలుగు సినిమాతో ఉన్న అనుబంధం చాలా తక్కువే అయినా, ఆమె పాడిన ఆ 8 పాటలు తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచాయి. 1981లో ‘ఇది మౌనగీతం’తో మొదలుపెట్టి, 2007లో ‘చందమామ’ సినిమాలోని ‘నాలో ఊహలకు’ వరకు ఆమె గాత్రం తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఎస్పీ బాలు, ఇళయరాజా, రెహమాన్, కీరవాణి వంటి దిగ్గజాలతో కలిసి ఆమె చేసిన పాటలు సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
ఆశా భోస్లే తెలుగులో పాడింది తక్కువ పాటలే అయినా, వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. 1981లో ‘పాలు నీళ్లు’ అనే సినిమాలో ‘ఇది మౌనగీతం’ అనే పాటను ఆలపించారు. ఇదే ఆమె పాడిన ఫట్ తెలుగు సాంగ్. ఆ తర్వాత 1988లో ‘చిన్ని కృష్ణుడు’ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ‘జీవితం సప్త సాగరం’ అనే గీతాన్ని పాడారు. దీనికి ఆమె భర్త ఆర్డీ బర్మన్ సంగీతం సమకూర్చారు. 1992లో నందమూరి బాలకృష్ణ నటించిన ‘అశ్వమేథం’ సినిమాలో ఆశా భోస్లే రెండు పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇళయరాజా స్వరకల్పనలో ఆమె ఆలపించిన ‘ఓ ప్రేమా’, ‘సీతాకాలం ప్రేమకు’ పాటలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అనిపించుకున్నాయి. ఇవి ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి.
