అమ్మ!
పెళ్ళైన కొత్తలో మల్లెతీగలా,
ఏడు మల్లెలెత్తులా ఉండేదట!
సుకుమారం నీవేనా అంటే?
మల్లె కూడా మెల్లగా
జారుకునేదట!
అక్కడికి ఆరు మాసాలే?
నేను కడుపులో పడ్డా!
నా జన్మకి
తను మరో జన్మ నెత్తిందట!
కానీ!
ఆమెను!
అలంకారంలో అన్నేళ్ళు
చూసిన అద్దం!
మోమున విచారం అద్దుకుంది!
ఆ అందం ఏమైందని
అనుకుంది!
నేను పెరిగాను!
ఎన్నో ఎత్తులు ఎక్కుతున్నాను!
తను మాత్రం!
కుడి పాదం
ఎక్కడమోపిందో,
అక్కడే నిలబడి
చేయూపుతుంది!
నాకూ పద్దెనిమిదేళ్లు వచ్చాయి!?
నా సౌందర్యం చూసి
మిస్ యూనివర్స్ అన్నారు!
ఓ రోజు అద్దం ముందు
నా అందానికి మెరుగులద్దుతుంటే!
నా అందానికి,
నేనే మురిసిపోతుంటే!
అద్దం ఇలా అంది!?
అది మీ అమ్మ సొత్తు!
నేడు ముడతలు,
పడిన తన పొత్తికడుపు
నీ అందానికి ధరావతు!
తన ఉదరంపై
ప్రతి పురిటి చారికా,
నీ అంగాంగాన్ని తీర్చి దిద్దిన అరుదైన
శిల్పిక!
అంతే!
వెనుదిరిగి చూసా!
అనంత త్యాగ హారాలు
వేసుకుని,
పిసరంత గర్వం లేకుండా,
నా అందాన్ని
తనలో చూసి మురిసిపోతూ మా అమ్మ!
దేవుడు భువిపై గీసిన
అపురూప సౌందర్యపు బొమ్మ
అయినా!
*అమ్మ అందం ఏమైంది!
నా పాలిట వరమైంది!*
మీ…✍🏻విక్టరీ శంకర్