నవ్వుల రేడు..నటనా కిరీటి

భారతీయ చిత్ర పరిశ్రమలో హాస్యం గురించి మాట్లాడుకొంటే రాజేంద్రప్రసాద్‌కి ముందు, తర్వాత అని వేరు చేసి చూడాల్సిందే. ఆయన నటన, ఆయన ఎంచుకొన్న కథలు కథానాయకులకు ఓ కొత్త దారిని చూపించాయి. తరాలు మారుతున్నా ఆయన నవ్విస్తూనే ఉన్నారు. నవ్వుల రేడుగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన ప్రయాణం మొదలై దాదాపు నాలుగున్నర దశాబ్దాలైంది. జూలై 19 ఆయన పుట్టినరోజు సందర్భంగా నటనా జీవిత విశేషాలు తెలుసుకుందాం…

రాజేంద్రప్రసాద్ అసలుపేరు గద్దె రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడుగా. ఎక్కువగా హాస్య చిత్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నారు.

రాజేంద్రప్రసాద్ కృష్ణా జిల్లాకు చెందిన గుడివాడకు దగ్గర్లోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1956 జూలై 19న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబ. అతను బాల్యం, యవ్వనంలో అప్పుడప్పుడూ ఎన్.టి. ఆర్ స్వస్థలమైన నిమ్మకూరులోని ఇంటికి తరచుగా వెళ్ళి వస్తుండేవారు. అలా చిన్నప్పటి నుంచే అతనిపై ఎన్.టి.ఆర్ ప్రభావం పడింది. సినీ పరిశ్రమలో ప్రవేశించక మునుపు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాడు.

నటన
ఎన్టీఆర్ తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేర్పించారు. ఎన్టీయార్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించారు. నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలిచిత్రం బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. రాజేంద్రప్రసాద్ హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. నటుడిగా వివిధ భాషలలో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించారు. నందమూరి తారకరామారావు స్ఫూర్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారారు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడు అని నిరూపించారు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి వారి దర్శకత్వంలో నటించిన ఘనత రాజేంద్రప్రసాదుది.

తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించారు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
‘ఆ నలుగురూ ‘మీ శ్రేయోభిలాషీ వంటి చిత్రాలలో అద్వితీయ నటనని ఆవిష్కరించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు ఏప్రిల్, 2015 లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు..

తొలి సినిమా రోజులు మరిచిపోతే కదా! బాపు వంటి ఓ అగ్ర దర్శకుడి సినిమాతో పరిచయమయ్యే అవకాశం ఎంతమందికి లభిస్తుంది? ఎన్టీఆర్‌గారి కనుసన్నల్లో పెరిగిన వాణ్ని కాబట్టి అప్పటికే నాకు క్రమశిక్షణ అలవడింది. దానికితోడు నా ఉత్సాహం చూసి బాపు ఎంతగానో ప్రోత్సహించారు. సెట్‌లో ‘సర్‌ ఇది చేయొచ్చా? అలా నటించొచ్చా’ అని అడగ్గానే.. ‘ఓహో నీకు ఇది తెలుసా? వెరీ గుడ్‌.. చేయండి’ అంటూ వెన్ను తట్టిన రోజులు ఇప్పటికీ కళ్లముందు మెదులుతున్నాయి. నాకు ‘స్నేహం’ అవకాశం అప్పుడు డ్రగ్‌ కంట్రోలర్‌గా పనిచేసే మా అన్నయ్య గద్దె నాగేశ్వరరావు పైఅధికారి అయిన బి.వి.రమణారావుగారి వల్ల వచ్చింది. ఆయన బి.వి.పట్టాభిరామ్‌కు పెద్దన్నయ్య. తమ్ముళ్లకి ఉద్యోగాలు ఇప్పించుకొనేందుకు ఎలా ప్రయత్నిస్తుంటారో అలా మా అన్నయ్య బి.వి.రమణారావుని కలిసి ‘బాపు రమణలు మీకు బాగా తెలుసట కదండీ, మా తమ్ముడు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌.. అవకాశం ఉంటే ఇప్పించండి’ అని అడిగారు. ‘బాపురమణలు మా తమ్ముడు సీతారామ్‌కి స్నేహితులయ్యా, నాక్కాదు. తనకి చెప్పి చూస్తాలే’ అన్నారట. ఆయన చెప్పడంతో నేను బాపుగారిని కలిశా. ‘స్నేహం’ తీస్తున్నప్పుడు ‘మన సీతారామ్‌ అన్నయ్య చెప్పారు, అవకాశం ఇవ్వకపోతే బాగోదు’ అని నాకో వేషం ఇచ్చారు. అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది.

కెరీర్‌పై పూర్తి భరోసా..
ఒక పక్క సహాయ పాత్రల్లో నటిస్తూనే, మరో పక్క డబ్బింగ్‌ చెప్పేవాణ్ని. సింగీతం శ్రీనివాసరావుగారు తెరకెక్కించిన ‘గుడి గంటలు’లో హీరో పాత్రకి డబ్బింగ్‌ చెప్పా. అక్కడే సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న వంశీ నాకు పరిచయమయ్యాడు. నేను డబ్బింగ్‌ చెప్పే విధానం నచ్చి ‘అసలు తెరపై హీరో కనిపించడం లేదు, నీ డబ్బింగే వినిపిస్తుంది’ అంటూ వంశీ నన్ను వదిలిపెట్టలేదు. ఆయనే ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘ప్రేమించు పెళ్ళాడు’తో నన్ను కథానాయకుడిని చేశాడు. ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకొలేదు.

కామెడీకి హీరోయిజాన్ని ఆపాదించడమనేది… కామెడీవైపు వెళ్లాలనే ఆలోచన ఎన్టీఆర్‌గారి చలవే. నన్ను మద్రాస్‌లో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించింది ఆయనే. నాకు గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. ఆ విషయాన్ని చెప్పడానికి ఎన్టీఆర్‌గారి దగ్గరికి వెళ్లా. ‘సంతోషం… ’ అంటూనే ‘సినిమా పరిశ్రమలో ఒకరిలాగైతే మరొకరు అక్కర్లేదు… పౌరాణికం అంటే మేమే గుర్తుకొస్తాం, సోషల్‌ పాత్రలకి అక్కినేని నాగేశ్వరరావుగారు ఉన్నారు. డిష్యుం డిష్యుం చేయాలంటే కృష్ణగారు, రొమాంటిక్‌ కథలంటే శోభన్‌బాబు ఉన్నారు. మరి ఈ సమయంలో వచ్చిన నువ్వెందుకు పనికొస్తావు? అన్నారు. ఆ మాట నన్ను ఆలోచించేలా చేసింది. ఒక రోజు మా ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులంతా కలిసి అమెరికన్‌ కాన్సులేట్‌లో చార్లీ చాప్లిన్‌ సినిమా ఫెస్టివల్‌కి వెళ్లాం. ఆ సినిమాలు చూశాక ‘అసలు కామెడీ… హీరో ఎందుకు కాకూడదు? కామెడీ కమెడియన్‌గానే ఎందుకుండాలి? చార్లీ చాప్లిన్‌ కంటే గొప్ప హీరో, నటుడు మరొకరు ఉన్నారా?’ ఇలా ఆలోచనలు వస్తూనే నాలో కసిని పెంచాయి. చార్లీ చాప్లినే నాకు కామెడీ దారి చూపించారు. ఆయన వల్లే నేను ఇలా అయ్యానా అంటే కాలేదు. వంశీ, జంధ్యాల, రేలంగి నరసింహారావు, సింగీతం శ్రీనివాసరావు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి, కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ… ఇలా ఎంతోమంది దర్శకులు నా ఆలోచనలకి తగ్గ పాత్రల్ని సృష్టించారు.

కామెడీని హీరోయిజం చేసిన ట్రెండ్‌ సెట్టర్‌ని నేను. అందుకే 42 ఏళ్లకే ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్‌ తీసుకొన్నా. సామాన్యుడి నుంచి ప్రధాన మంత్రి వరకు నాకు అభిమానులున్నారు. మానసికంగా కుంగిపోయిన పిల్లల నుంచి, సమయం ఎలా గడపాలో తెలియక సతమతమవుతున్న వృద్ధుల వరకు నా సినిమాల్ని చూసి హాయిగా నవ్వుకొంటారంటే అంతకంటే సంతృప్తినిచ్చే విషయం మరొకటి ఉందా? అప్పటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావుగారు నా ఒత్తిడిని దూరం చేసే సాధనం రాజేంద్రప్రసాద్‌ సినిమా అని చెప్పేవారు.

మొదటి ఫ్రేమ్‌ నుంచి చివరి ఫ్రేమ్‌ వరకు కామెడీని పండించడమనేది ఓ గొప్ప విషయం. నటుడు అప్‌డేట్‌ అవుతూ ఉండాలి. అదే నా విజయ రహస్యం. సమాజంలోంచి వచ్చే పాత్రల్ని చేస్తేనే ఫలితాలు సాధ్యమవుతాయి. అప్పుల అప్పారావు, పేకాట పాపారావు హీరోలా? లేడీస్‌ టైలర్‌కి పెద్ద బద్ధకం, వాడు అసలు పనిచేయడు, అలాంటోడు హీరోనా? ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’లో ఓ పిసినిగొట్టు. వాడు హీరోనా? కానీ సామాన్యుడికి ఆ పాత్రలు బాగా నచ్చాయి. ఎక్కడో ఒక చోట అలాంటివాడు తారసపడుతుంటాడు కాబట్టే వాటికి ప్రేక్షకాదరణ దక్కింది.

మాస్‌ హీరో అనే గుర్తింపుకి ఉన్న బలమే వేరు. కానీ ఆ విషయంలో నేను ఎప్పుడూ అసంతృప్తికి లోనవలేదు. ఎందుకంటే
హాస్యాన్ని మించిన మాస్‌ అంశం మరొకటి ఉంటుందా? దాన్ని మించిన వాణిజ్యాంశం ఉందా? కమర్షియల్‌ హీరోని కాదు కదా అని నాకెప్పుడూ అనిపించలేదు. నవ్వు అవసరం ఉన్నంత వరకు ప్రేక్షకుల మనసుల్లో నేనుంటా. మూడో తరం కూడా నా సినిమాల్ని చూస్తూ ఆస్వాదిస్తోంది.

ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు
మనకన్నా మనకొచ్చిన అవకాశం గొప్పదనుకొనే నటుడిని నేను. అందుకే ఒక పక్క ‘ఏప్రిల్‌ 1 విడుదల’ షూటింగ్‌ చేస్తూ, మరో పక్క ‘ఎర్రమందారం’లో నటించా. ‘లేడీస్‌ టైలర్‌’లో నటిస్తూనే ‘కాష్మోరా’ చేశా. ‘పుణ్యస్త్రీ’, ‘ముత్యమంత ముగ్గు’, ‘ఎర్రమందారం’, ‘ఆ నలుగురు’… ఇలా నా శైలికి భిన్నంగా అనిపించిన పాత్రల్నీ భుజానికెత్తుకొన్నా. ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు ఒలికించా. ‘తెలుగు సినిమాలో నీకున్న ప్రత్యేకత ఎవరికీ లేదు. కిరీటి అంటే అర్జునుడు. రెండు చేతులా బాణాలు వేయగల దిట్ట. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతావు కాబట్టి నిన్ను ‘నట కిరీటి’ అంటున్నాం’ అని డా.సి.నారాయణరెడ్డి ఆ బిరుదుని ఇచ్చారు.

నేనూ ఉపాధ్యాయుడినే
“మా నాన్న గద్దె వెంకట నారాయణగారు ఉపాధ్యాయుడు. నా తొలి సినిమా ఉపాధ్యాయ దినోత్సవం రోజున విడుదలైంది. ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదో నాన్నగారిని, ఆయన దగ్గరికొచ్చే విద్యార్థుల్ని చూశాక నాకు అర్థమైంది. నాన్నగారి స్ఫూర్తితో నేనూ అప్పుడప్పుడు ఉపాధ్యాయుడిగా మారుతుంటా. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్లకి వెళ్లి విద్యార్థులకి పాఠాలు బోధిస్తుంటా. నాన్న స్ఫూర్తితోనే ‘ఓనమాలు’లో నారాయణ అనే టీచర్‌ పాత్రని పోషించా. ‘శ్రీమంతుడు’లో నా పాత్ర పేరూ నారాయణే. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నా పెళ్లి రోజు కూడా సెప్టెంబరు ఐదే. ఇంట్లో మా ఆవిడ బోధించే పాఠాలే ఎక్కువ ” అని నవ్వారు రాజేంద్ర ప్రసాద్.

Scroll to Top