గాడ్ ఫాదర్ తో అభిమానుల్లో జోష్

తెలుగు సినీ ప్రేక్ష‌కుడికి ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేని పేరు
మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న రాజ‌కీయాల నుంచి మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత … న‌టించిన చిత్రాలు సైరా న‌ర‌సింహారెడ్డి, ఆచార్య బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన స్థాయిలో స‌క్సెస్ అందుకోలేదు. మెగాభిమానులు కాస్త నిరాశ‌ప‌డ్డారు. అయితే ఆయ‌న మ‌ళ్లీ రెట్టించిన ఉత్సాహంతో చేసిన సినిమా గాడ్ ఫాద‌ర్‌. మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్‌కి ఇది రీమేక్‌. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఆ చిత్రం తెలుగులోనూ డబ్ అయ్యింది. మోహ‌న్‌లాల్ న‌టించిన లూసిఫ‌ర్‌ను తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఆద‌రించారు. ఆ సినిమాను చిరంజీవి రీమేక్ చేస్తున్నార‌న‌గానే మెగాభిమానుల్లో తెలియ‌ని టెన్ష‌న్ క్రియేట్ అయ్యింది. మ‌ళ్లీ చిరంజీవి కొత్త‌గా ఈ సినిమాలో ఏం చెబుతారా! అని గాడ్‌ఫాద‌ర్‌పై పెద‌వి విరిచిన‌వాళ్లు కూడా ఉన్నారు. అయితే గాడ్ ఫాద‌ర్ మేకింగ్ విష‌యంలో చిరంజీవి ప్ర‌తి చిన్న విష‌యాన్ని జాగ్ర‌త్త‌గా డీల్ చేస్తూ వచ్చారు. త‌మిళంలో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న మోహ‌న్ రాజాను ఈ సినిమాకు డైరెక్ట‌ర్‌గా ఎంపిక చేసి సినిమాను పూర్తి చేశారు. విజయదశమితో విడుదలైన ఈ సినిమా అభిమానుల్లో జోష్ పెంచింది.

క‌థ‌:
జ‌న జాగృతి పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి పి.కె.ఆర్ క‌న్నుమూస్తారు. దీంతో ఆయ‌న స్థానంలో ముఖ్య‌మంత్రి ఎవ‌రు అవుతార‌నే దానిపై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంటుంది. పి.కె.ఆర్ కుమార్తె స‌త్య‌వ‌తి (న‌య‌న‌తార‌), అల్లుడు జ‌య‌దేవ్ (స‌త్య‌దేవ్‌) పేర్ల‌తో పాటు బ్ర‌హ్మ (చిరంజీవి) పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. తండ్రి ఒక‌రే అయినా.. త‌ల్లులు వేరు కావ‌టం, ప‌రిస్థితులు కార‌ణంగా బ్ర‌హ్మ అంటే స‌త్య‌వ‌తికి న‌చ్చ‌దు. దీన్ని అవ‌కాశంగా తీసుకుని బ్ర‌హ్మ‌ని జ‌య‌దేవ్ ఇబ్బంది పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. కానీ వీలుప‌డ‌దు. అదే స‌మ‌యంలో బ్ర‌హ్మ ఆధ్వ‌ర్యంలో న‌డిచే అనాథాశ్ర‌మంలో అమ్మాయితో ఆయ‌న‌కు అక్ర‌మ సంబంధం అంట‌గ‌ట్టి జైలు వెళ్లేలా చేస్తారు. బ్ర‌హ్మ చేసే మంచి ప‌నులు కార‌ణంగా అత‌నికి ప్ర‌జ‌ల్లో చాలా మంచి పేరు ఉంటుంది. త‌నతో పాటు త‌న కుటుంబం చుట్టూ జ‌రుగుతున్న మోసాల‌ను ముందే ప‌సిగ‌డ‌తాడు బ్ర‌హ్మ‌. దాంతో జ‌య‌దేవ్‌ని ఎత్తుకు పైఎత్తులు వేసి చిత్తు చేసి జైలు నుంచి నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తాడు. అదే స‌మ‌యంలో జ‌య‌దేవ్ కార‌ణంగా స‌త్య‌వ‌తి అనుకోని ఇబ్బందుల్లో చిక్కుంటుంది. అప్పుడు బ్ర‌హ్మ ఏం చేస్తాడు? ఆమెను ఎలా కాపాడుకుంటాడు? చివ‌ర‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎవ‌రు అవుతారు? బ్ర‌హ్మ కింగ్ అవుతాడా? కింగ్ మేక‌ర్ అవుతాడా? బ్ర‌హ్మ‌కు సాయం చేసే మ‌సూద్ బాయ్ ఎవ‌రు? ఇంట‌ర్‌పోల్ వెతికే అబ్దుల్ ఖురేషి అనే పేరు మోసిన క్రిమిన‌ల్ ఎవ‌రు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:
మ‌ల‌యాళ సినిమా లూసిఫ‌ర్‌ను దాదాపు తెలుగు ప్రేక్ష‌కులంద‌రూ చూశారు. సినిమా ప్ర‌ధాన క‌థాంశం అదే తీసుకున్నారు. కొన్ని మెయిన్ సీన్స్ కూడా అదే స్టైల్లోనే చిత్రీక‌రించారు. కానీ క‌థ‌లో చేయాల్సిన ప్ర‌ధాన మార్పుల‌న్నింటినీ చ‌క్క‌గా చేశారు. మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఛేంజ‌స్ చేశారు. అలాగే చిరంజీవి హీరోయిజాన్ని అభిమానులే కాదు.. ప్రేక్ష‌కులు సైతం మెచ్చుకునేలా ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా. లూసిఫ‌ర్ సినిమాను చూసిన ప్రేక్ష‌కులు సైతం గాడ్ ఫాద‌ర్‌ను చూస్తే కొత్త‌గా ఉన్న‌ట్లు భావ‌న క‌లిగింది.

మెగాస్టార్ చిరంజీవి నటనకు త‌గ్గ‌ట్లు డైరెక్ష‌న్, ఇత‌ర సాంకేతిక అంశాలు జ‌త క‌ల‌వ‌టంతో ప్ర‌తి సీన్‌ను సూప‌ర్బ్‌గా క‌నిపించింది. మెగాస్టార్ త‌న‌దైన స్టైల్లో కింగ్ మేక‌ర్ బ్ర‌హ్మ పాత్ర‌లో అలా ఒదిగిపోయారు. ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సిన మ‌రో ప్ర‌ధాన‌మైన పాత్ర‌.. స‌త్య‌దేవ్ న‌టించిన జ‌య‌దేవ్ క్యారెక్ట‌ర్‌. చిరంజీవి, న‌య‌న‌తార‌, స‌ముద్ర ఖని వంటి హేమాహేమీల ముందు స‌త్య‌దేవ్ న‌టించ‌ట‌మే కాదు.. వారిని మించేలా క్యారెక్ట‌ర్‌ను క్యారీ చేశాడు. ఓ పొలిటీషియ‌న్ త‌ను అనుకున్న‌ది సాధించాల‌నుకుని సాధించ‌లేక‌పోయిన‌ప్పుడు ఇరిటేష‌న్ ఎలా ఫీల్ అవుతాడో అలాంటి ఓ న‌ట‌నను స‌త్య‌దేవ్ పోషించిన తీరు నిజంగా గొప్ప‌గా అనిపిస్తుంది. న‌య‌న‌తార త‌న‌దైన న‌ట‌న‌తో త‌న రోల్‌కు న్యాయం చేసింది. ఇక సునీల్‌, ష‌ఫీ, బ్ర‌హ్మాజీ, భరత్, అనసూయ స‌హా ఇత‌ర న‌టీన‌టులు వారి వారి స్టైల్లో బాగా నటించారు. ఇక సినిమాలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌. మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ చేసిన ఈ పాత్ర‌ను తెలుగులో చిరంజీవి కోసం స‌ల్మాన్ ఖాన్ చేశాడు. చిరంజీవి, స‌ల్మాన్ యాక్ష‌న్ సీక్వెన్సులు ఫ్యాన్స్‌నే కాదు.. ప్రేక్ష‌కుల‌ను కూడా మెప్పిస్తాయి. డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ కూడా యాక్ట‌ర్‌గా వంద‌కు రెండు వంద‌ల మార్కుల‌కు సంపాదించేశారు. రియ‌ల్ లైఫ్‌లో ఎలా ఓపెన్‌గా మాట్లాడుతారో అదే బాడీ లాంగ్వేజ్‌తో ఆయ‌న ఇందులో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌ను పోషించారు.

సాంకేతికంగా
సాంకేతికంగా చూస్తే డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా బాగా సినిమాను డీల్ చేశాడు. చిరు, మోహ‌న్ రాజాల‌కు త‌మ‌న్ రూపంలో మ‌రో స్టార్ టెక్నీషియ‌న్ యాడ్ కావ‌టం ఇంకా బ‌లాన్ని చేకూర్చిన‌ట్ల‌య్యింది. త‌మ‌న్ నేప‌థ్య సంగ‌తం సినిమాలోని మాస్ సీన్స్‌ను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లాయి. నిరవ్ షా సినిమాటోగ్ర‌ఫీ బావుంది. రైట‌ర్ లక్ష్మీ భూపాల్ అందించిన ప‌దునైన డైలాగ్స్ సినిమాలో మెరిపించాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లోనే ఉండాల‌నుకునే వారికి ఈ సినిమా కొంత నిరాశకు గురిచేయొచ్చు.

నటులు:చిరంజీవి,సల్మాన్ ఖాన్,సత్యదేవ్,నయనతార,సునీల్,సముద్రఖని
దర్శకుడు: మోహన్ రాజా

Scroll to Top