మనకున్న ఆరు రుతువులలో హేమంతం ఒకటి.
రుతుసంహారంలో ఓచోట ఇలా ఉంది…
“చెట్లు చిగురించాయి. పంట పైరులు చూడడానికి రమ్యంగా ఉన్నాయి. వరిపైరు పండి కోతకు వచ్చింది. పద్మాలు శోభ తగ్గాయి. మంచు కురుస్తోంది. ఇవన్నీ హేమంతకాలపు ముచ్చట్లు…”
హేమంతాన్ని మన తెలుగుకవులు తక్కువ మందే వర్ణించారు. శరత్కాలంలా అది ఆహ్లాదకరం కాకపోవచ్చని కొందరి అభిప్రాయం.
హేమంతపు చలికి స్త్రీ పురుషులు ఇద్దరూ పరస్పర పరిరంభణల చలి నుండి బయటపడడాన్ని కోరుకుంటారు. వేసవిలో పగలు ఎక్కువైతే హేమంతంలో అందుకు విరుద్ధం. పొద్దు ఎప్పుడు పొడిచి ఎప్పుడు మునుగుతుందో అన్నంత వేగంగా పగలు గడిచిపోతుంది. పగలు తక్కువ అవటానికి కారణం సూర్యుడు చలికి భయపడి ఉరుకులు పరుగులు పెట్టి పశ్చిమాద్రి చేరాడని భాగవతంలో ఓ చోట బమ్మెరపోతన చెప్పాడు. ప్రపంచాన్నే మాడ్చి దహించగల సూర్యుడే పరుగు పెడితే ఇక సామాన్యులమైన మన గతేంటో వేరేగా చెప్పక్కర్లేదు.
సూర్యుడు పారిపోతే అగ్నులు దాక్కోవడం సహజం.
వేసవిలో శీతల ప్రాంతాలకు పోయిన దేవతలు శీతాకాలంలో సతీపరులయ్యారన్నది ఓ మాట.
హేమంతంలో గోపికలు కాత్యాయని దేవి వ్రతం చేస్తారు. మొక్కులు మొక్కుతారు.
హేమంతంలో తామర పూవులు అణగిపోతాయి. మంచువల్ల సూర్యుడి తేజస్సు సన్నగిల్లుతుంది. కనుకే పగటిపూట సమయం తగ్గుతుంది. రాత్రులు హెచ్చుతాయి. దానితో రతిక్రీడలకు సమయం ఎక్కువై స్త్రీలు సంతోషిస్తారని పింగళి సూరన్న తన కళాపూర్ణోదయ కావ్యంలో అంటాడు.
ఇక తెనాలి రామకృష్ణుడు పాండురంగమహత్మ్యంలో రాధాదేవి చలికి కంపించనే లేదంటాడు తపస్సుతో. రాధాదేవి బంగారు రంగు శరీరం తెల్లటి మంచుతో కప్పబడి పాదరసంతో కనిపించే బంగారు తీగలా ఉందట. ఈ పోలిక ఎంత మనోహరంగా ఉందో కదూ. ఎందుకంటే పాదరసానిది చలనస్వభావం. మంచుకూడా పైనుండి పడుతూ గాలికి కంపిస్తూ చలన శీలమైనది. రెండింటికీ కూడా తెలుపు రంగు సమానమే. బంగారు విలువైనది. చలనం లేనిది. రాధాదేవి పవిత్రురాలు. స్థిరచిత్తంతో తపస్సు చేస్తున్నది. ఆమె శరీరచ్ఛాయ కూడా బంగారు వర్ణంలో ఉంది. అందువల్ల ఆమెను బంగారు తీగతో పోల్చడం అన్ని విధాల సమంజసం.
విశ్వనాథ సత్యనారాయణగారు హేమంతంలో చివుళ్ళపైన పూలపైనా మంచుబిందువులు వర్షించడాన్ని ఓ పద్యంలో ఇలా అన్నారు…
తాననంత తారాస్నిగ్ధ దార గుణము
వెలువఱచు పరేమ వాహినుల్ వెక్కసమయి
చూఱవదలెనేమొ యమృతాంశుండనగ జి
వుళ్ళపై బూలపై హిమాంబువులు కురిసె…
ఓ చోట ప్రముఖ రచయిత ఎమర్సన్ “అడవుల్లోనూ పల్లెల్లోనూ ప్రకృతి దృశ్యాలు సంవత్సరంలో ఆరు మాసాలు మాత్రమే ఆహ్లాదకరంగా ఉంటాయని పట్టణవాసులు అభిప్రాయపడతారు. కానీ నేను మాత్రం హేమంత దృశ్యాల శోభతో నా మనస్సుని రంజింపచేసుకుంటాను. వసంత శోభ మన హృదయాన్నెంతగా ఆకర్షిస్తుందో హేమంతం కూడా తన శోభతో అంతగా ఆకర్షిస్తుం”దని నమ్ముతానని చెప్పాడు.
– యామిజాల జగదీశ్