క్రౌర్యం కరుడు గట్టిన విలన్ గా, కమెడియన్ గా, కుటుంబ పెద్దగా, వృద్ధాప్యం మీద పడిన వృద్ధుడి గా భిన్నమైన పాత్రలలో సినీ పరిశ్రమలో కోట శ్రీనివాసరావు నటన ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఆయా పాత్రలకు తగినరీతిలో నవరసాల్లో ఒదిగిపోయి నటించడంలో అతనికి అతనే సాటి. అటువంటి మేటి నటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు జూలై10. ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని అవలోకిస్తూ ఆయన నటించిన పలు చిత్రాల్లో మరిచిపోలేని పాత్రలను గుర్తు చేసుకుందాం.
కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట శ్రీనివాసరావు 1942, జులై 10న జన్మించారు. బాల్యం నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. 1966లో ఆయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఇతని పేరు 1969-2010 కోట ప్రసాద్. ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
బాల్యం నుండి నాటకరంగంలో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలముపై 20 యేళ్ళ అనుభవం గడించారు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నారు. మర్యాద పూర్వకంగా ఆ నాటకంలో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట శ్రీనివాసరావు 1986 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు.
అహ నా పెళ్ళంట సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది. ప్రత్యేకమైన హాస్య పాత్రల్లోనే కాకుండా కోట శ్రీనివాసరావు పలు సినిమాల్లో ప్రతినాయక పాత్ర పోషించారు. యోగి సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించారు. తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రిగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కు తాతగా నటించారు మరొక సినిమా బృందావనంలో కూడా ఎన్టీఆర్ కు తాతగా నటించారు. గబ్బర్ సింగ్ లో శ్రుతిహాసన్ కు తండ్రిగా నటించారు. కోట శ్రీనివాసరావు బాబు మోహన్ తో కలిసి చాలా సినిమాలలో జోడీగా నటించారు. రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటించిన ఆ నలుగురు సినిమాలో కోట శ్రీనివాసరావు కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులో కూడా నటిస్తున్నారు.
కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు (1999-2004) ఎన్నికయ్యారు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. తొమ్మిది సార్లు నంది పురస్కారాలు అందుకున్నారు. అవి: ప్రత్యేక జ్యూరీ అవార్డు – ప్రతిఘటన (1985), ఉత్తమ విలన్ – గాయం (1993), ఉత్తమ విలన్ – తీర్పు (1994), ఉత్తమ సహాయ నటుడు – లిటిల్ సోల్జర్స్ (1996),ఉత్తమ విలన్ – గణేష్ (1998), ఉత్తమ విలన్ – చిన్నా (2000) ఉత్తమ సహాయ నటుడు – పృధ్వీ నారాయణ (2002),ఉత్తమ సహాయ నటుడు – ఆ నలుగురు (2004), ఉత్తమ సహాయ నటుడు – పెళ్లైన కొత్తలో (2006). ఇప్పటివరకూ సుమారు 270 తెలుగుగ్ సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల సినిమాల్లో కూదా నటించారు.
ఆయన నటించిన పాత్రలు కొన్ని:
*ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన “హలో బ్రదర్” సినిమా ఎంత పెద్ద అయిపోయిందో తెలిసింది. ఇందులో ఎస్సై తాడిమట్టయ్య గా కోట నటన చివరి వరకు నవ్విస్తూనే, క్లైమక్స్ లో కన్నీళ్ళు పెట్టిస్తుంది. కానిస్టేబుల్ గా మల్లికార్జున రావు, ఎస్సైగా కోటా శ్రీనివాసరావు పండించిన హాస్యం ఆధ్యంతం నవ్విస్తుంది.
*చంద్ర సిద్దార్ధ రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన “ఆ నలుగురు” చిత్రంలో అప్పులు ఇచ్చే కోటయ్య పాత్రలో కోటా నటన ఆకట్టుకుంటుంది. ఎంత మంచిగా అప్పు ఇస్తాడో అంతే నిక్కచ్చిగా వడ్డీతో సహా వసూలు చేస్తే పాత్రలో కోటా నటన అలరిస్తుంది. అలాగే క్లైమాక్స్ లో రాజేంద్రప్రసాద్ చితి వద్ద కోటా చెప్పే డైలాగులు కళ్లనీళ్లు తెప్పిస్తాయి.
*ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన “యమలీల” చిత్రం లో శ్రీనివాసరావు పోషించిన పోలీస్ పాత్ర కూడా గుర్తిండిపోతుంది. ఇందులో చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం పోలీస్ స్టేషన్ కు వచ్చి … కోటా ఆడుకొనే సీన్స్‌కి నవ్వుకోలేకుండా ఉండలేము. ఇవి కోటా గారు నటించిన పాత్రల్లో కొన్ని ముత్యాలు మాత్రమే. ఆయన నటించిన మణిపూసలు లాంటి పాత్ర లన్నిటిని మాల కడితే ఒక పెద్ద దండే అవుతుంది.
*ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మాయలోడు, రాఖి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బృందావనం, పెళ్ళైన కొత్తలో, శతృవు, మౌన పోరాటం, ఫ్యామిలీ సర్కాస్, ఖైదీ నంబర్ 786, బావగారు బాగున్నారా, హైహై నాయక, వివాహ భోజనంబు, మల్లీశ్వరి, బొమ్మరిల్లు, జంబలకిడి పంబ, లీడర్ ఇలా వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలలో నటించిన కోట తనదైన ప్రతిభని ఆవిష్కరిస్తున్నారు. జూలై 10న 82 వ ఏట అడుగుపెట్టిన కోట శ్రీనివాసరావు మరింకెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని తెలుగు మల్లి ఆకాంక్షిస్తోంది.