ప్రపంచంలో చిన్న చితక 260కి పైచిలుకు దేశాలున్నాయి. వాటికి సరిజోడుగా సుమారు 6,500 భాషలున్నాయి. ఇన్ని భాషలున్న ఈ చిన్ని ప్రపంచంలో తెలుగు భాషలోనే ఎన్నెన్నో వన్నెలు, సిన్నెలు. తెలుగు భాషకే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ అవధానం. ఈ మధ్య ఇతర భాషలలో (సంస్కృతం, హిందీ, కన్నడ) కూడా చేస్తున్నారు. తెలుగు భాషలోనే మొదలైన అవధానం చూడాలంటే పనులన్నీ మానుకొని పరుగులిడిన రోజులుండేవి. కాలక్రమేణా, తెలుగుభాషకు వన్నె తరిగి మన్నన కొరవడి చిన్నబోయిన మన భాషలో ఈ అవధాన ప్రక్రియలు కూడా కొంత వెనుకంజ వేసాయి. అయితే గత దశాబ్దంగా మళ్ళీ కాలచక్రం కనికరించి కమలనాభుని ఆశీస్సులతో అవధానాలు చేసే వారు, చూసేవారు ఎక్కువయ్యారు.
అవధాని శ్రీ కళ్యాణ చక్రవర్తి తటవర్తి గారు నాలుగేళ్ల క్రితం అమెరికా నుండి ఆస్ట్రేలియా వచ్చి ఇక్కడ పద్యాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిన పలువురిని కూడగట్టుకొని పద్యవిజయం సమూహాన్ని స్థాపించి చందోబద్ధమైన పద్యాలు వ్రాయడం నేర్పించి వారినే పృచ్చకులుగా మలచుకొని మొట్టమొదటి అవధానం 2020 దసరా విజయదశమి నాడు ప్రముఖ అవధాని శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు సంచాలకులుగా నిర్వహించారు. అప్పటినుండి ఈనెల (మే 2023) వరకూ 420 మంది పృచ్చకులుతో 103 అష్టవధానాలు పూర్తి చేసారు. ఇందులో విశేషం ఏమిటంటే, ప్రతీ అవధానం భారతదేశంలోని ఒక దేవాలయానికి అంకితమిచ్చి ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలా చేయడమే కాకుండా, కొన్ని దేవాలయాలకు ఆర్ధిక సహాయం కూడా అందించారు.
శ్రీ కళ్యాణ్ చక్రవర్తి తటవర్తి గారు 2022లో ‘తటవర్తి గురుకులం’ మూడు ముఖ్యాంశాలను దృష్టిలో పెట్టుకొని స్థాపించారు. ఆ మూడు అంశాలు ‘సమాజం, సాహిత్యం, సంస్కృతి’. ప్రతీ అవధానార్చన ఈ అంశాలను మూలాధారంగా ఎంచుకొని నిర్వహించినదే.
2021 ఏప్రిల్ 24 వ తేదీ శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన అవధానంలో ఆస్ట్రేలియా తెలుగుమల్లి వారు “అవధాని శారదామూర్తి” అన్న బిరుదంతో సముచితంగా సత్కరించడం జరిగింది.
అయితే శత అవధానాలు పూర్తైన సందర్భంగా ‘తటవర్తి గురుకులం’ శిష్య బృందం, మరియు వారి అవధానాలలో పాల్గొన్న పృచ్చకులు, సంచాలకులు, హితులు, సన్నిహితులు కలిసి విజయోత్సావాన్ని మే 28వ తేదీన నిర్వహించారు. ఇందులో భారతదేశం, న్యూ జిలాండ్, ఆస్ట్రేలియా మరియు సింగపూర్ దేశాలలోని భాషాభిమానులు, కళాభిమానులు పాల్గొని వారి పద్యాలు ద్వారా శుభాశీస్సులందించారు. అలాగే వారంతా కలిసి ‘’జయము తటవర్తి కళ్యాణ చక్రవర్తి” మకుటంతో వ్రాసిన శతకం వారికి అందజేశారు. ఈ సందర్భంగా “కవి రాజ హంస” అన్న బిరుదాన్ని కూడా ప్రదానం చేయడం ముదావహం.
ఈ సందర్భంగా “తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్” వారు ప్రత్యేక గుర్తింపునిచ్చి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.
విందం వేల్ డిప్యుటీ మేయర్ కౌన్సిలర్ జాస్మిన్ హిల్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చి ఆస్ట్రేలియాలో ప్రతీ బహుళ సంస్కృతీ సంస్థ తమ ఉనికిని కాపాడుకోవడానికి భాషా సంస్కృతులు అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు.
శ్రీ బృందావనం శ్రీనివాస్ గారు మరియు శ్రీ రాజుపాలెం వేణుగోపాల్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి మెల్బోర్న్ లోని చాలామంది ప్రముఖులు, భాషాభిమానులు విచ్చేసారు. కార్యక్రమానికి సాంకేతికంగా శ్రీ వడ్డిరాజు శ్రీనివాస్ గారు మరియు శ్రీ పమ్మి శ్రీనివాస రావు గారు సహాయ సహకారాలందించారు.
ఈ సందర్భంగా శ్రీ అవధాని శారదామూర్తి గారితో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ సత్కరించడం జరిగింది. ఈ సత్కార కార్యక్రమానికి సహకారమందించిన శ్రీ భగవంతం దశిక గారు, శ్రీమతి ఉషా గుల్లపల్లి గారు మరియు శుభోదయం గ్రూపు నుండి శ్రీమతి మహాలక్ష్మి దేవరపల్లి గారికి తటవర్తి గురుకులం వారు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమమంతా వీడియో తీసిన శ్రీ రాంబాబు సమ్మోహినివిస్ గారు మరియు ఫోటోలు తీసిన శ్రీ కామేశ్వర రావు మండలీక గారికి కూడా తటవర్తి గురుకులం వారు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన అద్వైత సిద్ధాంతం మూలంగా శ్రీ అనుమర్లపూడి అమరనాథ్ శర్మ గారు వ్రాసిన “శ్రీ అద్వైత విజ్ఞాన ప్రత్యభిజ్ఞ” గురించి వారు వివరించడం జరిగింది.
‘తటవర్తి గురుకులం’ తరఫున తెలుగుమల్లి సంపాదకులు శ్రీ కొంచాడ మల్లికేశ్వర రావు గారికి గత రెండు దశాబ్దాలుగా చేస్తున్న సేవలకు ‘మధుర సాహితీ సుధాకర’ అన్న బిరుదాన్ని ప్రదానం చేసారు.