బాలలంతా కలిసి రామాయణం చెప్పారు. పెద్దలంతా ముద్దు ముద్దు మాటలు విని మంత్ర ముగ్ధులైపోయారు. సంభాషణలు విని సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు. చిన్నారుల ఆహార్యాలు, చిరుమందహాసాలు చూసి పరవశించిపోయారు. పాటలు, పద్యాలు విని పారవశ్యంలో మునిగిపోయారు. పరమానందభరితులై తన్మయత్వంలో తేలియాడారు.

‘అభ్యుదయ’ సంస్థ అధ్వర్యంలో మొట్టమొదటి రంగస్థల ప్రదర్సన ‘రామాయణం’ ఆద్యంతమూ జనరంజికంగా, రసవత్తరంగా, రసోద్భావాలు వెల్లువెత్తి ప్రేక్షకుల హృదయాలను ఆనందంతో ఉప్పొంగిపోయేట్లు చేసింది. గత ఆరు నెలలుగా అహర్నిశలూ కష్టపడి సరైన ప్రతిని వ్రాసి, పిల్లలచేత పూర్వాభినయం (రిహార్సల్స్) చేయించి అద్భుతమైన ప్రదర్శన చేసారు. దానికి తోడు రసవత్తరమైన సన్నివేశాలను ఎంచుకొని అవసరమైన చోట సినిమా పాటలు జోడించి, సందర్భోచితమైన మాండలీకాలతో సంభాషణలు వ్రాసి, నగిషీలు దిద్దిన ధనుస్సులు, బాణాలు, అశ్వం మొదలైన భారీ వస్తువులను స్వతహాగా చేసుకొని ప్రదర్శనకు వన్నె తెచ్చారు. నిబద్ధతతో, క్రమశిక్షణతో, సరైన సమయపాలనతో ఆరు నెలలు కష్టపడి ఒక సుమధురమైన అనుభూతిని మిగిల్చే సుందరమైన ప్రదర్శనని అందించారు.

కార్యక్రమ నిర్వహణ కూడా యుక్త వయస్సులోనున్న పిల్లలతో చేయించడం, అందులో అచ్చ తెలుగులో వ్యాఖ్యానం చేయించడం తెలుగువనంలో తెలుగు’ధనం’ తోడైనట్లుంది. రంగస్థల అలంకరణలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి సన్నివేశాలకు సరిపోయిన సుందరవనంగా తీర్చిదిద్దారు.
పాత్రధారులందరూ తమ సంభాషణలు తామే చెప్పడం వారి అకుంఠిత దీక్షకు నిదర్శనం. ఇది నిర్వాహకులలో ఉన్న నిబద్ధతకు తార్కాణం.

‘అభ్యుదయ’ సంస్థకు మూల స్తంభాలైన శ్రీధర్ తుమ్మలపల్లి మరియు అరుణ్ యర్రాపాత్రుని ప్రేక్షకులకు, ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించిన వ్యాపార సంస్థలకు, వివిధ విభాగాలలో సహాయం చేసిన స్వచ్చంద సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు.

