అపూర్వ నటి, గాయని టంగుటూరి

అపూర్వ నటి, గాయని టంగుటూరి సూర్యకుమారి *నవంబర్ 13 టంగుటూరి సూర్యకుమారి జయంతి

“మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గీతాన్ని అతి మధురంగా తొలిసారి ఆలాపించి తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయురాలుగా నిలిచిన గాయని, ఆనాటి చలన చిత్ర నటి టంగుటూరి సూర్యకుమారి. నవంబర్ 13 ఆమె జయంతి. ఈ సందర్భంగా ఒక చిరుపరిచయం..

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు తమ్ముడు టంగుటూరి శ్రీరాములు కుమార్తె సూర్యకుమారి. ఈమె 1925 నవంబర్ 13న రాజమండ్రిలో జన్మించారు. మూడో ఏట నుంచే పాటలు పాడేవారు. పన్నెండు, పదమూడేళ్ళ ప్రాయంలోనే ఆమె రైతుబిడ్డ సినిమాలో నటించారు. సూర్యకుమారి రూపం, కంఠస్వరం రెండూ ఆకర్షణీయంగా ఉండడంచేత, అప్పటికే పెదనాన్న ప్రకాశం సభల్లో ఆమె ప్రార్థన గీతాలు పాడుతూండడం చేత సినిమా వారి పిలుపు వచ్చింది. సాంప్రదాయ కుటుంబమవడంచేత కొంత వ్యతిరేకత ఎదురయ్యింది. ఊగిసలాట అనంతరం సూర్యకుమారి 1937లో మద్రాసు వచ్చి, సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ నాలుగు భాషల్లో మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించారు. 1952లో ఆమె తొలి మద్రాసు అందాల సుందరి (మిస్ మద్రాసు)గా గుర్తింపు పొందారు. లలిత గీతాలు యాభై, దేశభక్తి గీతాలు యాభై మొత్తం నూరు గ్రామఫోన్ రికార్డులు ఇచ్చారు. అలాగే ఒక యాభై దాకా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో తన గొంతుతో పాడిన పాటల రికార్డులు ఉన్నాయి.

గాయనిగా ప్రఖ్యాతి
నటన కంటే సూర్యకుమారి పాడిన దేశభక్తి గీతాలు, లలితగీతాలు, అష్టపదులు వంటివాటికి ఎక్కువ ప్రజాదరణ లభించడం చేత ఆమె పాట కచ్చేరీలు తరుచూ చేస్తూండేవారు. చాలా ప్రాంతాల్లో ఆమె లలిత సంగీత కచ్చేరీలు చేశారు. అయితే పేరు ప్రతిష్టలు, ప్రజాదరణ ఆమెకు తృప్తి నివ్వలేదు. ఏదో ప్రత్యేక కృషి చెయ్యాలన్న తపన, మూడు నాలుగేళ్లపాటు కరతాళ ధ్వనులకు, ప్రశంసలకు దూరంగా ఉండి, చదువు మీద దృష్టి కేంద్రీకరించి, ప్రైవేటుగా కేంబ్రిడ్జి సీనియర్ పరీక్ష రాసి, ప్రథమశ్రేణిలో పాసయ్యారు.

సూర్యకుమారి కంఠ, రంగూ, రూపం ఆకర్షణీయంగా ఉన్నా, మామూలు అమ్మాయిల కంటే కొంచెం పొడవుగా ఉండటం చేత, సినిమా రంగంలో సమస్య అయ్యింది. ఆనాటి సగటు హీరోలు ఈమె కంటే కాస్త పొట్టిగా ఉండటం చేత కాస్త ఇబ్బంది. అదీ కాక పేరుపొందిన రాజకీయ కుటుంబం నుంచి రావటమే కాదు, ప్రేమ సన్నివేశాలు హీరోయిన్ మీద హీరో చెయ్యి వెయ్యడం, ఇత్యాది వి ఒప్పుకునే వారు కాదు. అందువల్ల గొప్ప చాతుర్యం ఉండి కూడా సూర్యకుమారి సినిమాల్లో పరిమితంగానే నటించారు.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించిన సూర్యకుమారి మంచి గాయకురాలు కూడా. స్వాతంత్ర్యోద్యమ సమయంలో మా తెనుగు తల్లికి మల్లెపూదండ, దేశమును ప్రేమించుమన్నా మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడారు. ప్రకాశం పంతులు ఈమె కళాభిరుచి బాగా ప్రోత్సహించారు. శాస్త్రీయ సంగీతం నేర్పించారు. అతను ఏ సభకు వెళ్ళినా ఈమెను ఆ సభకు తీసుకెళ్ళి జాతీయ గీతాలు పాడించేవారు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రావతరణ సభలో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం ప్రభృతుల సమక్షంలో వందేమాతరం, ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ పాటలు ఆలపించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. వీటితో పాటు “స్వప్న జగతిలో ఛాయా వీణ’ మొదలైన లలిత గీతాలు, అడవి బాపిరాజు గారి ‘ప్రభువుగారికీ దణ్ణం పెట్టూ’, ‘రావోయి చిన్నవాడా’ మొదలైన జానపద గీతాలు కూడా పాడుతుండే వారు. హెచ్.ఎం.వి. తదితర గ్రామఫోన్ కంపెనీలు ఈమె పాటలను రికార్డు చేశాయి. ప్రముఖ గాయనిగా పేరు తెచ్చుకున్నారు.

విదేశాలలో విఖ్యాతి
1960 దశకంలో ఈమె లండను వెళ్ళి అక్కడ ‘ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ సంస్థను స్థాపించారు. ఇందులో భారతీయ పాశ్చాత్య కళలను, కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, పరస్పర సదవగాహన పెంపొందించడం ముఖ్య ఆశయం. 1968లో ఈమె కృషిని బ్రిటిషు రాణి గుర్తించింది. 1969లో గాంధీజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ సెయింట్ పాల్ కెథెడ్రల్ లో గానం చేసిన ప్రథమ భారతీయ వనిత ఈమె. ఈమె నార్వే, స్వీడన్, హాలెండ్, స్పెయిన్, కెనడా, అమెరికా మొదలైన పలు దేశాల్లో భారతీయ సంగీత శిక్షణాలయాలు నెలకొల్పి, వందలాది కళాకారులను తయారు చేశారు. అమెరికాలో బ్రాడ్వే థియేటర్ లో విశ్వకవి రవీంద్రుని ‘కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్’ నాటకంలో రాణి పాత్ర ధరించి, బ్రాడ్వే అవార్డు పొందిన మొదటి భారతీయ వ్యక్తి. ఈ నాటకాన్ని న్యూయార్కులో ఎనిమిది నెలలపాటు ప్రదర్శించి, అటు తరువాత ఆఫ్రికాలో నాలుగు నెలలు పర్యటించారు. కొలంబియా యూనివర్సిటీలోనూ, లండను యూనివర్సిటీ విద్యాసంస్థలలోను, బ్లాక్ థియేటరులోను భారతీయ నృత్య కళ సంగీతంపై వర్క్ షాపులు నిర్వహించారు. ప్రాచ్య, పాశ్చాత్య నృత్య సంగీతాలకు మధ్య సుహృద్భావ సేతువుగా అంతర్జాతీయ కీర్తినందిన మధుర గాయని ఈమె. 1975లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ ఈమె సేవలను గుర్తించి సత్కరించింది. 1984లో ఈమెకు శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం లభించింది.
లండన్ లోని ప్రముఖ చిత్రకారుడు హెరాల్డ్ ఎల్విన్ తో సూర్యకుమారికి వివాహమైంది. 1973లో లండన్ లో స్థిరపడిన ఆమె 2005 ఏప్రిల్ 25న అస్తమించారు.

Scroll to Top