కవుల మధ్య ప్రేమ, పెళ్లి

అది పందొమ్మిదో శతాబ్దం. ఎలిజబెత్ బారెట్ (1806 – 1861), రాబర్ట్ బ్రౌనింగ్ ల మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు సాగడం ఓ గొప్ప విషయం.

రాబర్ట్ బ్రౌనింగ్ రాసిన కవితలు ఎలిజబెత్ పారట్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. 39 ఏళ్ళ వయస్సులోనూ ఎలిజబెత్ బారెట్ కి ప్రపంచం గురించి పెద్దగా పరిచయం లేదు. ఆమె చిన్నవయస్సులోనే అమ్మను కోల్పోయింది. తండ్రేమో కర్కోటకుడు. కన్న కూతురు అని కూడా చూడక నానా హింసా పెట్టేవాడు. ఎటూ పంపించే వాడు కాదు. ఏదీ చేయనిచ్చే వాడు కాదు. ఆమె చుట్టూ ముళ్ళ కంచె. పైగా ఆమె ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. అయినా ఆమె ఇంట్లోనే కవితలు రాస్తూ ఉండేది. అలాగే ఆమె ఎక్కువగా పుస్తకాలూ చదువుతుండేది. ఆ సమయంలోనే ఆమె రాబర్ట్ బ్రౌనింగ్ కవితలు చదువుతుంది. ఆయన కవితలు ఆమెను కట్టిపడేస్తాయి.

ఎలిజబెత్ బారెట్ ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. కాస్తంత మొహమాటం పాలు ఎక్కువే. తండ్రి ముక్కోపి. అయినా కొత్త వారితో మాట్లాడాలని ఉన్నావీలు ఉండేది కాదు. ఆ స్థితిలో ఆమెలో శక్తి పుడుతుంది. రాబర్ట్ బ్రౌనింగ్ కి ఆమె సాహసించి ఒక ఉత్తరం రాయాలనుకుంటుంది. బ్రౌనింగ్ ద్రుష్టి ఆకర్షించాలని అనుకుంటుంది. అయితే అప్పట్లో బ్రౌనింగ్ కన్నా ఎలిజబెత్ బారెట్ కే పేరుప్రఖ్యాతులు ఎక్కువ. అయినా తనకన్నా ఆయన కవితలు బాగున్నాయని, ఆయనకు రావలసినంత పేరు రాలేదనుకుంటుంది.

ఎలిజబెత్ బారెట్ ఓ దీర్ఘ ప్రేమ కావ్యం రాస్తుంది. ఈ కావ్యమంత ప్రేమమయమే. ప్రతి పదం ప్రేమ రసాన్ని చదివే వారి ముందు ఉంచుతుంది. ఇందులో కొన్ని మాటలు బ్రౌనింగ్ ని ఉద్దేశించే రాస్తుంది కూడా. ఈ పుస్తకం విడుదల అయినప్పుడు బ్రౌనింగ్ ఇటలీలో ఉంటాడు. ఈ పుస్తకాన్ని చదివిన బ్రౌనింగ్ సోదరి దానిని అతనికి పంపుతుంది. అది చదివి బ్రౌనింగ్ తెగ మెచ్చుకుంటాడు. కొంతకాలం తర్వాతా ఆమెకు ఒక ఉత్తరం రాస్తూ ఆ రచనను పొగుడుతాడు.

బ్రౌనింగ్ ఉత్తరం అందుకున్న ఎలిజబెత్ బారెట్ ఆనందానికి అవధులు లేవు. అతనికి ఒక ఉత్తరం రాస్తుంది. అలా వారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తాయి. బ్రౌనింగ్ ఓ ఉత్తరం లో ఆమెను చూడాలని ఉందని, కలవాలని ఉందని రాస్తాడు. కానీ ఆమె తన తండ్రిని దృష్టిలోపెట్టుకుని కలవడానికి రావద్దని రాస్తుంది. అంతే కాదు తన ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే కావడం వల్ల అతను నేరుగా చూస్తే వద్దు అంటాడేమో అని ఆమెకు అనుమానం కలుగుతుంది.

కానీ అతను ఊరుకోడు. ప్రతీ ఉత్తరంలో చూడాలని ఉందన్న విషయాన్ని రాస్తూ వస్తాడు. చివరికి ఆమె తన తండ్రి ఊళ్ళో లేని సమయాన్ని చూసి అతన్ని ఆ రోజు పలానా సమయానికి రావాలని, అప్పుడు రాకుంటే ఇక జీవితంలో కలవడం కష్టమని రాస్తుంది. అయితే ఆ అవకాశాన్ని పోగొట్టుకోడు. అనుకున్న సమయానికి అతని ఇటలీ నుంచి వచ్చి ఆమెను కలుస్తాడు. ఇద్దరి మధ్య ఓ గంట సేపు మాటలు సాగుతాయి. మాటలతో పాటు ప్రేమ కూడా పెరుగుతుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనుకుంటారు. అతను వెళ్ళిపోయినా తర్వాత ఉత్తరాలు రాస్తూ రాస్తూ ఒక ఉత్తరంలో పెళ్లి చేసుకుందాం అని రాస్తాడు. ఆమె అది చదివి విస్తుపోతుంది. అది జరిగేపనేనా అని అనుకుంటుంది. తనకు ఇష్టమున్నా తండ్రి పడనివ్వడు కదా అనుకుని వద్దంటుంది. కానీ అతను లలితమైన భావాలతో ఆమె మనసుని దోచుకుంటాడు. ఆమె తండ్రితో గొడవపడి ఇంట్లోనుంచి వెళ్లిపోయి అతనిని పెళ్లి చేసుకుంటుంది.

పెళ్లి ఆమె జీవితాన్ని మార్చేస్తుంది. అతని నుంచి పూర్తి ప్రేమను పొందుతుంది. వీరికి 1849 లో ఒక కొడుకు పుడతాడు. అప్పుడు ఆమె వయస్సు 43 ఏళ్ళు. ఇద్దరూ కవితలు రాస్తూ ఉంటారు. వీరి రచనను బ్రిటీష్ ప్రజలు ఎంతగానో ఆదరిస్తారు.

1860 లో ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది. అయినా ఆమె భర్త ప్రేమలోనూ, ముద్దుల కొడుకు కోసం జీవితం మీద ఆశలు కోల్పోదు.

1861 జూన్ 29వ తేదీన బ్రౌనింగ్ ఒడిలో ఆమె పెదవులపై చిరునవ్వుతో తుది శ్వాస విడుస్తుంది. చ్చేకట్లో అసౌఖ్యంగా పక్కమీద నిద్రపోతున్న ఒక పిల్లిని వెలుతురులో చేతులలోనికి తీసుకున్నట్లుగా దేవుడు ఆమెను తన దగ్గరకు తీసుకున్నాడని ఆమె మరణం మీద బ్రౌనింగ్ వ్యాఖ్యానించాడు భార్య పోయిన బాధ తట్టుకోవడం కష్టమే అయినా ఆమె చివరి కోరికగా కవితలు రాయడం మాత్రం ఆపడు. 1864 లో ఆయన విడుదల చేసిన ఒక కవితా పుస్తకానికి ముందెన్నడూ రానంత గొప్ప పేరు లభిస్తుంది. భార్య కోరిక ఫలించినందుకు ఆనంద పడతాడు. బ్రౌనింగ్ ప్రపంచంలోని ప్రముఖ కవులలో ఒకడవుతాడు. బ్రౌనింగ్ 1889 డిసెంబెర్ 12న మరణించాడు.

ఎలిజబెత్ బారెట్ ఒకసారి బ్రౌనింగ్ రాసున కవిత ఎంతో ప్రసిద్ధి చెందింది. అది దీర్ఘ కవిత. అందులో కొన్ని మాటలు…

“నిన్ను నేను
ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా
నా ఆత్మ ఎంత ఎత్తుకు
ఎంత లోతుకి
ఎంత వెడల్పుకీ
ఎంత పొడవుకీ
వెల్ల గలదో
అంత గాడంగా నిన్ను ప్రేమిస్తున్నాను

నా నవ్వులూ
నా కన్నీరూ
అంతెందుకు
నా జీవితం యావత్తూ
నీకు అర్పిస్తున్నాను
భగవంతుడు అనుమతిస్తే
నిన్ను
నేను
మరణించిన తర్వాత కూడా
మరింత ఎక్కువగా ప్రేమిస్తాను…”

నిజమైన ప్రేమానుభూతి సజీవమై ఉన్నంత కాలం ప్రేమ మనసులో బతికే ఉంటుంది అనడంలో సందేహం లేదు.

– యామీ

Scroll to Top