బంగారు బతుకమ్మ ఉయ్యాల

బతుకమ్మ పండగ తెలుగువారి చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా ఈ పండుగను తెలంగాణా ప్రాంతంలో జరుపుకుంటారు. దసరా దీపావళి పండగల తరువాత బతుకమ్మ పండగ ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు.

చారిత్రిక వివరాలు:

కథ…
తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడ(ప్రస్తుత కరీంనగర్ జిల్లా)లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. సా.శ 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బ్రిహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి , బ్రిహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ(పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు.

ఎన్నో కథల్లో ఇదొకటి..
చోళ వంశపు రాజైన ధర్మాంగదుడుకి చాలా కాలం వరకు పిల్లలు కలగకపోవడం వలన ఎన్నో పూజలు చేసిన తరువాత తన సతీమణి “లక్ష్మి” అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఆమె ఎన్నో అపాయాలను, ఆపదలను అధిగమించి బ్రతికినందుకు “బతుకమ్మ” అని పేరు పెట్టారంటారు. యుక్త వయసులో వున్న ఆడపడుచులు ముఖ్యంగా ఈ పండగను శ్రద్ధతో ఆచరిస్తే తగిన వరుడు లభించి వారు కూడా కుటుంబాన్ని మంచి ఉన్నత స్థితిలోకి నడిపించగలరని ఒక భావన.

ఈ పండగని దసరా నవరాత్రులు సందర్భంగా ఆచరిస్తూ దుర్గాష్టమి నాడు ముగుస్తుంది. ఆఖరి రోజుని “సద్దుల బతుకమ్మ” అంటారు. ఈ రోజునే బతుకమ్మ నిమజ్జనం జరుగుతుంది.

బతుకమ్మ తయారుచేయడం:
వెదురుకర్రలతో చేసిన ఒక బల్లపై రంగు రంగుల పూలతో (గునుగు, తంగెడు, బంతి, చామంతి, తామెర, గుమ్మడి, దోస, అల్లి, గడ్డి, వామ మొదలగు ఔషద పూలు) గోపుచ్ఛాకృతిలో వరుస క్రమంలో ఉంచుతారు. పై వరసలో పసుపుతో గానీ, గుమ్మడి పూవుతో గానీ అలంకరిస్తారు. ఇది బతుకమ్మ రూపు ఆకృతి ఇస్తుంది. గత సంవత్సరం బతుకమ్మ పండగ గురించి పర్యావరణ పరిశుద్ధ కోణంలో తెలుగుమల్లి లో ఒక వ్యాసం వ్రాయ బడింది. ఇందులో ఇన్ని రకాల పూలు ఎందుకు వాడతారో సవివరంగా తెలుపబడింది.

సంబరం:
దసరా శరన్నవరాత్రులు ప్రతీ రోజు అమ్మలక్కలు సాయంత్రం బతుకమ్మను విభవము కొలది ముస్తాబు చేసి జానపద పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ నృత్య రూపంలో తిరుగుతారు. ఈ ప్రక్రియ చూడ ముచ్చటగా వుంటుంది. ఈ కార్యక్రమం ఉత్తరాంధ్రలో గౌరమ్మ పండగను తలపింపజేస్తుంది. వారు పాడే పాటలు కూడా దుర్గాదేవి వివిధ రూపాలను వర్ణిస్తూ వుంటాయి.

తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు
9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతీయువకులు పాల్గొంటారు. చివరిరోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.
1. ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
2. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
6. అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
7. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
8. వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.

Scroll to Top