విలక్షణ నటుడు, కవి

తెలుగు సినీ ప్రపంచంలో గంభీరమైన రూపంతో వాచకంతో ఆశేష ప్రేక్షకలోకాన్ని అలరించిన నటుడు రంగనాథ్. ఆయన కవి కూడా. ఈ నెల 17 రంగనాథ్ జయంతి. ఈ సంధర్భం ఆయన జీవన విశేషాలు…

రంగనాథ్ అసలుపేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్ ఈయన మద్రాసు నగరంలో టి.ఆర్.సుందరరాజన్, జానకీదేవి దంపతులకు జూలై 17, 1949 జన్మించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ చేశారు. రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్‌గా కొంతకాలం పనిచేశారు. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో వెండితెరకు పరిచయమై సుమారు 300 సినిమాలలో నటించారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా సినిమా ప్రేక్షకులను మెప్పించారు. మొగుడ్స్ పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొన్ని టీ.వీ.సీరియళ్లలో కూడా నటించారు. రంగనాథ్ నటుడే కాదు మంచి కవి, రచయిత కూడా.ఈయన రచించినకవితా సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, పదపరిమళం, అక్షర సాక్ష్యం, రంగనాథ్ కథలు, రంగనాథ్ నడత పుస్తకాలు అచ్చయ్యాయి.

రంగ‌నాథ్ కుటుంబంలో ఎవ‌రు సినీ నేప‌థ్యం ఉన్న వారు కాక‌పోవ‌టంతో రంగ‌నాధ్ బాల్యం అంతా సాధారణంగానే గ‌డిచింది. తాతగారి ఇంట్లో ఆయన పెరిగారు. రంగనాధ్ బాల్యంలోని తాతగారింట వాతావరణం ఆయనను కళాకారుడిగా మారేలా చేసింది. తాతగారి ఇంట్లో అందరూ గాయకులు కావడంతో రంగానాధ్ కూడా ఏదో ఒక కళలో రాణించాలి అనే నిర్ణయానికొచ్చారు. అదే ఉద్దేశంతో చిన్నతనంలో నాటకరంగం వైపు వచ్చారు. అనేక నాటకాలలో వివిధ పాత్రలను వేసారు. అక్కడినుంచి సినీరంగం వైపు రావాలనే ఆకాంక్ష మొదలైంది. వారి తల్లి ప్రోత్సాహంతో ఈ కోరిక మరింత బలపడింది.

రంగనాథ్ తాతగారు రాజుగారికి వైద్యునిగా ఉన్నప్పుడు. అదే రాజుకు తాపీధర్మారావుగారు ట్యూటర్‌గా ఉండేవారు. వాళ్లు అలా పరిచయం అయ్యారు. కన్నాంబ, పుష్పవల్లిలది రంగనాధ్ అమ్మమ్మ ఊరైన ఏలూరు. అక్కడ వారి అమ్మమ్మకు ఇద్దరు అన్నలు. వాళ్లు హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల్లో విద్వాంసులు. రంగనాధ్ గారి అమ్మ జానకి సింగర్. తబలాప్లేయర్. వారి అమ్మమ్మ వీణలో గోల్డ్‌మెడలిస్టు. రంగనాధ్ గారి తల్లి జానకి గాయని కావాలనుకునేవారట. అదే టైమ్‌లో ఎస్.జానకి కూడా గాయని అయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆవిడ కోరిక నెరవేరకపోవడంతో కొడుకు అయినా ఆర్టిస్టు కావాలనుకుంది.

దక్షిణాది సినీ రాజధానిగా ఉన్న చెన్నై నగరంలో జన్మించిన రంగనాథ్‌ ఎట్టకేలకు 1969లో బుద్ధిమంతుడు సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించారు. చందన (1974) చిత్రంలో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. కెరీర్ ప్రారంభంలో కుటుంబ బాధ్య‌తులు మీద పడ‌టంతో సినీ జీవితం న‌మ్మకం కాద‌ని భావించి ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేశారు. బిఎ చ‌దువుతుండ‌గానే ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో టిసిగా ఉద్యోగం వ‌చ్చింది. ఆ వెంటనే వివాహం. త‌రువాత పిల్లలు అలా జీవితం సాగిపోతున్నా న‌టుడవ్వాల‌న్న కోరిక మాత్రం చ‌చ్చిపోలేదు. త‌ను నాట‌కాలు వేసే నాట‌క‌రంగం వారి ద్వారా 1969లో చిన్న అవ‌కాశం వ‌చ్చింది. అయితే పాత్ర‌కు గుర్తింపు రాలేదు. అదే స‌మ‌యంలో బాపుగారి అందాల రాముడు సినిమాలో రాముడి వేషం, చంద‌న సినిమాలో హీరో వేషం ఒకేసారి వ‌చ్చాయి. దీంతో బాపుగారి స‌ల‌హాతో చంద‌న సినిమాకే అంగీక‌రించారు. అలా వెండితెర మీద హీరోగా రంగ ప్రవేశం చేశారు రంగ‌నాధ్. పంతుల‌మ్మ సినిమాతో స్టార్ హీరోగా మారారు.

ఎక్కువ‌గా కుటుంబ క‌థా చిత్రాల్లో న‌టించ‌టం ఆయ‌నను మ‌హిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేసింది. కానీ సినీ రంగంలో వ‌చ్చిన మార్పులు కార‌ణంగా కెరీర్ స్టార్టింగ్ లోనే ఒడిదుడుకులు వ‌చ్చాయి. దీంతో మ‌రో మార్గం లేక విల‌న్ గా మారారు. ‘గువ్వ‌ల జంట’ సినిమాతో తొలి సారిగా ప్ర‌తినాయ‌క పాత్ర‌లో అల‌రించారు. ఆ త‌రువాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గాను మెప్పించారు. వెండితెర మీదే కాదు.. బుల్లి తెర మీద కూడా తన న‌ట‌న‌తో ఆకట్టుకున్నారు రంగ‌నాధ్. పౌరాణిక నేప‌థ్యంతో తెర‌కెక్కిన భాగ‌వ‌తం సీరియ‌ల్ తో పాటు, రాఘ‌వేంద్ర‌రావుగారి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో తెర‌కెక్కిన శాంతినివాసం సీరియ‌ల్ లోనూ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

అపార సినీ అనుభ‌వం క‌లిగిన ఆయ‌న మొగుడ్స్ పెళ్లామ్స్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క్ అవుట్ కాక‌పోవ‌టంతో త‌రువాత ద‌ర్శ‌క‌త్వనికి దూర‌మ‌య్యారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ సినీరంగంతో అనుబందాన్ని కొన‌సాగిస్తున్న ఆయ‌న అర్థాంత‌రంగా త‌నువు చాలించారు.

మొదటి సినిమా అవకాశం గురించి ఒక ఇంటర్వూలో రంగనాథ్ మాట్లాడుతూ…’బుద్ధిమంతుడు’ నా ఫస్టు పిక్చరు. బాపు తీశారు. అందులో అవకాశం ఎలా వచ్చిందంటే – మా ‘వీణాపాణి’ బ్యానర్‌లో ఒకతను పనిచేసేవాడు. అతనికి ‘సుజనరంజని’ అనే సొంత ట్రూపు ఒకటుండేది. ‘టాటా వీడుకోలు’ పాట కోసం “మద్రాసు నుంచి ఆర్కెస్ట్రా వాళ్లను ఎందుకు తీసుకురావడం. స్థానికంగా ఉండే వాళ్లను తెచ్చుకుందాం అనుకున్నారేమో సుజనరంజనికి కబురు చేశారు. స్క్రీన్ మీద ఎలా ఉంటానో చూసుకుందామని నేను కూడా వాళ్లతో కలిసి వెళ్లాను. షూటింగ్‌లో ఆర్కెస్ట్రా మీద షూట్ చేస్తున్నారు. నేను ఫ్లూట్ పెట్టుకుని నిలబడ్డాను. ఆ సినిమాలో నన్ను క్లోజప్‌లో చూపించారు. నేను నచ్చడంతోనే బాపుగారు తీస్తున్న ‘అందాలరాముడు’లో స్థలపురాణం ఉందని రాముడు వేషానికి పిలిచారు. అదే టైమ్‌లో గిరిబాబు నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలని చూస్తున్నారు. అప్పుడు నేను వెళ్లి రమణగారికి పరిస్థితి చెప్పాను. ఆ టైమ్‌లో హీరోగా మిస్ అయ్యాను. ఆ తర్వాత రెండు సినిమాలు చేజారిపోయాయి. ‘ఇద్దరూ ఇద్దరే’లో కృష్ణంరాజు నటించి పైకొచ్చారు. ‘భారతంలో అమ్మాయి’లోనేమో మురళీమోహన్ హీరోగా చేసి క్లిక్ అయ్యారు.

విలన్ గా వేషాలను చేయడం గురించి తన మాటల్లో……ఒకసారి విఠలాచార్య గారు.. “ఏమిటి రంగనాథ్ మీకు పర్సనాలిటీ ఉంది, వాయిస్ ఉంది, బిహేవియర్ ఉంది, టాలెంట్ ఉంది.. ఇన్ని ఉండి కూడా మీరు రావాల్సినంత ముందుకు ఎందుకు రావడం లేదు? అనడిగారు. “నాకేం తెలుసు సార్? అన్నాను. “మీ జాతకం ఉంటే ఒకసారి ఇవ్వండి ? అని అడిగారాయన. ఇచ్చాను. దాన్ని చూసి “ఇందులో ఉందండీ. మీరు హీరోగా కూడా ఉండరు. 1980లో శని ఎంటర్ అవుతోంది. కొడుతుంది మిమ్మల్ని దెబ్బ. పందొమ్మిదేళ్లు ఇబ్బందులు పడతారు. ఆ తర్వాత బుధ దశలో వచ్చినప్పుడు నిలబడతారు అని చెప్పారు. ఆయన చెప్పడంతో అలర్ట్ అయ్యాను. ఎంత ఇమ్మీడియెట్ ఎఫెక్ట్ అంటే – నలభై అడుగులు యాభై అడుగులు కటౌట్లు పెట్టిన హీరోకు నాలుగు నెలల్లో పోస్టర్లలో ఫోటో లేకుండా పోయింది. ఆయన చెప్పినట్లే జరిగింది. అప్పుడే ఏరియా బిజినెస్ మొదలైంది. నా సినిమాలు సక్సెస్ కాలేదు. నాకు నలుగురు అన్నదమ్ములు. నెలకు రెండు బస్తాల బియ్యం అయిపోయేవి. ఇటువంటి పరిస్థితుల్లో మరో మంచి అవకాశం కోసం ఎదురుచూడలేను. అప్పుడు హీరో కృష్ణంరాజు గారి వద్దకు వెళ్లాను. “బ్రదర్ ఇలా ఉంది నా పరిస్థితి. ఐ కాంట్ వెయిట్. ఇప్పుడు నేనేం చేయాలి? విలన్ చేస్తే ఎలా ఉంటుంది? అడిగాను. “తప్పులేదు. ఏ టైమ్‌లో ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఏమీ చెప్పలేము. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడమే మంచిది. నిజం చెప్పాలంటే హీరోలకంటే విలనే ఎక్కువ సంపాదిస్తాడు అన్నారాయన. కృష్ణంరాజు ఒకసారి నాకు ఫోన్ చేసి “బెంగాలీ పిక్చరు ఒకటి కొన్నాను. తెలుగులో తీస్తున్నాను. ఇందులో నువ్వు విలన్ వేస్తే బావుంటుంది? నువ్వు ఒకసారి చూడు అని సినిమాను చూపించారు. అందులోనే నేను విలన్‌గా చేశాను. ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ తర్వాత – నలభై యాభై సినిమాల్లో విలన్‌గా చేసే అవకాశం వచ్చింది.

సినీ దర్శకుడిగా
హైదరాబాద్‌కు షిఫ్ట్ అయినప్పుడు పరిశ్రమకు దగ్గరగా ఉన్నా, పరిశ్రమ సరైన అవకాశాలేవీ కల్పించలేక పోయింది.అటువంటి సందర్భంలో తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ 2005లో ‘మొగుడ్స్- పెళ్లామ్స్’ సినిమా ఆయన డెరైక్ట్ చేశారు.

విమర్శకుడిగా, కవిగా రంగనాథ్ కవితా సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, అక్షర వేదికలు, పదపరిమళం, నడత’ తదితర పుస్తకాలు ప్రచురించారు. ఎవరు మంచి వ్యాసం, ఇంట ర్వ్యూ రాసినా ఫోన్ చేసిమరీ అభినందించేవారు.
సినీనటి కేఆర్ విజయ నవ్వును గురించి తమిళంలో ‘మోహనపున్నగై’ అంటారు. ఆవిడ నవ్వుపై రంగనాధ్ గారు రాసిన కవిత ఇది….

“కలకండ తొట్టిలో/మంచి గంధం మట్టివేసి
నిండు పున్నమినాటి /వెండి వెన్నెల మొక్క నాటి
పుట్టతేనెల నీరుపోసి/వెన్నముద్దల ఎరువు వేసి
నవరత్నరాసుల ఎండలో/పన్నీటి జల్లుల వానలో ఉంచి
పెంచి పోషిస్తే/దానికి పూచే పువ్వు పేరేమి? కేఆర్ విజయ నవ్వుకాక వేరేమి?

ఒకసారి ఎన్.గోపీ వాళ్ల ఇంటికి రంగనాధ్ వెళ్లినప్పుడు. గోపీగారి భార్య మాటల సందర్భంలో ఒక నాని (రెండు మూడు లైన్ల కవిత్వం) వినిపించారు.అది రంగనాధ్ కి చాలా అద్భుతంగా అనిపించింది. అది “వివాహమా ఎంత పని చేశావ్? పుట్టింటికి నన్ను అతిథిని చేశావ్. ఆ తర్వాత ఈ సంఘటన ఇచ్చిన ఉత్సాహంతో రంగనాధ్ కూడా కొన్ని నానీలను రాశారు.

ఇంతమందిపై కవిత్వం రాస్తారు నాపై కవిత్వం రాయరా అంటూ వారి సతీమణి చైతన్య అడిగేవారట. కానీ తను వేరెవరో అనిపించకపోవడంతో అలా కవిత్వంలాంటిది ఏదైనా రాయాలని అనిపించలేదట. కానీ మొదటి సారి ఆమె తన పెద్దకూతురు కాన్పు కోసం బెంగళూరు వెళ్లినపుడు రంగనాధ్ సతీమణి లేకుండా ఒంటరిగా గడపవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమెలేని లోటు తన జీవితంలో ఎలా వుందో ఒక ఉత్తరంలా రాసిన ఆ ప్రేమలేఖ. తాతయ్య ప్రేమలేఖగా సాహిత్యంలో నిలచిపోయింది.

క్రీడాభిమానం
చిన్నప్పటినుండి ఆయనకు టెన్నిస్ చాలా ఇష్టమైన ఆట, ఆరోగ్యం కోసం కూడా ప్రతిరోజు తను ఆట ఆడుతూ వుండేవారు.ఎన్నో రకాల బ్యాట్ లను తన ఇంట్లో భద్రపరచుకున్నారు. పిల్లల్ని పలకరించినట్లు వాటిని పలకరిస్తుండేవారట. చివరి దశలో శరీరం సహకరించకపోవడంతో ఆట ఆడలేకపోతున్నందుకు తను బాధపడేవారు.

జీవిత సహచరి మరణం
ఆయన భార్య ప్రమాదవశాత్తూ బాల్కనీ నుంచి కింద పడి, 14 ఏళ్ళ పాటు మంచానికే పరిమితమైపోతే కట్టుకున్నవాడే కన్నబిడ్డలా సపర్యలు చేశాడు. కానీ, గొప్ప చెప్పుకోలేదు. ‘నాలో సగభాగమైన భార్యకు చేయడం సేవ ఎందుకవుతుంద’నేవారు. 2009లో ఆమె కన్ను మూశారు.ఆమె ఫోటోను దేవుడి పటాలతో పాటు చేర్చి పూజచేసేవారు. ఆ పటం పైన డేస్టినీ అని రాసుకున్నారు.

ఆత్మహత్య
రంగనాధ్ ఒక ఇంటర్వూలో గతంలో తను రైలుక్రింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు, రైలు ఆలస్యం కావడం వల్ల మనసు మార్చుకుని అమ్మ ఆశయం కోసం నటుడిగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేసారు. యువనటుడూ సినీ కథానాయకుడు ఉదయకిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతను ఆ పిచ్చిపని ఎందుకు చేసాడు అంటూ తన అభిప్రాయం వెలిబుచ్చారు. కానీ ఆయనే డిసెంబర్ 19, 2015న అర్ధాంతరంగా జీవనయాత్రని చాలించడానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరణించే ముందు గుడ్ బై సర్ అంటూ తన మిత్రుడు బైస దేవదాస్ గారికి సందేశం పంపారు. తనకు వంటచేసే పనిమనిషి మీనాక్షికి బీరువాలో దాచిన ఆంధ్రభ్యాంకు బాండ్లు అందవలసినదిగా గోడలపై రాసి డోంట్ ట్రబుల్ హర్ అంటూ తెలియజేసారు.

Scroll to Top