అస్తమించిన భువన విజయ భాస్కరుడు

జననం – 21-06-1933
నిర్యాణం – 09-02-2023

మాతృ భాష మృత భాషౌతుందని పలువురు బెంబేలెత్తుపోతుంటే అమ్మ భాష అజరామరమని పరాయి గడ్డపై గొంతెత్తి చాటిన ధీశాలి. ఆస్ట్రేలియా భువన విజయ సంస్థకు వెన్నెముకగా తెరవెనుక యుండి అనేక కార్యక్రమాలకు ప్రోత్సాహమిచ్చిన భాగ్యశీలి. తాను విశ్రాంత జీవనం గడుపుతూ వచ్చే పింఛనులోనే ప్రకృతి వైపరీత్యాలకు, ప్రతికూల పరిస్థితులకు లోనై ఆర్తనాదం చేసే అన్నార్తులకు ఆపన్న హస్తం అందించే దానశీలి. మంచిని పంచి మమతలల్లి బంధాలను పెంచి మానవతా మూర్తిగా ఎదిగిన యోగ్యశీలి. భావి తరాలకు భాషా సంస్కృతులందివ్వాలని ఎంతో సమయాన్ని వెచ్చించి తరించిన సహనశీలి.

వయసుతో పనిలేకుండా చివరి క్షణం వరకూ సాహితీ మూర్తిగా మాతృ భాషకు సేవలందించిన భాషా ప్రేమికుడు. నిరంతరం పుస్తకం చదవడమో, కలం పట్టి వ్రాయడమో, చదివిన కథ వినిపించడమో చేసిన సాహితీ శ్రామికుడు. ఆధ్యాత్మిక విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన విద్వాంసుడు. మలుపులెన్నైనా గెలుపు కోసం తపనపడే పోరాట యోధుడు. అక్షరమెప్పుడూ మన పక్షమేనని, అమ్మ భాష ప్రపంచ భాషగా ఎదగాలని కవనధారలు కురిపించిన కవిపుంగవుడు.

30 ఏళ్ల క్రితం భారతదేశంలో ఉద్యోగ విరమణ తరువాత ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం వచ్చి స్థిరపడిన శ్రీ సరిపల్లి భాస్కర రావు గారు కుటుంబ సభ్యులందరూ చుట్టూ ఉండగా 9 ఫిబ్రవరి 2023, వ తేదీన 9 : 30 గం లకు ఆత్మీయులను బంధుమిత్రులను దు:ఖసాగరమున విడచి శివసాయుజ్యమును పొందినారు. వారికి భార్య, ఇరువురు కుమారులున్నారు.

భువనవిజయ సాహితీ సంవేదిక స్థాపించిన దగ్గరనుండి వెన్నెముకగా నిలచి వారు సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలకు సూచనలిస్తూ రథసారధిగా ముందుకు నడిపించారు. పద్యమన్నా, పద్య నాటకమన్నా మహా ప్రాణం. భువన విజయం ప్రదర్శించిన నాలుగు (నాడు-నేడు, శ్రీకృష్ణ రాయబారం, శ్రీ పార్వతీ కళ్యాణం మరియు శ్రీ మహాకవి కాళిదాసు ) పద్య నాటకాలు వారి కనుసన్నలలో, సలహా సంప్రదింపులతో దిగ్విజయంగా నిర్వహించబడ్డాయి. నాటక ప్రతి వ్రాయడంలోనూ, పాత్రధారుల ఎంపికలోనూ, పూర్వాభినయ (రిహార్సల్) నిర్వహణలోనూ, రంగస్థల ప్రదర్శనలోనూ – అన్ని అంశాలలోనూ వారు పాలుపంచుకొని ఎన్నో విధాలుగా నూతన నటులను, రచయితలను, గాయకులను ప్రోత్సహించారు.

2013 లో తెలుగుమల్లి అంతర్జాల పత్రిక వారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. తెలుగుమల్లి పత్రికలో ఎన్నో భాషా, సంస్కృతులపై వ్యాసాలు వ్రాసారు. 2018 లో మెల్బోర్న్ నగరంలో జరిగిన వంగూరి ఫౌండేషన్ వారి 6వ ప్రపంచ సాహితీ సభలో ప్రముఖ వక్తగా పాల్గొన్నారు. భువన విజయం ప్రచురించిన “కవితాస్త్రాలయ” మూడు సంకలనాలలో మంచి కవితలు, వ్యాసాలు వ్రాసారు.
ఎంత ఒత్తిడిలో ఉన్నా తన వాక్చాతుర్యంతో నవ్వుతూ మందలించడమే కానీ, ఎవ్వరినీ ఒక్క మాటని నొప్పించే మనస్తత్వం వారికి లేదు. వయసు మీద పడి చాదస్తం వస్తుందని అందరూ అంటూ ఉంటారు, కానీ శ్రీ భాస్కర రావు గారు ప్రతీ నిమిషం పరిపక్వతను చూపించి పావన చరితులయ్యారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తన ప్రవర్తనలో చూపించారు. మనమంతా నిమిత్తమాత్రులం, చేసే వాడు, చేయించేవాడు భగవంతుడొక్కడేనని త్రికరణ శుద్ధిగా నమ్మిన అజాత శత్రువు.

ఆస్ట్రేలియా తెలుగువారు ఒక మహోన్నతమైన వ్యక్తిత్వంగల సాహితీమూర్తిని కోల్పోయిందంటే చాలా తక్కువుగా చెప్పినట్లు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆస్ట్రేలియా తెలుగువారందరి తరఫున తెలుగుమల్లి కోరుకుంటుంది.

Scroll to Top