మాతృభాష

మనసులోని భావనను బహిర్గతపరచే సాధనం భాష ! స్పష్ఠమైన ఉచ్ఛారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేట్లు చెప్పగలగడమే భాషకు నిర్వచనం. ఆధునిక మానవజాతి తమ మనోభావాల్ని వెల్లడించేందుకు మాతృభాష పైనే ఆధారపడుతుంది. నిత్యజీవితంలోని వ్యక్తులు ఒకరికొకరు తమ తమ సందేశాల్ని అందించటం కోసం ఆ భాష పైనే ఆధారపడుతారు. వారి వినికిడికీ, వివరణకూ భాష ఒక సాధనంగా ఉపయోగ పడుతుంది. ఆ సాధనంతోనే తమ ఆలోచనలకు అక్షర రూపం కూడా యివ్వటం జరుగుతోంది. అలాంటి సందేశ ప్రక్రియలకు మూలాధారమే మన మాతృభాష తెలుగు ! మన జీవన మూలస్థంభం అయిన ఆ భాష నిర్మలంగా వుండటం మన జీవనావసరం. అందుకోసం మనం ఎంతో ఆదర్శవంతంగా నడుచుకోవాలి. అంతేకాదు మన ముందు తరాలవారు కూడా ఆ భావననే పెంపొందించుకునేలా మనమంతా కలిసి కృషి చేయాలి . తెలుగు భాషలో సముచిత స్థాయికి చేరిన పండితులు నేర్పిన భాషోచ్ఛారణ, పద్య, గద్య, వాక్య నిర్మాణ పద్ధతులతోనే పిల్లల్ని పోషిస్తూ తెలుగు సంస్కృతికి జీవం పోయాలి. ఆ బాధ్యత మనందరి పైనా వుంది.

“తెలుగదేలయన్న, దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొల్వ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స!”
….. అంటూ తెలుగు భాషని కీర్తించాడు సాహితీ సమరాంగణ చక్రవర్తిగా విశ్వవిఖ్యాతి గాంచిన విజయనగర సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలు.

….అవే లక్షణాల కొనసాగింపులో … పనస తొనలకన్నా…పంచదారకన్నా ….జుంటి తేనెకన్నా ..జున్నుకన్నా … తెలుగు భాషే మధురంగా వుంటుందని మన పూర్వీకులు వర్ణించారు. అలా వెలువడిన ఆ తెలుగు అక్షర సౌష్ఠవానికీ, శబ్ద సౌందర్యానికీ విదేశీయులు కూడా ఆశ్చర్యంతో తలమునకలయి పోయారని చరిత్ర తెలుపుతోంది.

ఆ ధోరణిలోనే…. మాతెలుగు తల్లికి మల్లె పూదండా … తెలుగు జాతి మనది .. నిండుగ వెలుగు జాతి మనది …తేట తేట తెనుగులా తెల్లవారి వెలుగులా …తెలుగు వీర లేవరా ! దీక్ష బూని సాగరా ….అంటూ తదుపరి కవితరం వారు ఎన్నో మధుర గీతాలాపనలు గావించారు.

ఇక తెలుగు ఆవిర్భావం .. భాషా సంస్కృతుల గురించి చర్చిద్దాం ! ఎన్నోశతాబ్దాల సాహితీచరిత్ర కలిగిన ఘనత ‘తెలుగు’కుంది. అనాది కాలంనుంచే తెలుగు పదంలో ఆంధ్ర భాషారవళి అంతర్లీనంగా ఆవహిస్తూ అనుసరిస్తూ వస్తోంది. అలా ప్రాచీన కాలంనుంచే ఆంధ్రులని తెలుగుజాతికి చెందినవారిగా వర్ణిస్తూ రావటం జగద్విదితం. ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ అను ప్రాంతాల అనుసరణకి లోను కాకుండా మొత్తం తెలుగు నేల నలుమూలల్లో లబ్ధప్రతిష్ఠులయిన మహాకవులెందరో వెలుగులోకి వచ్చారు. నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాధుల్లాంటి మహాకవుల కరకమలాలలో రూపు దిద్దుకున్న మహోన్నత ఆంధ్ర భాషా సౌధాలెన్నో మనకు ధారాదత్తం గావించబడ్డాయి. వారి కావ్యగ్రథనంలోనే తెలుగు పద్యజననం జరిగింది. దానిని తెలుగు కవన గానం అనుసరించింది.

ఆ ప్రాచీన సాహితీ పథంలోనే కొనసాగిన తెలుగు పదకవితా పితామహులుగా పేరొందిన త్యాగరాజు, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, ఆదిభట్ల’ లాంటి మహానుభావులు మనకి ఎంతో అత్యున్నత మైన భాషాసేవల్ని అందించారు.

ఆ కవి సార్వభౌముల సంతతికి, వారి కవిత్వపు వరవడికి జీవం పోసిన వారసులుగా ఈ నవయుగంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహాకవి శ్రీశ్రీ, సముద్రాల, ఆత్రేయ , ఆరుద్ర, దేవులపల్లి, రాయప్రోలు, దాశరథి, నారాయణరెడ్డి, జాషువా, ఉషశ్రీ ల్లాంటి ఆధునిక కవులు కీర్తించబడ్డారు. వారి పద్య, కవనశ్రేణులననుసరిస్తూనే వచన రచన కూడా కథా, నవలా , వ్యాస రూపాల్లో వృద్ధిలోకి వచ్చాయి. కందుకూరి వీరేశలింగం, పరవస్తు చిన్నయసూరి , చిలకమర్తి , గురజాడ , చలం , బలివాడ, కొడవటిగంటి , త్రిపురనేని , రాచకొండ యద్దనపూడి , ముళ్ళపూడి , మాదిరెడ్డి , వాసిరెడ్డి , యండమూరి , మల్లాది ల్లాంటి మహానుభావులెందరో తెలుగు నవలా సాహిత్యాన్ని ఊహ కందని మహోన్నత శిఖరాలకి తీసుకు వెళ్లారు. వారి వెనువెంటే తెలుగు సినీ సాహిత్యరంగంలో కొత్త వరవళ్ళను సృష్టించిన కవులుగా నాటి వేటూరి నేటి సిరివెన్నెలలు కొనసాగుతున్నారు.

పై తరం అనంతరమే తెలుగు భాష స్థాయి దిగజారటం ప్రారంభమయింది. నేటి నవ సాహితీ లోకంలో అలనాటి అత్యున్నత సాహితీ విలువల నీడ కాదు కదా కనీసం జాడ కూడా కనిపించకుండా పోతోంది. వ్యవహారిక భాషలో తెలుగు సాహిత్యం పొంగి పొర్లుతోంది. దినసరి తెలుగు వ్యవహారిక ,వాడుక భాషలకి జతగా అర్థం పర్థం లేకుండా ఆంగ్ల పదాల సమ్మేళనంతో నేటి తెలుగు సాహిత్యం మలినమయి పోతోంది. అంతే కాకుండా వర్ధమాన కవులు వ్రాస్తున్న సినీగీతాల్లో ఇంగ్లీషు హిందీ పదజాలమే కాకుండా ద్వని తరంగాలు కూడా పద రూపాల్నిదాలుస్తున్నాయి. ఆ పాటల్ని వింటూ నేటి యువత ఉర్రూతలూగి పోతోంది. ఆ సినీ సాహిత్యమే అసలైన తెలుగు సాహిత్యంగా భావించటం కూడా జరుగుతోంది. దాంతో ఈ కాలపు చిన్నారులకు మంచి తెలుగు పదజాలం ఒంటపట్టటంలేదు. ఒక కోణంలో నుంచి చూస్తే నేటి పిల్లల ఇంగ్లీషు చదువులే వారిని తెలుగు భాషకి దూరం చేస్తున్నాయని భావించక తప్పదు. వారి తలితండ్రులు కూడా ఈ ధోరణినే ప్రోత్సహిస్తున్నారు. నిత్య జీవనసరళిలో కూడా మంచి పదాల వాడకం కను (విను) మరుగయి పోతోంది. తద్వారా తెలుగు సాహిత్యంలో కూడా ఎన్నో అనుచిత మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

తత్ఫలితంగా తెలుగు పండితులకు, భాషావేత్తలకు ఆదరణ పూర్తిగా తగ్గిపోతోంది. అది కాకుండా ప్రస్తుత పరిస్తితుల్లో కొన్ని అవసరాల నిమిత్తం తెలుగు వక్తలని , ప్రవక్తలని , ఉపన్యాసాకులని ఎంతో వెదికి లేదా దాదాపు శోధించి పట్టుకోవాల్సి వస్తోంది. అదే కారణంగా అన్ని చోట్లా గతంలో జరిగే తెలుగు మహాసభలు ఎన్నడో మూతవడి పోయాయి. ఆంధ్ర సాహితీ సదస్సుల్లాంటివి నిర్వహించబడటం అంటూ ఏ ఒక్కవార్తా వెలుగులోకి రావటం లేదు.

అంతే కాదు గతంలో తెలుగు భాషాభి వృద్ధికి పాటు పడిన విధానాలన్నీ కూడా ఈకాలంలో పూర్తిగా కనుమరుగయి పోయాయి. ఇంతెందుకు ? అసలు తెలుగు మాట్లాడే వాళ్ళే తగ్గిపోతున్నారన్న భావన కూడా కలుగుతోంది. ఎందుకంటే …నేటి యువత నవ సమాజపు ఆధునిక పోకడలతో తమ మాతృభాష స్వరూప స్వభావాలనే కాక తెలుగు పదజాలపు ఉచ్ఛారణ , వినికిడి మార్గాలని కూడా మార్చి వేస్తున్నారు.

పై కారణాలవల్లనే తెలుగు పత్రికా రంగం కూడా దాదాపుగా తగ్గుముఖం పడుతోంది. గతంలో ఎంతో పేరున్న తెలుగు దిన, వార, పక్ష మాస పత్రికలు ఎన్నో మూతవడి పోయాయి. దాంతో వర్ధమాన రచయితల సృజనాత్మక శక్తికి ఆటంకం వాటిల్లుతోంది. వారిలోని అమూల్యమైన భావవాహినికి అడ్డుకట్టలు పడుతున్నాయి. పెద్ద పత్రికలన్నీ కనుమరుగయిపోగానే ఎన్నో కొత్త పత్రికలు కాస్త వెలుగులోకి వచ్చి నట్లే వచ్చి ఆవెంటనే పుట్టగొడుగుల్లా అంతరించిపోయాయి.

దాంతో అలనాటి దినపత్రికల నిర్వహణ విషయాన్ని ప్రక్కనపెడితే పాత తరానికి చెందిన యితర పత్రికల్లో కేవలం స్వాతి, ఆంధ్రభూమి, నవ్య, విపుల, చతుర’లు మాత్రమే యిపుడు పంపిణీ అవుతున్నాయి. అయితే కొన్ని నవతరం పత్రికలు మాత్రం ఈ మధ్య కాలంలో “అంతర్జాల” వేదికని వివిధ రూపాల్లో అలంకరిస్తున్నాయి. అవి పాఠకులకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో అనే విషయం మాత్రం యింకా ఎవరికీ అవగతం కావటం లేదు.

చివరికి ఏమవుతేనేమి ఈ నవజీవనయానంలో నేటి యువతరం మాటలద్వారా, పాటలద్వారా, సినిమా, బుల్లితెర, తదితర వాడుక మాధ్యమాల ద్వారా తెలుగు భాష దాదాపు అంతిమ దశకుచేరువవుతోంది. కానీ అలా జరుగ కూడదు. అలాంటి స్థితి ఏర్పడకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత పెద్దలందరి పైనా వుంది. ఈ స్ధితిలోముఖ్యంగా యువతని తెలుగు భాషాభివృద్ధి దిశకు మళ్ళించటం చాలా అవసరం ! ఎందుకంటే వారి ద్వారానే ‘తెలుగు’ నిలుకడతో బాటుగా రేపటి తరం పిల్లలకు తెలుగంటే ఏవిటో తెలుస్తుంది.

కాని అనూహ్యంగా నేడు విదేశాల్లో నివసిస్తూన్న తెలుగు వారు అలనాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ మహాశయుడు తెలుగు భాషాభివృద్ధికి శ్రమించిన మార్గాన్నే అనుసరిస్తున్నారు. తద్వారా తెలుగు భాషాభివృద్ధికి వారెంతో తాపత్రయ పడుతున్నారు. ఆ కారణంగానే వారి పిల్లలు కూడా తెలుగు అభ్యాసంలో అంచెలంచెలుగా ఎదిగిపోతున్నారు. అదే ప్రోత్సాహం విశ్వవ్యాప్త తెలుగు జాతి ఆదర్శంగా కొనసాగాలి ! అదే పద్ధతిననుసరిస్తూ మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలోకూడా మన మాతృభాష ‘తెలుగు’ ని మనమే కాపాడుకోవాలి. అందుకోసం అందరూ కలిసి ఆచరణీయమైన మార్గాలని అన్వేషించాలి ! ఆ సత్సంకల్పం వాస్తవ రూపం దాల్చటం కోసం నేటినుంచే మనమందరం కలిసి సమిష్టిగా కృషి చేద్దాం !…. రండి ! కదిలి రండి ! ….

……..జై తెలుగు జననీ ! జయహో …జయహో ! …….
SP Chari

Send a Comment

Your email address will not be published.