సినీపరిశ్రమలో సహజ నటిగా గుర్తింపు పొందినవారు సుజాత. డిసెంబర్ 10న, 1952 శ్రీలంకలో పుట్టిన సుజాత 14 యేళ్ళ చిరు ప్రాయంలోనే వెండి తెరకు ఎంట్రీ ఇచ్చారు. బాలచందర్ వంటి దిగ్గజ దర్శకుడి చేతిలో 1974 సంవత్సరంలో ‘అవ్వాలోరు తుధల్ కథై’(తెలుగులో అంతు లేని కథ) అనే తమిళ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇక అప్పటి తమిళ్ స్టార్ హీరోలు అందరితో ఆమె నటించారు. తెలుగులో గోరింటాకు సినిమాతో అడుగు పెట్టారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ వంటి భాషల్లో హీరోయిన్ గా స్టార్ హీరోలకు జతగా నటించారు. స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు సుజాత. సుమారు 300 సినిమాల్లో నటించారు.
1980 లో కృష్ణంరాజు, చిరంజీవి మల్టీస్టార్ సినిమా ప్రేమ తరంగాలు. ఈ మూవీలో సుజాత హీరోయిన్. చిరుకు జోడీగా నటించారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 1982 లో చిరుకు చెల్లెలుగా సీతాదేవి సినిమాలో నటించారు. అనంతరం చిరుకు అక్కగా 1984లో అగ్నిగుండం సినిమాలో నటించారు సుజాత.. తర్వాత సుజాత తల్లిగా మారిపోయారు..1990లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి తల్లిగా సుజాత నటించడం విశేషం.. చిరంజీవికి చెల్లెలుగా నటించి ఆపై హీరోయిన్ గా నటించిన హీరోయిన్లు ఉన్నారు.. కానీ హీరోయిన్, చెల్లి, అక్క, అమ్మ ఇలా అన్ని పాత్రలు పోషించిన ఏకైక నటి సుజాత కావడం విశేషం.
సుజాత కెరీర్ హీరోయిన్ గానే మొదలైంది. కానీ, ఆమె పెద్ద హీరోయిన్ కాలేకపోయారు. అయినప్పటికీ పెద్ద హీరోలందరూ ఆమెను పెద్ద హీరోయిన్లు కంటే ఎక్కువ గౌరవంగా చూసేవారు. తోటి నటీనటులు కూడా ఆమె పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపించేవారు. పైగా ఆమె ఎంతో గొప్ప నటి. కరుణ రసాన్ని సహజమైన కన్నీళ్ళతో చాలా సహజంగా తన హావభావాలతో పలికించేవారు. నిజానికి సుజాతకి సినిమాల్లో నటించాలని మొదటి నుంచి ఆసక్తి లేదు. పరిస్థితుల ప్రభావం కారణంగా సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. ఆమెను తమిళ వెండితెరకు దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్ పరిచయం చేశారు. హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నా.. ఆమెకు సినిమా వాళ్ళ నైజం నచ్చేది కాదు.
ఆమె తనలో తానే ఎంతగానో మానసిక వేదనకు గురయ్యేవారు. అందుకే, కావాలని ఆమె సినిమాలను వదులుకునే వారు. ఆ కారణంగానే హీరోయిన్ గా సుజాత ఎక్కువ చిత్రాలు చేయలేకపోయారు. ఆ తర్వాత దాసరి నారాయణ రావు ఆమె పరిస్థితి గమనించి.. మంచి పాత్రలు ఇచ్చి సుజాత స్థాయిని పెంచారు.
‘చంటి’ సినిమాలో ఆమె చేసిన వెంకటేశ్ తల్లి పాత్ర కూడా సుజాత గారి కెరీర్ లో గొప్ప పాత్రగా నిలిచిపోయింది. ఆ పాత్రలో ఆమె నటన అద్భుతం. అసలు ఆ రోజుల్లో ఎమోషనల్ పాత్రలు అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఒక్క ‘సుజాత మాత్రమే. పైగా ఆమె తెలుగు భాషకే పరిమితం కాలేదు. మలయాళం, తమిళ, కన్నడ భాషా చిత్రాల్లో కూడా తన భావోద్వేగమైన నటనతో ఎందరో హృదయాలలో చెదిరిపోని గుర్తులను మిగిల్చారు.
సుజాత తన జీవితంలో ఓ దశలో చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. బహుశా అందుకేనేమో ఆమె ముఖబింబం పై విషాదాంత కర సంఘటనలు, విషాద పాత్రలు అతి సహజంగా పలికి ఉంటాయి. ఐతే, సుజాత కేవలం షూటింగ్ సమయంలోనే కాదు, ఆనందకరమైన అవార్డుల ఫంక్షన్ లోనూ ఎందుకో ఎప్పుడూ దిగులుగానే కనిపించేవారట. ఏది ఏమైనా తన మౌనం నుంచే కరుణ రసాన్ని చూపించడం ఒక్క సుజాతకి మాత్రమే సాధ్యం అయింది.
నటి సుజాతను చూస్తే ఎవరైనా మన తెలుగు అమ్మాయి అనుకునేవారు అప్పట్లో కానీ ఆమె తండ్రి శ్రీలంక లో ఉద్యోగం చేస్తుండేవారు. సుజాత స్వతగహగా మలయాళీ, కానీ ఆమె పుట్టింది పెరిగింది మాత్రం ఇండియాలో కాదు. ఆమె శ్రీలంకలో లో గాలీ ప్రాంతంలో పుట్టి . 15 యేళ్ళ వయసు వచ్చేదాకా అక్కడే పెరిగారు. సుజాతకి శ్రీలంక పౌరసత్వం ఉంది. యుక్త వయసులో ఉండగా ఆమె తన కుటుంబం తో కేరళ వచ్చి స్థిరపడింది. ఆరోగ్య సమస్యలతో 2011 లో కన్ను మూసారు సుజాత. ఆమె చివరగా నటించిన చిత్రం శ్రీరామదాసు.