వెండితెరమీద హాస్యాన్ని పండించిన సుత్తి వీరభద్ర రావు
జూన్ 30 సుత్తి వీరభద్రరావు వర్థంతి
తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు సుత్తి వీరభద్రరావు అసలుపేరు మామిడిపల్లి వీరభద్ర రావు. వెండి తెరమీద కనిపిస్తే చాలు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించే నటుల్లో వీరభద్రరావు ఒకరు. జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన నాలుగు స్తంభాలాట మూవీలో సుత్తి కొట్టే పాత్రలో అంటే ఎక్కువగా బుర్ర తినే క్యారక్టర్ అన్నమాట. ఆ పాత్రలో నవ్వించిన వీరభద్రరావు ఆతర్వాత నుంచి ఇంటిపేరు సుత్తి గా మారిపోయింది. 1947జూన్ 6న తూర్పు గోదావరి జిల్లా జన్మించారు.
వీరభద్ర రావు తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు, ప్రథమ సంతానము. ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళు. స్వస్థలం గోదావరి జిల్లా. తండ్రి ఉద్యోగ నిమిత్తం విజయవాడకు తరలి వెళ్ళాడు. విజయవాడలో ఉన్న ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
చిన్నతనము నుంచి నాటక రంగము మీద వున్నా మక్కువతో, తండ్రి చూసిన ఉద్యోగావకాశాలను కాదనుకుని, నటుడిగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో స్థిరపడ్డాడు. సరదాగా మిత్రుని దగ్గరకు వెళ్ళిన వీరభద్రరావుని మాదాల రంగారావు బలిపీఠం సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేయించారు. మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన జంధ్యాల దర్శకత్వములో వచ్చిన నాలుగు స్తంభాలాట చిత్రముతో చిత్రసీమలో స్థిరపడ్డాడు.
ఆకాశవాణి నుండి ఎందరో కళాకారులు సినీ రంగానికి వెళ్ళి పేరు తెచ్చుకున్నారు. అలాంటివారిలో వీరభద్రరావు ఒకరు. ఆయకు ‘ సుత్తి ‘ పదం పేరులో భాగమైంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేరి రెండు దశాబ్దాలు పనిచేసి 1980లో చిత్రపరిశ్రమలో చేరారు.
మొదట్లో ఈయనను అందరూ భద్రుడు అని పిలిచేవారు. ఈయనకు ఇద్దరు చెల్లెళ్లున్నారు. కాలేజీ రోజుల్లో తన తోటి విద్యార్థి జంధ్యాలతో కల్సి చాలా నాటకాలు వేసేవారు. విజయవాడ ఎస్ ఆర్ ఆర్ లో గ్రాడ్యుయేట్ చేసిన ఈయన 1970-80లలో రేడియో ఆర్టిస్టుగా , స్టేజి ఆర్టిస్టుగా రాణించారు. నాటకాల్లో బిజీగా ఉంటూ ధవళ సత్యం డైరెక్షన్ లో జాతర, ఎర్ర మల్లెలు మూవీస్ తో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.
1982లో కాలేజ్ లో తన జూనియర్ అయిన జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన నాలుగు స్తంభాలాట మూవీలో నటించడంతో వీరభద్రరావు పేరు మారుమోగిపోయింది. ఆచిత్రంతో సుత్తి వీర భద్రరావు తో పాటు సుత్తి వేలు కూడా ప్రాచుర్యం పొంది ఆతర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఎన్నో చిత్రాల్లో సుత్తి జంటగా రాణించారు. తెలుగు పదాలను పొందికగా, ఓ తరహాలో పలుకుతూ హాస్య ప్రేమికులను అలరించేవారు.
1988 వరకూ అంటే కేవలం 6ఏళ్ళల్లో దాదాపు 200సినిమాల్లో నటించారంటే ఈ రేంజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సుత్తి జంట 50సినిమాల్లో నటించారు. చూపులు కల్సిన శుభవేళ ఈయనకు ఆఖరి చిత్రం అయింది. షుగర్ వ్యాధి గల వీరభద్రరావు షుగర్ పట్ల నిర్లక్ష్యంగా ఉండడం కొంప ముంచింది. కాలు వాచిపోయి నీరు పట్టేయడంతో హైదరాబాద్ లో మందులు తీసుకుని,చెన్నై హాస్పిటల్ లో చూపించుకుంటానని సుత్తివేలుతో అన్నారట. జూన్ 24న షూటింగ్ స్పాట్ లో సుత్తివేలుతో కల్సి భోజనం చేసారు.
అదే ఆఖరు అయింది. ఇది జరిగిన ఐదు రోజులకు అంటే జూన్ 30న షుగర్ వ్యాధి అతన్ని కబళించింది. వీరభద్రరావు మరణించారని తెల్సి సుత్తివేలు దుఃఖంలో మునిగిపోయారు. సగం ప్రాణం పోయిందని సుత్తివేలు విలపించారు. ఇక సుత్తి వీరభద్రరావు కి ఒక కూతురు, ఓకే కొడుకు ఉన్నారు. షుగర్ వ్యాధి పట్ల రేపు మాపు అంటూ వైద్యం చేయించుకోకపోవడంతో తన ప్రాణాలనే ఆయన కోల్పోయారు.