రొటీన్ మాస్ ‘రత్నం’


తమిళ దర్శకుడు హరి సినిమాలు మాస్ యాక్షన్ తో స్పీడుగా ఉంటాయి. ఏదో పరుగు పందెంలో పరిగెత్తినట్టుగా స్క్రీన్ ప్లే సాగుతుంది. అలాంటి దర్శకుడికి మాస్ హీరో విశాల్ పడితే ఇంకెలా ఉంటుందనేది భరణి, పూజా సినిమాల్లో చూశారు. మళ్లీ ఇన్ని రోజులకు ఈ ఇద్దరి కాంబోలో రత్నం మూవీ వచ్చింది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. మరి ఈ మూవీ నేడు (ఏప్రిల్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ ఏమిటంటే?
ఈ కథ ఆంధ్ర, తమిళ నాడు సరిహద్దుల్లో జరుగుతుంది. నగరి ఎమ్మెల్యే పన్నీరు (సముద్రఖని)కి కుడిభుజంలా రత్నం (విశాల్) ఉంటాడు. రత్నం పేరు చెబితే అక్కడ అందరూ వణికిపోవాల్సిందే. మరో వైపు తిరుత్తణి ఏరియాలో లింగం (మురళీశర్మ) ఆగడాలు మితి మీరిపోతుంటాయి. లింగం మనుషులు మల్లిక (ప్రియా భవానీ శంకర్)ను హతమార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. రత్నం తిరిగే ఏరియాలోనే మల్లిక మీద అటాక్ ప్లాన్ చేస్తారు. మల్లిక కోసం రత్నం ప్రాణలు అడ్డు వేస్తాడు. మల్లిక వెంటే నీడలా ఉంటూ లింగం మనుషుల నుంచి కాపాడుతాడు. అసలు రత్నం ఫ్లాష్ బ్యాక్ ఏంటి? రత్నం తల్లి రంగనాయకి (ప్రియా భవానీ శంకర్)లా మల్లిక ఎందుకు ఉంది? మల్లికను లింగం ఎందుకు అంతం చేయాలని అనుకుంటాడు? చివరకు మల్లిక కోసం రత్నం ఏం చేశాడు? అన్నదే కథ.

కొత్తదనం శూన్యం
రత్నం సినిమా చూస్తే ఏ కోశాన కూడా కొత్తగా అనిపించదు. హరి ఇది వరకు తీసిన ఎన్నో సినిమాల మాదిరిగానే ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా అలానే ఉంటాయి. హరి స్టైల్ ఆఫ్ మేకింగ్, పరుగులు పెట్టే స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్, చేజింగ్ సీన్లు ఉంటాయి. అసలు రత్నం మూవీ చూస్తున్నంత సేపు ఇది ఈ కాలంలోనే జరుగుతోందా? లేక ఎప్పుడో తీసిన మూవీని ఇప్పుడు రిలీజ్ చేశారా? అన్నట్టుగా ఉంటుంది. విలనిజం, విలన్ల గెటప్పులు కూడా ఓ ఇరవై ఏళ్ల క్రితం చూసినట్టుగానే అనిపిస్తుంది. ఈ మూవీ కోసం హరి రాసుకున్న దాంట్లో కొత్తగా ఏదైనా ఉందా? అంటే.. అది హీరో హీరోయిన్ల ట్రాక్. ఇంత వరకు ఇలాంటి ట్రాక్‌ను మాత్రం చూసి ఉండరు. రెగ్యులర్ హీరో హీరోయిన్ల మాదిరిగా ఈ మూవీలో ఉండదు. డ్యూయెట్లు ఉండవు. రొమాంటిక్ సీన్లు పెట్టడానికి కూడా వీలుండదు. ప్రేయసిలా కాకుండా.. అమ్మలా భావిస్తాడు ఆరాధిస్తాడు హీరో. చివరకు అదే టెంపోని మెయింటైన్ చేశారు. అదే ఈ సినిమా మొత్తంలో ఉన్న కొత్త పాయింట్.. నచ్చే పాయింట్. అది తప్పా మిగతాదంతా కూడా రొటీన్‌గా అనిపిస్తుంది.

సెకండాఫ్‌లోనే అసలు సమస్య
సినిమా ఆరంభం బాగానే ఉంటుంది. కథ ముందుకు సాగుతూ ఉన్న కొద్దీ బాగానే అనిపిస్తుంది. ఎక్కడా కొత్త సీన్లు చూస్తున్న ఫీలింగ్ అయితే రాదు. అలా అని బోర్ కూడా కొట్టదు. ఏదో అలా ముందుకు సాగుతూ ఉంటుంది. ఫక్తు కమర్షియల్ సినిమా, హీరోయిజాన్ని చూపిస్తూ వెళ్తాడు. ఇంటర్వెల్ కూడా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌కు తగ్గట్టుగానే విలన్‌కు భారీ వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది. సెకండాఫ్‌లోనే అసలు సమస్య మొదలవుతుంది. పూర్తి కామెడీ మార్చలేదు.. ఎమోషనల్‌గానూ కనెక్ట్ చేయించలేకపోయాడు. అలా ముందుకు వెళ్తూ ఉంటే నీరసంగా అనిపిస్తుంది. ఇంకా సినిమా అయిపోలేదా? అనే ఫీలింగ్ వస్తుంది. కథ ఎటో తిరుగుతూ ఉంటుంది. ట్విస్ట్ కూడా ముందే ఊహిస్తారు. ఇక క్లైమాక్స్ పరమరొటీన్‌గా అనిపిస్తుంది. ఇలాంటి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ చిత్రాలు ఇంకెంత కాలం వస్తాయో అని నిట్టూర్చేలా ఉంటుంది.

సాంకేతికంగా
సాంకేతికంగా ఈ చిత్రం పర్వాలేదనిపిస్తుంది. ఆ లైటింగ్, కెమెరా యాంగిల్స్ పూర్తిగా హరి స్టైల్లో అప్పుడెప్పుడో చూసేసిన అరవ సినిమాల మాదిరిగానే ఉంటాయి. పాటలు పర్వాలేదనిపిస్తుంది. ఆర్ఆర్ తమిళ సినిమా కొట్టినట్టుగానే అనిపిస్తుంది. అనవసరమైన చప్పుడు ఎక్కువ అయినట్టు వినిపిస్తుంది. యోగిబాబు డైలాగ్స్ కొన్ని చోట్ల నవ్విస్తాయి. మాటలు పర్వాలేదనిపిస్తాయి. సినిమా లెంగ్త్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లోని ల్యాగ్ సీన్లను లేపేస్తే ఇంకాస్త షార్ప్‌గా అనిపించేది. రత్నం పాత్రలో విశాల్ కొత్తగా ఏమీ కనిపించలేదు.. కొత్తగా ఏమీ చూపించలేదు. ప్రియా భవానీ శంకర్ పాత్రకి మంచి ఇంపార్టెన్స్ ఉంది. సముద్రఖనికి మంచి సపోర్ట్ రోల్ దక్కింది. మురళీ శర్మ కాస్త కొత్తగా కనిపిస్తాడు. యోగిబాబు అక్కడక్కడా నవ్విస్తాడు. గౌతమ్ మీనన్‌ కనిపించే ఐదు నిమిషాలు బాగానే అనిపిస్తుంది.

నటులు:విశాల్,ప్రియా భవానీ శంకర్,మురళీ శర్మ,సముద్రఖని
దర్శకుడు: హరి

Scroll to Top