రెబల్ స్టార్ గా చిరస్మరణీయ ముద్రవేసిన కృష్ణంరాజు
సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఏఐజి హాస్పిటల్లో కన్నుమూశారు. కృష్ణంరాజు ఇక లేరనే వార్తను తెలుగ చిత్రసీమకి షాకింగ్‌గా ఉంది. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. అసలు కృష్ణంరాజుకి ఎందుకు చనిపోయారనే దానిపై ఆయనకు చికిత్స అందించిన ఏఐజీ హాస్పిటల్ స్పందించింది. కారణాలను తెలియజేసింది..
డయాబెటిస్, కరోనరి హార్ట్ డిసీజ్‌తో కృష్ణంరాజు బాధపడినట్టు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. అలాగే ఆయనకు గుండె కొట్టుకునే వేగం తగ్గిందని, అలాగే రక్తప్రసరణలో వచ్చిన సమస్య కారణంగా కొన్నాళ్లు ముందు కాలికి శస్త్ర చికిత్స కూడా జరిగిందని డాక్టర్స్ పేర్కొన్నారు. అలాగే కిడ్నీ, లంగ్స్ సమస్యలు కూడా ఉన్నాయని, పోస్ట్ కోవిడ్ కారణంగా వచ్చిన ఆరోగ్యపరమైన ఇబ్బందులతో గత నెల 5న హాస్పిటల్లో కృష్ణంరాజు జాయిన్ అయ్యారని వైద్యులు తెలిపారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమోనియా ఉన్నట్లు కూడా వారు చెప్పారు. కిడ్నీ పూర్తిగా దెబ్బతినటంతో ఆయన్ని వెంటిలేటర్స్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే ఉదయం గుండెపోటు రావటంతో కృష్ణంరాజు కన్నుమూశారని ఏఐజీ వైద్యులు తెలిపారు.
ప్రముఖ సీనియర్ నటుడిగా, రాజకీయవేత్తగా గొప్ప మనసున్న మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. తను నటనతో రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కృష్ణంరాజు మృతితో నేడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగిపోయింది. కృష్ణంరాజుకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు.
‘చిలకా గోరింక’తో సినీ పరిశ్రమలోకి
ఇండస్ట్రీలో రెబెల్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టారు. 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ ఆయన తొలి సినిమా. హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ విలన్‌గానూ నటించారు. ‘అవే కళ్లు’ సినిమాలో విలన్‌గా చేశారు. 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో వచ్చిన ‘తాండ్ర పాపారాయుడు’ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.
2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఐదున్నర దశాబ్దాల కెరియర్లో బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, నీతి నియమాలు, తల్లీకొడుకులు, రారాజు, త్రిశూలం, రంగూన్ రౌడీ, మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య, సతీసావిత్రి, పల్నాటి పౌరుషం, తాతామనవడు, టూటౌన్ రౌడీ తదితర 187 సినిమాల్లో నటించారు. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లోనూ సత్తా చాటారు. గోపీకృష్ణ మూవీస్ పతాకం పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు.
కృష్ణంరాజు దాదాపు 60 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమ లోనే తన జీవితాన్ని కొనసాగించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా , హీరోగా ఎన్నో చిత్రాలలో నటించిన ఈయన తన సినిమాలతో ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకోవడం అంటే అది ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పాలి.
రాజకీయాల్లోనూ
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ కృష్ణంరాజు ప్రవేశించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అదే ఏడాది నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు. వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. కృష్ణంరాజు నటవారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రభాస్ అతని సోదరుని కుమారుడు.
పేరులోనే రాజసం
కృష్ణంరాజు… ఆయన పేరులోనే రాజసం ఉంది. ఆరడుగుల విగ్రహం.. ఎత్తుకు తగ్గట్టుగా ఉండే గాంభీర్యం.. ఆయన చూడగానే కళ్లలో తెలియని ఓ రౌద్రం కనిపిస్తుంది. ఆయనే కృష్ణంరాజు. నిజానికి కృష్ణంరాజుకి సినిమాల కంటే ఫొటోగ్రఫీ అంటేనే ఇష్టం. దాంతో ఆయన రాయల్ స్టూడియోను హైదరాబాద్‌లో స్టార్ట్ చేశారు. జర్నలిస్ట్‌గానూ కొన్ని రోజులు పని చేశారు. తర్వాత స్నేహితుల ప్రోద్బలంతో నటుడిని అవుదామని చెన్నై చేరుకున్నారు. ప్రత్యగాత్మ సహకారంతో నటన రంగంలోకి అడుగు పెట్టిన కృష్ణంరాజు తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. హీరోగానే కాకుండా కీలక పాత్రలు.. విలన్ పాత్రల్లోనూ నటించారు.
అందరితోనూ కలిసిపోయేవారు. ఎవరిపైనా కోపం ప్రదర్శించేవారు కాదు. అందుకనే ఆయన్ని అందరూ అజాత శత్రువు అనేవాళ్లు. తన సమకాలీనులైన కృష్ణ, శోభన్‌బాబులతో కలిసి నటించారు. అమరదీపం, భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మాన్న, కటకటాల రుద్రయ్య వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఎవరితోనూ విబేదాల్లేవ్. ఈ గుణమే ఆయన్ని అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లో అందరికీ దగ్గర చేసింది.
ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజుని మీరు సాధించాల్సినవి ఇంకా ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నిస్తే.. జీవిత చరమాంకంలో ఓ పచ్చటి చెట్టు కింద కూర్చుని గుండె మీద చేయి వేసుకుని, నాకిచ్చిన ఈ జన్మలో నేనెవరికీ ద్రోహం చేయలేదు. నా వల్ల ఎవరికీ బాధ కలగలేదు దేవుడా అనే భావనతో కన్నుమూయాలి అని అన్నారు. నిజంగా తన మాటలు వల్ల, చేష్టలు వల్ల ఎవరికీ ఆయన ఇబ్బంది కలిగించలేదు. సాధారణంగా కొంత మంది సినీ ప్రముఖులు చాలా మంది ఏదో ఒక వివాదంలో ఉంటారు. కానీ అలాంటి వివాదాలకు దూరంగా ఉండేవారు కృష్ణంరాజు ప్రకృతి నీడలో కన్నుమూయాలనుకున్నారు. కానీ చివరకు హాస్పిటల్లో కన్నుమూశారు.