‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే’ ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహత్తరమైంది రామనామం. విష్ణువు దశవతారాల్లో పూర్తిస్థాయి మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారం రామావతారం
నారాయణాష్టక్షరిలో ప్రధానమైన ‘రా’, శివ పంచాక్షరిలో ప్రధానమైన ”మ” కారాన్ని కలిపి ‘రామా’ అనే పేరుని కౌసల్యా పుత్రునికి వశిష్ట మహర్షి పెట్టారు. అందుకే రామ నామానికి అంతటి శక్తి, విశిష్టత, వరిష్ఠత, ప్రాభవం, వైభవం వచ్చాయి. ‘రామ’లో ‘ర’ అనే అగ్ని బీజం, ‘అ’ అనే సూర్య బీజం, ‘మ’ అనే చంద్ర బీజం ఉండటం చేత, పాపాలను శాపాలను తాపాన్ని చల్లార్చి హాయిని చేకూర్చుతుంది రామ నామం.
రామ నామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అని అనడానికి మనం నోరును పూర్తిగా తెరుస్తాం. అప్పుడు మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకుపోయి, ‘రా’ అక్షరంలో ఉన్న అగ్నిబీజం వలన అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయి. ‘మ’ అనే అక్షరం ఉచ్ఛ రించేటప్పుడు పెదవులు రెండూ మూసుకుంటాయి. అప్పుడు బయట ఉన్న పాపాలు ఏవీ మన లోనికి ప్రవేశించలేవు. అందుకే రామ అనే పదం అంత గొప్పది, శక్తి కలది అయింది. రామ నామ స్మరణం అతి విశిష్టమైనది, మోక్షాన్ని యిచ్చేది అయింది.
మనసులోని మంచిమాట, మాటలోని మంచి పలుకు, క్రియలో ఉన్న ఆచరణ మనుషుల్ని రమింప చేస్తాయి. అందుకే రమించే తత్త్వమే రామ తత్త్వం. ఆ రామ చంద్రుడ్ని శరణు వేడాలి. శరణాగతులం కావాలి.
ఇక సీతారాములు—వారి దాంపత్యం లోకానికి ఆదర్శం. ఇరువురిదీ ఏక స్వరూపం. వాల్మీకి రామాయణంలో సీతమ్మ వారు రావణుడితో ”రాముడు సూర్యుడు అయితే నేను ”సూర్య ప్రభ”ను అని అంటుంది. సూర్యుడి నుంచి సూర్య ప్రకాశమును వేరు చేయ లేము కదా! సీతారాములూ అంతే!!. ఆ ఏకరూపత ఆ అద్వైత స్థితి లోకానికి ఆదర్శమై, ఆచంద్ర తారార్కమై, సీతారాముల తత్త్వం సత్యమై, నిత్యమై, సనాతనమైన దివ్యత్వంగా ఆదర్శంగా భాసిల్లు తూనే ఉంటుంది.
అంతటి మహత్యం గల సీతారామ కళ్యాణం తెలంగాణా అసోసియేషన్ అఫ్ క్వీన్స్ ల్యాండ్ వారి అధ్వర్యంలో బ్రిస్బేన్ నగరంలో జరిగింది. రామనామంతో బ్రిస్బేన్ నగరం తరించిపోయింది. సుమారు 700 మంది వచ్చిన ఐదు గంటల కార్యక్రమం వంశీ గారు శాస్త్రోక్తంగా, కన్నులపండువుగా జరిపించారంటే చాలా తక్కువుగా చెప్పినట్లే. చాలామంది చిన్నారులు రామనామ సంకీర్తనలతో నృత్య ప్రదర్శనలు చేసారు. దశావతారాల రంగస్థల నాటక ప్రదర్శన నిర్వహించారు. చాలామంది పెద్దవారు అత్యంత భక్తి శ్రద్ధలతో కీర్తనలు పాడారు.
ఈ సందర్భంగా శ్రీ కొంచాడ మల్లికేశ్వర రావు వ్రాసిన ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తక రచయితకు పలువురు పెద్దలు అభినందించి ఆశీర్వదించారు.