మానవతా మూర్తి – మహా మనీషి

ఆస్ట్రేలియాలో తెలుగువారి ప్రస్థానం వచ్చే సంవత్సరం షష్ఠి పూర్తి చేసుకుంటుందని, ఈ ప్రక్రియకు అధ్యులైన శ్రీ దూర్వాసుల మూర్తిగారి సమక్షంలో తెలుగువారందరూ ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకోవాలని ఎదురు చూస్తున్న తరుణంలో వారు ఈ లోకం విడిచి వెళ్లిపోయారన్న వార్త ఆస్ట్రేలియా తెలుగువారందరినీ శోక సముద్రంలో ముంచివేసింది.  60 సంవత్సరాల క్రితం ఇక్కడి పరిస్థితులేమీ తెలియకుండా ఇద్దరు పిల్లలతో తన కుటుంబాన్ని తీసుకొని  ఒక విద్యార్థిగా ఆస్ట్రేలియా దేశానికి వచ్చారు శ్రీ మూర్తి గారు.  శ్రీ మూర్తిగారి అరవై ఏళ్ల ప్రయాణం తెలుగువారే కాకుండా భారతీయ వలసదారులందరికీ స్ఫూర్తిదాయకం.  శ్రీ తూములూరి శాస్త్రి గారు చెప్పినట్లు ఆస్ట్రేలియా “భారతీయ వంశానికి” వారు భీష్మాచార్యులు. అయన “వృద్ధాప్యమందైన సిద్ధ విస్ఫూర్తిని, విడనాడ నట్టి యా వీరమూర్తి”.

సీ:
సాహసవీరుడా సమరసంయోధుడా
సుస్నేహబంధాల సూత్రధారి!
తెలుగుజాతీయతా దివ్య సంశోభితా
నవ్యసాహితిమెచ్చు సవ్యసాచి!
ఆంధ్రకీర్తిపతాక నాస్ట్రేలియా దేశ
మందు నిల్పిన తొలి మాన్యవర్య!
ప్రథమాంధ్రునిగ నీవు పాదుకొంటివి పర
మారాధ్యుడవె నీవు మాకునిచట!
తే.గీ.
అరువదేడుల వారమై యహరహమ్ము
మీదు మార్గమ్మునరయుచు మీకువలెనె
స్నేహసహకార సౌశీల్య చిత్తమలర
సాగనుంటిమి వందన శతములయ్య!!

ఆస్ట్రేలియాలో తెలుగు వారి ప్రస్థానం గురించి వ్రాయాలంటే మొదటిగా శ్రీ దూర్వాసుల మూర్తి గారి గురించి వ్రాయవలసి ఉంటుంది. మూర్తిగారు 1963లో ఆస్ట్రేలియా వచ్చి ఇక్కడే స్థిరపడిన మొదటి తెలుగువారు.  వారు 1993లో ఏర్పడిన సిడ్నీ తెలుగు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు. వారి సంపాదకత్వంలో సిడ్నీ తెలుగు సంఘం త్రైమాసిక తెలుగు పత్రిక  “వాహిని” 17 సంవత్సరాలు ప్రచురితమైనది. శ్రీ మూర్తి గారు ఇప్పటి వరకూ 100 రేడియో నాటకాలు వ్రాసి ప్రసారం చేయడం, కొన్నింటిని రంగస్థలంపై ప్రదర్శించడం జరిగింది. అందులో శ్రీ రాయలవారి భువనవిజయం మెల్బోర్న్ మరియు న్యూ జిలాండ్ లలో ప్రదర్శించారు. మొన్నటివరకూ  వారు తన రచనలు కొనసాగిస్తూ జనాకర్షకమైన క్రొత్త నాటకాలు జనరంజనీ  రేడియోలో ప్రసారం చేస్తుండేవారు.

శ్రీ మూర్తి గారు వచ్చిన తదుపరి మరో తెలుగు కుటుంబాన్ని కలవడానికి సుమారు 7–8 సంవత్సరాలు పట్టింది.  అప్పట్లో  రసాయన శాస్త్రంలో పట్టబద్రులైన శ్రీ మూర్తి గారు నెల్లూరు నగరంలో ఉద్యోగం చేస్తుండగా తోటి ఉద్యోగి సిడ్నీ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పూర్తీ చేసి వీరిని కూడా సిఫార్సు చేయడం వలన శ్రీ మూర్తి గారు విద్యార్ధి వీసాపై సిడ్నీ నగరం చేరుకోవడం జరిగింది.  వారు వచ్చే సమయానికి ఆస్ట్రేలియాలో డాలరు ఇంకా పుట్టనే లేదు.  1966 ఫిబ్రవరి 14వ తేదీన డెసిమల్ కరెన్సీ ప్రవేశపెట్టడం జరిగింది.  అప్పటి వరకూ బ్రిటిష్ పౌండ్ ఆస్ట్రేలియాలో ఉండేదని శ్రీ మూర్తి గారు చెప్పారు.  ఈ మార్పు వచ్చినప్పుడు ప్రతీ పౌండ్ కి రెండు డాలర్లు చొప్పున ప్రభుత్వం వారు ఇచ్చారట.

ఆ రోజుల్లో ఎవరో తిరిగి వచ్చినవారు చెబితే తప్ప ఇక్కడి పరిస్థితులు, మనుషులు, వాతావరణం, జీవన విధానం ఎవరికీ తెలిసేది కాదు. కొంచెం తెలిసినా ఇక్కడకి వచ్చి పరిసరాలు చూసే వరకూ నమ్మ బుద్ధి కాదు.  భారత దేశంలో ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడమే ఒక సాహసం అనుకునే రోజుల్లో సుమారు 10,000 కి.మీ. దాటి ఎరుగని ఖండాంతర ప్రాంతానికి జీవనోపాధికై రావడం ఒక సాహసకృత్యం.

ఆస్ట్రేలియాలో తెల్లజాతి సంస్కరణలకు ముందే వచ్చి తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ధీశాలి.  ఈ మాట అనటంలో అతిశయోక్తి లేదు.  ఎందుకంటే శ్రీ మూర్తి గారు వచ్చిన తదుపరి తెలుగు వారి పండుగలను విధిగా నిర్వర్తించడం మరియు భావి తరాలకు మన సంప్రదాయాలను అందివ్వడంలో కృతకృత్యులయ్యారు.

శ్రీ మూర్తిగారి జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలు

  • వారి అద్వర్యంలో మొట్టమొదటగా సిడ్నీ తెలుగు సంఘం ఏర్పడింది.
  • వాహిని అనే తెలుగు పత్రికను వారు షుమారు 17 సంవత్సరాలు నిర్వహించారు.
  • పిల్లలకు తెలుగు బడిని ప్రారంభించి షుమారు 5 ఏళ్ళు నిర్వహించారు.
  • తెలుగు జాతి, తెలుగు వైభవం, బౌద్ధ మతం, గంగా భవాని, సృష్టి మొదలైన 100  రేడియో కార్యక్రమాలని నిర్వహించారు.  మన వాగ్గేయకారులు, ఆంధ్రుల చరిత్ర, కోహినూర్ డైమండ్ వంటి చారిత్రాత్మక వ్యాసాలు, మరికొన్ని సామాజిక నాటకాలు..ఇలా వైవిధ్యమున్న రచనలు బహుళ ప్రాచుర్యం పొంది శ్రోతల మన్ననలను అందుకున్నాయి.  వారి విశ్లేషణాత్మక రచనల్లో ఎంతో జ్ఞానసంపద ఉంది.
  • సిడ్నీలో 2NBC FM 90.1 రేడియో తరంగాలపై  ప్రతీ శనివారం జనరంజని పేరుతో  మధ్యాహ్నం 12 – 1 గంటల మధ్య తెలుగు కార్యక్రమాలను నిర్వహిస్తుండేవారు.
  • వారు నిత్యం తెలుగు ప్రజలు మరియు వారి జీవన విధానాలపై  పరిశోధనలు జరిపి చక్కని వ్యాసాలు వ్రాసి వాహినిలో ప్రచురించారు.
  • 2018 లో మెల్బోర్న్ లో జరిగిన వంగూరి ఫౌండేషన్ వారి 6వ ప్రపంచ సాహితీ సదస్సులో శ్రీ మూర్తి గారి దంపతులకు జీవన సాఫల్య పురస్కారం అందజేశారు.
  • వారు గత ముప్పై సంవత్సరాలుగా వ్రాసిన వ్యాసాలు “ప్రభాత వీచికలు” పేరుతో శ్రీ వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారు 90వ పుస్తకంగా ప్రచురించారు.  ఈ పుస్తకం ఈ సంవత్సరం ఉగాదికి ఏప్రిల్ 2 వ తేదీన ముద్రితమై మెల్బోర్న్ లో ఆవిష్కరించబడింది..

వారి ఆత్మ సద్గతి పొందాలని కోరుకుంటూ వారి కుటుంబానికి తెలుగుమల్లి  ప్రగాఢ సంతాపం తెలుపుకుంటుంది.

Scroll to Top