నేటి తరానికి తెలియకపోవచ్చు గానీ తెలుగు సినీపరిశ్రమను అపూర్వమైన కళాకాంతులతో దేదీప్యమానం చేసినవారిలో జి వరలక్ష్మి ఒకరు. ఆమె పూర్తి పేరు గరికపాటి వరలక్ష్మి. పుట్టింది సెప్టెంబరు 27, 1926న ఒంగోలులోని తాతగారి ఇంట్ళో. ఇంటిలో. తండ్రి జి.ఎస్. నాయుడు పేరు విజయవాడలో తెలియనివారు వుండేవారు కాదు. కారణం ఆయన ప్రముఖ మల్లయోధుడు కోడి రామమూర్తి సహచరుడు. పైగా మంచి వస్తాదు కూడా. ఆరోజుల్లో కోడి రామమూర్తికి ఒక సర్కస్ బృందం వుండేది. వరలక్ష్మి తండ్రి కూడా అందులో భాగస్వామి. అయితే అనుకోని కారణాలవలన కోడి రామమూర్తి నడిపే సర్కస్ నిలిచిపోయింది. దాంతో వరలక్ష్మి తండ్రి ఆయుర్వేదవైద్యం ప్రాక్టీసు చేస్తూ గుంటూరులో స్థిరపడ్డారు. ఆయనకు ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. వారిలో వరలక్ష్మి రెండవ సంతానం. ఆమెకు సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. సంగీతం మీదకూడా వరలక్ష్మికి ఆసక్తి వుండేది. గుంటూరులోనే ఆమె చదువు సంధ్యలు కొనసాగాయి. అయితే వరలక్ష్మికి పదకొండేళ్ళ వయసప్పుడు ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా తండ్రి కుటుంబాన్ని పోషించలేక బైరాగుల్లో కలిసిపోయారు. దాంతో తల్లి, బిడ్డలు ఏకాకులయ్యారు. వరలక్ష్మి వయసుకు చిన్నదే అయినా చాలా దూరం ఆలోచించింది. తను సంపాదించి కుటుంబాన్ని పోషించాలనే నిర్ణయానికి వచ్చింది. ఆరోజుల్లో నాటకాలకు విజయవాడ కేంద్రంగా వుండేది. పైగా తెలిసిన వూరు కావడంతో తను విజయవాడ చేరుకుంది. తుంగల చలపతిరావు, దాసరి కోటిరత్నం నాటకబృందాన్ని ఆశ్రయించింది. వారు ప్రదర్శించే ‘సక్కుబాయి’ నాటకంలో రాధ పాత్రను సమర్ధవంతంగా పోషిస్తూ పేరు గడించింది. అలాగే ‘వరవిక్రయం’ సాంఘిక నాటకంలో కమల పాత్రను, ‘రంగూన్ రౌడీ’ నాటకంలో ప్రభావతి పాత్రను పోషిస్తూ వచ్చిన పారితోషికంతో కుటూంబాన్ని ఆదుకుంటూ వచ్చింది.
నాటకాల నుంచి సినిమాల్లోకి:
తుంగల చలపతిరావు బృందం రాజమండ్రి నగరంలో ‘సతీసక్కుబాయి’ నాటకాన్ని ప్రదర్శించారు. అప్పుడు వరలక్ష్మికి పద్నాలుగేళ్ళు. ఆ నాటక ప్రదర్శనకు తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య కుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ హాజరయ్యాడు. వరలక్ష్మి రూపురేఖలు, అభినయ ప్రజ్ఞ ప్రకాష్ ను ఆకట్టుకుంది. తను మద్రాస్ యునైటెడ్ బ్యానర్ మీద నిర్మించ బోయే ‘బారిస్టర్ పార్వతీశం’(చదువుకున్న పెళ్ళాం1940) సినిమాలో హీరో ఎల్.వి. ప్రసాద్ సరసన హీరోయిన్ గా వరలక్ష్మిని బుక్ చేశారు. ఇక వరలక్ష్మి మకాం మద్రాసుకు మారింది. ఈ సినిమా విడుదల అనంతరం శోభనాచల పిక్చర్స్ వారు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో నిర్మించబోయే ‘భక్త ప్రహ్లాద’ (1942) చిత్రంలో రెండవ ప్రహ్లాదుడు వేషానికి వరలక్ష్మిని బుక్ చేశారు. వేమూరు గగ్గయ్య హిరణ్యకశిపుడుగా, రాజేశ్వరి లీలావతిగా నటించిన ఈ చిత్రంలో చిరంజీవి పరిపూర్ణ బాల ప్రహ్లాడుడుగా నటించగా వరలక్ష్మి రెండవ ప్రహ్లాదుడుగా నటించింది. అయితే ఈ సినిమా నిర్మాణం జరుగుతున్న రోజుల్లో రెండవ ప్రపంచయుద్ధం కారణంగా మద్రాసు నగరం మీద బాంబుల వర్షం కురియనున్నదని వదంతులు రావడంతో చిత్ర నిర్మాణం ఆగిపోయింది. తర్వాత చిత్రాన్ని పూర్తిచేసి విడుదలచేశారు. చిత్రం బాగా ఆడింది. యుద్ధ సమయంలో అందరిలాగే వరలక్ష్మి కూడా మద్రాసు వదలి విజయవాడ వచ్చేసి నాటకాల్లో వేషాలు వెయ్యడం కొనసాగించింది. విజయవాడలో వుండగా వరలక్ష్మికి ‘తులసీదాసు’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆరోజుల్లో చిత్తజల్లు పుల్లయ్య వద్ద సహాయకుడుగా పనిచేసే రమణరావు తనమిత్రుడు మజహర్ ఖాన్ (బొంబాయి) తో కలిసి తెలుగులో ‘భక్త తులసీదాసు’ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించి విజయవాడలో వున్న వరలక్ష్మిని హీరోయిన్ గా బుక్ చేశాడు. బొంబాయిలో చిత్ర నిర్మాణం జరుగుతుందని ఆమెను బొంబాయి తీసుకెళ్ళారు. కానీ సినిమా యెంతకూ ప్రారంభం కాలేదు. అయితే వరలక్ష్మి అదృష్టం మరోలా దశ తిరిగింది. భారత్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాత ఎన్.డి.ముడ్ననే ‘వనరాణి’, ‘సర్కస్ కింగ్’, ‘డు ఆర్ డై’ అనే స్టంట్ సినిమాలు నిర్మిస్తూ వరలక్ష్మిని హీరోయిన్ గా తీసుకున్నారు. అలా మూడేళ్ళు వరలక్ష్మి బొంబాయిలో ఉండిపోవలసి వచ్చింది. అక్కడ వున్నప్పుడే ఆదుర్తి సుబ్బారావు, ప్రతిభాశాస్త్రి వంటి వారితో వరలక్ష్మికి పరిచయమైంది. తర్వాత 1944లో వరలక్ష్మి విజయవాడ చేరుకుంది. ఆ సమయంలోనే వరలక్ష్మి జీవితం మరో మలుపు తిరిగింది. ‘అపవాదు’, ‘పత్ని’ వంటి సినిమాలలో నటించిన కోవెలమూడి సూర్య ప్రకాశరావు (దర్శక నిర్మాత కె.ఎస్. ప్రకాశరావు)ఆమెను పెళ్ళాడారు. అయినా వరలక్ష్మి 1946 వరకు విజయవాడలోనే వుండిపోయింది. తర్వాత వరలక్ష్మి మద్రాసు వచ్చి పింగళి నాగేంద్రరావు రచయితగా పరిచయమైన వైజయంతి ఫిలిమ్స్ చిత్రం ‘వింధ్యరాణి’ (1946)లో శంపాలత పాత్రను పోషించింది.
గాయనిగా:
చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘వింధ్యరాణి’ సినిమాకు సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించారు. అందులో వరలక్ష్మి ‘మందారముల జన్మ మాకు కావాలోయి బంభరాలెన్నెన్నొ పైన వ్రాలాలోయి’; ‘రాజా బలే రాజా నీవే నా రాజా’ అనే ఏకగళ గీతాలు ‘మన అనురాగమే మధురగానముగా’ అనే యుగళగీతం సొంతంగా పాడి మన్ననలందుకుంది. కె.ఎస్.ప్రకాశరావు ‘స్వతంత్ర’ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి తొలిప్రయత్నంగా ‘ద్రోహి’ (1948) సినిమా నిర్మించారు. అందులో ప్రకాశరావు హీరో (డాక్టరు) పాత్ర పోషించగా వరలక్ష్మి హీరోయిన్ (సరోజ) పాత్రను పోషించింది. ఈ చిత్రానికి ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఇందులో వరలక్ష్మి ఘంటసాలతో కలిసి ‘పూవుచేరి పలుమారు తిరుగుచు పాట పాడునది ఏమో తుమ్మెద’; ‘ప్రేమయే కదా సదా విలాసీ’ అనే యుగళగీతాన్ని ఎం.ఎస్. రామారావుతో, ‘నేడే తీరే నా వాంఛ నేడే యీడేరే జీవితాశ చేకూరే’ అనే సోలో పాటను పెండ్యాల సంగీత దర్శకత్వంలో పాడి హిట్ చేసింది.
నటనా ప్రతిభతో..
1951లో ప్రకాశరావు దర్శకత్వంలో ‘దీక్ష’లో వరలక్ష్మి యశోద పాత్రలో నటించింది. అందులో వరలక్ష్మి ఆలపించిన ‘చిన్నినాన్న, చిట్టినాన్నా’ అనే పాట బాగా హిట్టయింది. వరలక్ష్మికి మంచి పేరు కూడా వచ్చింది. ఆ చిత్రాన్ని ‘అణ్ణీ’ అనే పేరుతో తమిళంలో కూడా నిర్మించారు. అదే సంవత్సరం దర్శక నిర్మాత హెచ్.ఎం. రెడ్డి ‘రోహిణీ’ బ్యానర్ మీద ‘నిర్దోషి’ చిత్రాన్ని నిర్మించారు. ముక్కామల హీరోగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి అతని మేనత్త కూతురు తారగా నటించింది. ‘ప్రతిభా ఫిలింస్’ అధినేత ఘంటసాల బలరామయ్య నిర్మించిన ’శ్రీలక్ష్మమ్మ కథ’ (1951) చిత్రంలో గయ్యాళి పిచ్చమ్మ పాత్ర పోషించింది. అంతకు ముందే బలరామయ్య నిర్మించిన చిత్రం ‘స్వప్నసుందరి’ (1950)లో రాణి పాత్ర పోషించింది. 1953లో కె.ఎస్. ప్రకాశరావు ప్రకాష్ స్టూడియో నిర్మించారు. అందులో నిర్మించిన తొలిచిత్రం ‘కన్నతల్లి’లో వరలక్ష్మి అక్కినేనికి తల్లిగా ప్రధానపాత్ర పోషించింది. విజయావారు నిర్మించిన ‘పెళ్ళిచేసి చూడు’ చిత్రంలో ఎన్.టి. రామారావు సరసన హీరోయిన్ గా నటించింది. మల్లాది రామకృష్ణశాస్త్రి సలహామేరకు ’’రాజనందిని’, (1958) ‘వీరాంజనేయ’ (1968) సినిమాలలో నటించింది. వరలక్ష్మి సొంతంగా ప్రమోదా బ్యానర్ మీద ‘పసుపు కుంకుమ’, ‘హరిశ్చంద్ర’ (తమిళం) చిత్రాన్ని నిర్మించి చాలా నష్టపోయింది. చివరకు తన పెద్ద భవంతిని కూడా అమ్ముకోవలసి వచ్చింది. ప్రజానాట్యమండలి తరఫున అనేక ఉద్యమాలలో పాల్గొన్న చరిత్ర వరలక్ష్మిది. గరికపాటి రాజారావు తో అనేక సభల్లో అనర్గళంగా మాట్లాడి వన్నెతెచ్చేది. స్వీయదర్శకత్వంలో ‘మూగజీవులు’ (1968) అనే చిత్రాన్ని నిర్మించింది. సినిమా బాగా ఆడలేదు. అయితే ఆమెకు ఉత్తమ దర్శకురాలిగా నంది బహుమతి లభించింది. వరలక్ష్మికి శివప్రకాష్, కనకదుర్గ అనేయిద్దరు సంతానం. వరలక్ష్మి నటించిన చివరి సినిమా ‘సిరిమల్లె నవ్వింది’(1980). అన్నపూర్ణా వారి ‘ఇద్దరుమిత్రులు’, బి.ఏ. సుబ్బారావు గారి ‘భీష్మ’, వీనస్ పిక్చర్స్ వారి ‘సుమంగళి’, జగపతి వారి ‘అంతస్తులు’, ‘ఆస్తిపరులు’, చిత్రకల్పన వారి ‘బుద్ధిమంతుడు’ చిత్రాలలో వరలక్ష్మి నటనకు మంచి పేరు వచ్చింది. 80 ఏళ్ల వయసులో 2006 నవంబరు 26న వరలక్ష్మి చెన్నైలో తుదిశ్వాస విడిచింది.