సినీ రచనకు వన్నెలద్దిన వెన్నెలకంటి

మాటరాని మౌనమిది.. మౌనవీణ గాలమిది.. ’ అంటూ మహర్షి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అజరామరమైన సాహిత్యాన్ని అందించిన గీత రచయిత వెన్నెలకంటి. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్. 1957 నవంబర్ 30న నెల్లూరులో జన్మించారు. ఈయన ఇంటి పేరు వెన్నెలకంటి గానే సుప్రసిద్ధులయ్యారు.

వెన్నెలకంటి విద్యాభ్యాసం కూడా నెల్లూరులోనే జరిగింది. హరికథలు, అధ్యాత్మిక ప్రసంగాలు వినడం అంటే చాలా ఇష్టపడేవారు. కళాశాల రోజుల్లో “రసవినోదిని” రేడియో ప్రసంగాలు వినేవారు. 11 ఏళ్ళకే కవితలు, పద్యాలూ రాశారు. ‘‘భక్త దుఃఖనాశ పార్వతీశా’’ అనే మకుటంతో శతకాన్ని, ‘రామచంద్ర శతకం’, ‘లలితా శతకం’ కూడా రాశారు. 1975లో విజయవాడ రేడియో కేంద్రం కవితల పోటీలలో 9 కవితలు సెలెక్టు అయ్యాయి. జంధ్యాల రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో నటించారు.

సినిమారంగం
1986లో నటుడు, నిర్మాత డా. ప్రభాకర్ రెడ్డి ప్రోద్బలముతో శ్రీరామచంద్రుడు సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాట రాశారు పాట వ్రాసాడు. అదే గీత రచయితగా తొలి పరిచయం. అటు తరువాత 1987లో నేపథ్య గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో అన్నా చెల్లెలు సినిమాలో ‘‘అందాలు ఆవురావురన్నాయి’’ అనే పాట రాశారు. నాయకుడు సినిమాతో అనువాదంలో ప్రవేశించారు. ప్రేమాగ్ని సినిమాకు తెలుగులో మాటలు వ్రాసారు. కమల్ హాసన్ నటించిన సత్యభామ సినిమాకు డబ్బింగు వ్రాశారు..
దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 300కు పైగా చిత్రాల్లో మూడు వేలకు పైగా గీతాలతో సాహితీ సేవ చేయశారాయన. వీటిలో 1500 పాటలు డబ్బింగ్ చిత్రాలవే. డబ్బింగ్ పాటల్లో కూడా తెలుగుదనం కనిపించడం వెన్నెలకంటి సాహిత్యంలో ప్రత్యేకత.

తమిళ చిత్రాలను తెలుగులో అనువాదం చేసే విషయంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండేది. లిరిసిస్ట్‌గానూ ఆయన ఎన్నో పాటలను రచించారు. మొత్తంగా ఆయన 1000కి పైగా చిత్రాలకు పని చేశారు. ఆదిత్య 369, క్రిమినల్‌, సమరసింహారెడ్డి, శీను, టక్కరిదొంగ, పెళ్లైన కొత్తలో, పెంగ్విన్‌ వంటి ఎన్నో చిత్రాలకు ఆయన లిరిసిస్ట్‌గా వర్క్‌ చేశారు. పంచతంత్రం, పోతురాజు, దశావతారం, మన్మధబాణం వంటి డబ్బింగ్‌ చిత్రాలకు ఆయన డైలాగ్స్‌ రాశారు. వెన్నెలకంటి ఇద్దరు తనయులు కూడా సినిమా పరిశ్రమలో మంచి పేరును పొందారు. శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్‌ చిత్రాలకు డైలాగ్‌ రైటర్‌గా పనిచేస్తుంటే.. మరో తనయుడు రాకేందు మౌళి లిరిసిస్ట్‌, సింగర్‌, నటుడిగా గుర్తింపును పొందారు.

వెన్నెలకంటి 64 ఏళ్ళ వయసులో గుండెపోటుతో 5 జనవరి 2021న చెన్నైలో మృతి చెందారు.

Scroll to Top