హరి అవతార తత్త్వం…
బ్రహ్మ కోరికకు తధాస్తు అన్న శ్రీహరి తన తత్త్వం తెలుసుకోవడానికి శాస్త్రార్థ విచార జ్ఞానంతోపాటు భక్తి, సమధిక సాక్షాత్కారం మనసులో ఉండాలి. ఈ త్రయాన్ని నువ్వు నీ మనసులో ఉండేలా చూసుకో…నా స్వరూపం, స్వభావాలు నా అవతార పనులు, తదితరాలు తెలియాలంటే అందుకు నా అనుగ్రహం ముఖ్యం. అది లేకుంటే తెలుసుకో లేవు. సృష్టికి పూర్వం అన్ని స్వరూపాలకు కారణమైన ప్రకృతి నాలో ఉన్నదే. నన్ను మించింది లేదు. పరిపూర్ణమై ఎల్లప్పుడూ మహిమతో శోభిల్లుతుంది.
ఈ ప్రపంచ నిర్మాణ విషయాన్ని చెప్తున్నా విను. ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లు భ్రమ పడి ఆ తర్వాత అలాటిది ఏదీ లేనట్లుగా తెలుస్తుందో అదే మాయ. ఏది అర్థమో అది పరబ్రహ్మ స్వరూపం. నా తత్త్వం గురించి తెలుకోవాలనుకున్న వారికి తెలుస్తుంది. అందుకు ఆసక్తి ముఖ్యం. నీలాంటి విజ్ఞానులు తెలుసుకోగలరు.
నువ్వు సృష్టి కార్యం అప్పుడు ఎలాంటి భ్రమలూ పెట్టుకోకు. మోహాలు ఉండకూడదు అని చెప్పిన తర్వాత హరి అంతర్ధానమయ్యాడు.
శ్రీహరి చెప్పింది అక్షరాలా పాటించి బ్రహ్మ సృష్టి కార్యానికి పూనుకున్నాడు. మరోవైపు నారదుడు బ్రహ్మ వల్ల హరి భక్తి విధానం తెలుసుకున్నాడు. అదే విషయాన్ని నారదుడు వ్యాసుడికి తెలిపాడు.
మహా భాగవతం పది లక్షణాలు కలిగి ఉంటుంది. ఆ పదీ ఏవంటే…
సర్గ, విసర్గ, స్థానం, పోషణం, కర్మ వాసనలు, మన్వంతరాలు, షాను చరితం, నిరోధం, ముక్తి, ఆశ్రయం.
అమృతత్వాన్ని కోరుకునే భగవంతుడితో ప్రహాపతి దేవతాకమై స్త్రీ పురుష సంయోగమనే కార్య సుఖాలు ప్రయోజనంగా కల శిశ్నోపస్థలు పుట్టాయి. అన్నపానాదులు ధరించడానికి ఆంత్రకుక్షీ, నాడీసమూహాలు ఏర్పాడ్డాయి.
సర్వేశ్వరుడు స్థూల విగ్రహం. సర్వ వికారాలకు ఆకారం మనస్సు. నామరూప ప్రక్రియలతో వ్యక్తం అయ్యే ఈశ్వరుడు జగత్ నియంత. పరమేశ్వరుడే బ్రహ్మగా సృష్టిని చేసాడు. శ్రీహరి రూపంలో దానిని రక్షిస్తూ ఉంటాడు. హరి నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలమూ, దాని నుంచి భూమి పుట్టాయి. భూమి నుంచి సకల జనావళి ఉద్భవించింది. వీటన్నింటికీ మూలం నారాయణుడే. నారాయణుడు చిదానంద స్వరూపుడు.
అతని నుంచి ఉద్భవించిన ఈ సృష్టి ప్రకారాన్ని ఎంతటి స్థాయి కలిగిన రుషులైనా తెలుసుకోలేరు.
(దశమ స్కంధం సమాప్తం)
యామిజాల జగదీశ్