అలరించే.. ఆ ఒక్కటీ అడక్కు


అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు కామెడీ చిత్రాలకు, కామెడీని పండించే హీరోల్లో టాప్ ప్లేస్‌లో ఉండేవాడు. ఆ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని సీరియస్ పాత్రలు చేస్తూ వచ్చాడు. మళ్లీ ఇప్పుడు ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాతో నవ్వించేందుకు మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా కలిసి చేసిన ఈ మూవీ ఎలా ఉందంటే..

కథ
పెళ్లి అనేది ప్రస్తుతం సమాజంలో చాలా మంది ఎదుర్కొంటోన్న సమస్య. వయసు మీద పడినా పెళ్లిళ్లు జరగడం లేదు. వయసు దాటి పోతోన్నా బిడ్డలకు పెళ్లిళ్లు జరగడం లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ముప్పై దాటితే గానీ పెళ్లి ఊసు ఎత్తడం లేదు. సెటిల్ అవ్వాలని, మారిన జీవన శైలి ఇలా ఎన్నో కారణాల వల్ల లేటు వయసులోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరూ పెళ్లి అనే కాన్సెప్ట్‌కు కనెక్ట్ అవుతారు. ఇలాంటి పాయింట్‌తోనే ఆ ఒక్కటీ అడక్కు అనే మూవీని తీశారు.

గణపతి అలియాస్ గణ (అల్లరి నరేష్)కు వయసు మీద పడినా పెళ్లి కాదు. ప్రభుత్వ ఉద్యోగి అయినా అప్పటికే యాభై సంబంధాలు వచ్చి పోతాయి. ఇక పెళ్లి కావడం లేదని ఇరుగు పొరుగు గుసగుసలాడుకుంటూనే ఉంటారు. గణ తమ్ముడు (రవికృష్ణ)కు పెళ్లై ఓ కూతురు కూడా ఉంటుంది. గణకి పెళ్లి కావడం లేదని తల్లి కూడా మనస్తాపానికి గురవుతుంటుంది. ఎలాగైనా ఓ అమ్మాయిని వెతకాలి అని హ్యాపీ మ్యాట్రిమోనీలో జాయిన్ అవుతాడు. అక్కడ అంతకు ముందు కలిసి సిద్ది (ఫరియా అబ్దుల్లా) ప్రొఫైల్ చూసి కనెక్ట్ అవుతాడు. అలా గణ, సిద్దిల మధ్య పరిచయం మొదలవుతుంది. కానీ గణకి సిద్ది నో చెబుతుంది. ఆ తరువాత గణ ఏం చేస్తాడు? అసలు సిద్ది ఎందుకు నో చెబుతుంది? హ్యాపీ మ్యాట్రిమోనీ చేసే మోసాలు ఏంటి? చివరకు గణకు పెళ్లి అవుతుందా? అన్నదే అసలు కథ.

హీరోకి అంత వయసొచ్చినా, అంతా సెటిల్ అయినా కూడా పెళ్లి ఎందుకు కాలేదు అనే పాయింట్‌ను అంత కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయారు. ప్రభుత్వ ఉద్యోగం, ఫ్లాట్, ఆస్తి ఉన్నాయంటే పెళ్లి ఈజీగానే జరుగుతుంది కదా? అని అంతా అనుకుంటారు. ఇందులో గణకు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందని, పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిందని అర్థం అవుతుంది. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ అంత ఇంపాక్ట్ చూపించదు.

ఈ మూవీ కోసం తీసుకున్న పాయింట్‌కు జనాలు కనెక్ట్ అవుతారు. కానీ సినిమా మొత్తానికి కనెక్ట్ అవుతారా? అంటే చెప్పలేం. పార్టులు పార్టులుగా, బ్లాకులు బ్లాకులుగా అక్కడక్కడా బాగానే నవ్విస్తారు. కానీ రెండు గంటలకు పైగా ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేయలేకపోతారు. ఎమోషనల్‌గానూ అంతగా కనెక్ట్ అయ్యేలా చేయలేకపోయారనిపిస్తుంది.

మెయిన్ పాయింట్

పెళ్లి పేరుతో మ్యాట్రిమోనీ సైట్లు చేసే దందాలు, మోసాలు, అక్కడ జరిగే అక్రమాలను టచ్ చేశారు. ఈ మూవీకి అదే మెయిన్ పాయింట్. మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా జరిగే వ్యాపారాన్ని టార్గెట్ చేశాడు దర్శకుడు. ప్రథమార్దం అంతా కూడా సో సోగా వెళ్తుంది. వెన్నెల కిషోర్, జామీ కారెక్టర్లు వినోదాన్ని పంచుతాయి. సెకండాఫ్‌లో వైవా హర్ష ఎపిసోడ్స్ నవ్విస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అంతా కూడా తెలుగు సినిమాలో హీరోయిజంలా అనిపిస్తుంది. కోర్టులో వాదనలు సిల్లీగానే కనిపిస్తాయి.

సాంకేతికంగా ఓకే
అక్కడక్కడా ఉన్న లోపాలు వదిలిస్తే.. ఆ ఒక్కటీ అడక్కు సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా కూర్చుని చూసేలానే ఉంటుంది. ఎక్కడా కూడా వల్గర్ సీన్లను, అశ్లీలతను పెట్టలేదు. సాంకేతికంగా ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది. గోపీ సుందర్ పాటలు, ఆర్ఆర్ అంతగా గుర్తుండదు. కెమెరామెన్ ఇచ్చిన విజువల్స్ ఓకే అనిపిస్తాయి. ఎడిటింగ్, ఆర్ట్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ కూడా బాగున్నాయి.

నటులు:అల్లరి నరేష్,ఫరియా అబ్దుల్లా,వెన్నెల కిషోర్
దర్శకుడు: మల్లి అంకం

Scroll to Top