నవరసనటనా సార్వభౌమ సత్యనారాయణ
జూలై 25 నటుడు సత్యనారాయణ 87వ పుట్టినరోజు
తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్ళకు పుట్టారు కైకాల సత్యనారాయణ. తెలుగు సినిమాతో సమాంతరంగా ఎదిగారు. నటుడుగా గత 2019కే షష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా భక్తప్రహ్లాద విడుదల అయితే.. 1935 జులై 25న సత్యనారాయణ జన్మించారు. 1959లో ఆయన నటించిన చిత్రం ‘సిపాయి కూతురు’ విడుదలయింది. ఆ రకంగా ఆయన నటుడు అయి.. 62సంవత్సరాలు కాగా.. వ్యక్తిగతంగా ఈ ఏడాది జులై 25కి 87వ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. తెలుగు సినిమా అభిమానులు అందరికీ సత్యనారాయణ జీవిత చరిత్ర సినిమా విశేషాలు తెలిసినవే.. అయినా ఆయన పుట్టినరోజు సందర్భంగా గుర్తుచేసుకుందాం..
సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడలలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు.
తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. అతన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చారు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గురించటానికి ఆసక్తి గల కారణం, అతను రూపు రేఖలు యన్.టి.ఆర్‌ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడా ఇతన్ని గమనించారు. 1960లో యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఇతనుకు ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసారు.
సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది బి.విఠలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనకదుర్గ పూజా మహిమలో వేయించారు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో అతను ప్రతినాయకుడుగా స్థిరపడి పోయారు.
హీరోగా సినిమా రంగానికి పరిచయం అయినా.. ఆ సినిమా నిరాశపర్చడంతో విలన్ గా మారడానికి తటపటాయించలేదు. జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఎన్నెన్నో జానపద చిత్రాల్లో సత్యనారాయణ విలన్ పాత్రలు పోషించారు. ఆ తర్వాత సోషల్ పిక్చర్స్ లో కూడా విలన్ పాత్రలు వచ్చాయి. సత్యనారాయణ నవ్వు పాపులర్ విలనీ ట్రేడ్ మార్క్ అయింది. కెరీర్ తొలిదశలోనే ఆయనకి పౌరాణిక పాత్రలు చేసే అవకాశం లభించింది. లవకుశలో భరతుడిగా..శ్రీకృష్ణార్జున యుద్ధంలో కర్ణుడిగా.. నర్తనశాలలో దుశ్శాసనుడిగా నటించారు. శ్రీ కృష్ణపాండవీయంలో ఘటోత్కచుడి పాత్ర తొలిసారి ధరిస్తే మళ్ళీ 1995లో ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఘటోత్కచుడు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. శ్రీకృష్ణావతారం చిత్రంలో తొలిసారి దుర్యోధనుడి పాత్ర పోషించారు. ఆ తర్వాత కురుక్షేత్రంలో దుర్యోధనుడిగా అద్భుతంగా రక్తి కట్టించారు. అలాగే రావణాసురుడిగా సీతాకళ్యాణంలో, భీముడిగా దానవీరశూరకర్ణలో, మూషికాసురుడిగా శ్రీ వినాయక విజయం చిత్రాల్లో నటించారు.
ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయనను సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది. అతను యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించారు. కృష్ణుడి గా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా! ఎస్.వి.రంగారావు ధరించిన పాత్రలను చాలావరకు సత్యనారాయణ పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు సాంఘికాల్లో రౌడీ, కథానాయకుని (కథాకనాయిక) తండ్రి, తాత మొదలైనవి.
సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ఇద్దరు దొంగలు కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు. చాలా మందికి తెలియని విశేషమేమిటంటే కథానాయిక మొల్లలో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర పోషించారు. యమధర్మరాజు అంటే తెలుగు తెరకి సత్యనారాయణ తప్ప మరొకరు గుర్తురారు. యమగోల సినిమాతో ప్రారంభమైన ఈ పాత్ర జైత్రయాత్ర యముడికి మొగుడు, యమలీల, రాధామాధవ్, దరువు చిత్రాల వరకూ సాగింది. మోసగాళ్ళకు మోసగాడు, దొంగల వేట మొదలైన సినిమాల్లో ఆయన విలన్ పాత్రలు మర్చిపోలేనివి. ఉమ్మడి కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, శారద చిత్రాలతో ఆయన ఇమేజ్ మారింది. సాత్వికమైన పాత్రలకు కూడా సత్యనారాయణ బెస్ట్ ఆప్షన్ అయ్యారు. తాత.. మనవడు, సంసారం..సాగరం, రామయ్య తండ్రి, జీవితమే ఒక నాటకరంగం, దేవుడే దిగివస్తే, సిరి సిరి మువ్వ, తాయారమ్మ, బంగారయ్య, పార్వతీ పరమేశ్వరులు మొదలైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి విలన్ ఇమేజ్ నుంచి బయటపడి.. కుటుంబ ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యారు.
కమెడియన్ నగేష్ డైరెక్టర్ గా..స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు నిర్మించిన మొరటోడు చిత్రంతో హీరోగా మారారు. నా పేరే భగవాన్, ముగ్గురు మూర్ఖులు, ముగ్గురు మొనగాళ్ళు, కాలాంతకులు, గమ్మత్తు గూఢచారులు, తూర్పు పడమర, సావాసగాళ్ళు లాంటి చిత్రాల్లో హీరోతో సమాంతరమైన పాత్రలు పోషించారు సత్యనారాయణ. చాణక్య చంద్రగుప్తలో రాక్షస మంత్రిగా.. న భూతో న భవిష్యత్.. అన్నట్లు నటించారు. నా పిలుపే ప్రభంజనంలో ముఖ్యమంత్రి పాత్రతో విస్మయపరిచారు. ఒకటా.. రెండా వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
సుభాష్ ఘాయ్ డైరెక్ట్ చేసిన హిందీ సినిమా కర్మలో విలన్ గా నటించారు. ఈ సినిమాలో శ్రీదేవి తండ్రి పాత్ర ధరించారు. ఒకటీ.. రెండు తెలుగు డైలాగ్స్ కూడా ఆ సినిమాలో చెప్పారు సత్యనారాయణ. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ లతో కొన్ని చిత్రాలతో పాటుగా కన్నడ, హిందీ సినిమాల్లో కూడా కైకాల సత్యనారాయణ నటించడం జరిగింది. కైకాల సత్యనారాయకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం.. రఘుపతి వెంకయ్య అవార్డ్ తో గౌరవించుకుంది. ఆ మధ్య విడుదలయిన మహర్షి చిత్రంలో కూడా నటించారు సత్యనారాయణ. తను నటించిన ప్రతీ పాత్రా తన సొంత బిడ్డలాగే భావించి.. వాటికి ప్రాణ ప్రతిష్ట చేశారు. 1996లో అతను రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇంట్లో ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతూ.. పాత సినిమాలు చూస్తూ.. ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు సత్యనారాయణ.
సత్యనారాయణ రికార్డులివీ:
777 సినిమాలు ఇప్పటిదాకా
28 పౌరాణిక చిత్రాలు
51 జానపద చిత్రాలు
9 చారిత్రక చిత్రాలు
200 మంది దర్శకులతో పనిచేసారు
223 సినిమాలు 100 రోజులు ఆడాయి
59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి
10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి
10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడినవి
గుర్తింపులు – అవార్డులు
నటశేఖర – అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది.
నటశేఖర – గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది
కళా ప్రపూర్ణ – కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినది
నవరసనటనా సార్వభౌమ – ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు, పురజనుల మధ్య ఇచ్చింది.