మకర సంక్రాంతి ముచ్చటగా మూడురోజులు జరుపుకునే పండగ. తెలుగులోగిళ్లలో ఇది ఆనంద హేల. దేశవ్యాప్తంగాను ఈ పండగకు ప్రాధాన్యత ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు సంక్రాంతి పండగకున్న ప్రత్యేకత ఏమిటంటే?
మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది. సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సమయం కేవలం పండగలా మాత్రమే చూడము. అంతేకాదు సూర్యుడి మార్పును కూడా ఈ పండగ సూచిస్తుంది. సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు.
సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడమే… ఇలా సంవత్సరానికి 12 సంక్రమణాలు ఉన్నప్పటికీ రెండు సంక్రమణాలకే ప్రాముఖ్యత ఉంది. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని సంక్రమణగా భావిస్తారు. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుడు దక్షిణాయనంలోకి వెళ్లినప్పుడు, ఆ కాలాన్ని కలికాలం అని కూడా పిలుస్తారు. ఇలా పుణ్యకాల ప్రారంభాన్ని ఒక పండుగలా జరుపుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఉంటారు. అందుకే సంక్రాంతిని రైతుల పండుగగా అభివర్ణిస్తారు. సంపదను, ఆనందాన్ని కుటుంబంతో, సమాజంతో పంచుకుని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి.
సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజున కనుమ పండుగ జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజును ముక్కనుమగానూ జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా వారి వారి ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వచ్చిందంటేనే గొబ్బి పాటలు, గంగిరెద్దులు, రథం ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, భోగిమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు.. వాటిని ధరించి చూడముచ్చటగా అలంకృతమైన ఆడపడుచులు కనిపిస్తారు.
ఈ పండగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు. ఉత్తర భారతంలో నివసించే హిందువులు, సిక్కులు సంక్రాంతి పండగను మాఘీ అని పిలుస్తారు ఆ తర్వాత లోహ్రీ జరుపుతారు. గోవా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మకరసంక్రాంతిగా పిలుస్తారు. మధ్యభారత దేశంలో సుకరాత్ అని అస్సాంలో మఘ్ బిహు అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. గుజరాత్‌లో గాలి పటాలను ఎగురవేస్తారు.
ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరీ లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇలా పుణ్య స్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు కడిగివేయబడుతాయాని విశ్వసిస్తారు. ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఈ సంక్రాంతి రోజున నిర్వహిస్తారు. 12 ఏళ్లకు ఓసారి మకర సంక్రాంతి రోజున కుంభమేళా కూడా జరుగుతుంది. బెల్లం, లడ్డూలను తయారు చేసి ఇరుగుపొరుగువారికి పంచుతారు. విబేధాలు ఉన్నప్పటికీ అంతా కలిసే ఉండాలని, సామరస్యతతో మెలగాలని సూచిస్తుంది. హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని నేరుగా స్వర్గానికి వెళతారని చెబుతారు.
భోగి పండుగ రోజు పిల్లలపై రేగు పండ్లు పోసి ఆశీర్వదిస్తారు. భోగి పళ్ళ ఆశీర్వాదాన్నీ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు. సంక్రాంతి రోజున ప్రతి ఇంటి ముంగిళ్లలో రంగవల్లులు శోభాయమానంగా కనిపిస్తాయి. ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతికి ప్రాధాన్యముంది. పంటలే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నేపధ్యంలో కొత్త పంట చేతికి వచ్చి ధాన్యరాశులలో చేరేది ఈ రోజుల్లోనే. దీంతో సంక్రాంతిని అతిపెద్ద పండగగా చెబుతుంటారు. చక్కెరతో కలిపిన నువ్వులు, నూల ఉండలు, ఇతర భక్ష్యాలు, పిండివంటలు ఆరగిస్తారు. పసుపు, కుంకుమ, సుగంధద్రవ్యాలు, బియ్యం, బెల్లం, పువ్వులు, వస్త్రాలు మొదలైనవి దానాలుగా సమర్పించడం ఆనవాయితీ.
మూడో రోజు కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన గోవులను..పశువులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతులకు నేస్తాలే. అందుకే పల్లెల్లో రైతులు తమ ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు.
శ్రీ మహా విష్ణువు ఆదివరాహ రూపంలో వచ్చి ఈ భూమండలాన్ని హిరాణ్యాక్షుడి చెర నుంచి రక్షించి ఉద్దరించిన రోజు సంక్రాతేనని పురాణ కథనం. అలాగే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చి బలి చక్రవర్తి శిరుస్సుపై కాలుపెట్టి పాతాళానికి తొక్కింది కూడా ఈరోజునేనని హిందూ పురాణాలలో తెలుపబడింది. ఇక మహాభారత యుద్దంలో భీష్ముడు గాయపడి చనిపోయే సందర్భంలో ఉత్తరాయన పుణ్యకాలం వరకు అంటే సంక్రాంతి పండుగ వరకు వేచి ఉండి (భీష్ముడికి తన మరణాన్ని తాను నిర్ణయించుకునే వరం ఉంది) పండుగ రోజే అంటే సూర్యుడు మకర సంక్రమణం అయ్యిన వెంటనే తనువు చాలించాడు.
ఈ ఉత్తరాయణ పుణ్య కాలంలో చనిపోతే పుణ్యగతులు ప్రాప్తిస్తాయన.. ఈ సమయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణగాథల ప్రతీతి. ఇలా ఎన్నో విశేషాలు, పుణ్యఫలాలు మూటగట్టుకున్న పండుగ కనుకే ఇది పెద్ద పండుగ అయ్యింది. పెద్దల పండుగ అయ్యింది. ఈ పండుగ వేడుకలు అంత ఘనంగా జరుపుకోవడానికి కూడా మరో కారణం.. దేశవ్యాప్తంగా పంటలు చేతికి రావడమేనని పండితులు చెప్తున్నారు.