దక్షిణ భారత కోకిల ఎస్.జానకి కన్నుమూత


భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ‘దక్షిణ భారత కోకిల’ ఎస్. జానకి (88) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త విన్న సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. భారతీయ చిత్రసీమ, ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమ ఒక కన్నతల్లిని కోల్పోయినంతగా శోకసంద్రంలో మునిగిపోయింది.

ఎస్ జానకి పూర్తి పేరు శిష్టా జానకి. ఏప్రిల్ 23, 1938 గుంటూరు జిల్లాలోని రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించారు.. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. చిన్నతనం నుంచి జానకికి సంగీతం పట్ల ఎంతో మక్కువ ఉండేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టిందామె. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసి. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యారు. లతా మంగేష్కర్, పి.సుశీల, జిక్కి, పి.లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేవారు. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో పాడటం ఆరంభించారు. దాంతో ఆమె మకాం చెన్నైకి మారింది.

1957లో విడుదలైన ‘విధియిన్ విలయాడల్’ అనే తమిళ చిత్రం ద్వారా ఆమె గాయనిగా పరిచయమయ్యారు. తెలుగులో ఆమె మొదటి పాట ‘ఎమ్మెల్యే’ (1957) చిత్రంలోని “నీ ఆశ అడియాస పాయెనే మోసమాయెనే”. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు సుమారు 17కు పైగా భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడారు. తన 60 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు 48,000 కంటే ఎక్కువ పాటలను ఆలపించి ఆమె రికార్డు సృష్టించారు. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజాలతో ఆమె కాంబినేషన్ ఎన్నో ఆల్ టైమ్ హిట్లను అందించింది.

భాష ఏదైనా, భావాన్ని పలికించడంలో ఆమె శైలి అనన్య సామాన్యం. ముఖ్యంగా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆమె పాడిన పాటలు శ్రోతలను ఎంతగానో ఉర్రూతలూగించాయి. చిన్న పిల్లల గొంతు దగ్గర నుంచి వృద్ధుల గొంతు వరకు ఎలాంటి శబ్దాలనైనా అలవోకగా పలికించగల అద్భుత స్వర విన్యాసం ఆమె సొంతం.

భారతీయ సినీ సంగీత చరిత్రలో ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం – ఇళయరాజా – ఎస్. జానకి’ కాంబినేషన్ ఒక సంచలనం. ఈ ముగ్గురి కలయికలో వచ్చిన పాటలు దక్షిణాది ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్స్‌గా మారాయి. ఎస్పీబీతో కలిసి జానకి గారు పాడిన వేలాది యుగళ గీతాలు ప్రేమికులకు అమృతకావ్యాలుగా నిలిచాయి. ఇళయరాజా స్వరకల్పనలో ఆమె పాడిన మధురగీతాలు సంగీత ప్రియుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆమె అద్భుత గాత్రానికి ఎన్నో పురస్కారాలు దాసోహమన్నాయి. ఉత్తమ నేపథ్య గాయనిగా 4 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు (16 వయతినిలే – తమిళం, శంకరాభరణం – తెలుగు, ఏరి పీలక్కూ ఒరు కూడు – మలయాళం, సీతకోకచిలుక – తెలుగు). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 10 కి పైగా నంది అవార్డులు, కేరళ ప్రభుత్వం నుండి 14 సార్లు, తమిళనాడు ప్రభుత్వం నుండి 7 సార్లు రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. 2013 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మభూషణ్’ అవార్డును ఆమె తిరస్కరించారు. దశాబ్దాల సేవకు గానూ తనకు చాలా ఆలస్యంగా ఈ అవార్డు ఇచ్చారని, దక్షిణాది కళాకారులకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆమె నిరసన వ్యక్తం చేశారు.

జానకి పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడా. కృష్ణుని, షిర్డీ సాయిబాబా భక్తురాలైన ఈమె చాలా సమయం పూజలలో గడిపేవారు. అంతేకాక మీరా పై అనేక భక్తిగీతాల క్యాసెట్ల రికార్డు చేసి విడుదల చేశారు. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి, భానుమతి, లీల తర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలిగా పేరు గడించారు..

పాటల్లో మిమిక్రి మిక్స్‌ చేసి సంగీతప్రపంచాన్ని జానకి మెప్పించారు. పదహారేళ్ళ వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలామె గొంతు, గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరం, చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు, శ్రీవారి శోభనం చిత్రంలోని అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట మొదలైనవి ఆమె గొంతులోని వైవిధ్యానికి ఉదాహరణలు. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం, వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన, తొలిసారి మిమ్మల్ని చూసిందీ అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఆమె భావ వైవిధ్యానికి తార్కాణాలు. అలనాటి జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకూ ఐదు తరాల హీరోయిన్లకి ఆమె స్వరం ఆలంబన అయింది. తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది.

ఈమె 55 ఏళ్ళ సుదీర్ఘకాలం పాటు సుమారు ఐదారు తరాల కథానాయికలకి అన్ని రకాల భావాలనూ స్పష్టంగా వ్యక్తీకరిస్తూ నేపథ్యగానం చేశారు. వయసు మీదపడినా ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకపోవడం ఆమె గాన శైలి. మధురమైన సంగీతం, తిరుగులేని స్వరసంపదతో జానకి కెరీర్‌ ఎదురులేకుండా సాగింది. హిందీ, సింహళం, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్‌కుమార్, వాణి జయరాం, కె.జె. జేసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి. జయ చంద్రన్, పి.లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి. శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేశారు.

సంగీత ప్రపంచంలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన జానకి వ్యక్తిగత జీవితంలో కొన్ని తీవ్ర విషాదాలు ఉన్నాయి. 1997లో ఆమె భర్త వి. రామ్‌ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఏడాది జనవరి 22, 2026న ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ 65 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు.. కొడుకు మరణించిన కొద్ది నెలలకే జానకి కూడా అనంత లోకాలకు తరలిపోవడం అభిమానుల గుండెల్ని పిండేస్తోంది. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె పాడిన వేలాది పాటల రూపంలో జానకి గారి స్వరం ప్రతి ఒక్కరి గుండెల్లో మారుమోగుతూనే ఉంటుంది. జానకి మరణ వార్త తెలియగానే ఆమెకు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Scroll to Top