ఆస్ట్రేలియా భాగవాతాణిముత్యం – కార్తీక నందిరాజు
పోతన గారు రచించిన భాగవతాణిముత్యాలు పారవశ్యంతో రాగయుక్తంగా పాడితే ఆ రసాస్వాదనలో పొందే అనుభూతే వేరు. భక్తీ, సాహిత్యం, తాత్వికత సమ్మిళతంగా వ్రాసిన ఆ పద్యాలు ఇప్పటికి సుమారు 700 సంవత్సరాలు దాటింది. అయినా అందులో ఉన్న ఆ మాధుర్యం వివిధ మాధ్యమాల ద్వారా, వివిధ రకాలుగా అంటే సంగీత పారయణులు, సాహితీ పిపాసకులు, తత్వవేత్తలు పాడగా విన్నాం. పిల్లలు కూడా భావం తెలియకపోయినా తెలిసీ తెలియని రాగాలతో పాడగా విన్నాము. అయితే ప్రాశ్చాత్య దేశాలలో పర సంస్కృతితో సహజీవనం చేస్తూ మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవాలన్న తపనతో సంగీత పరంగా ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు పాడడం ఒక ఉత్కృష్టమైన ప్రక్రియ.
భాగవతం పద్యాలు పిల్లలందరూ నేర్చుకోవాలని ఉత్తరమెరికా సంస్థ iBAM వారు గత మూడేళ్ళుగా అక్కడి పిల్లలకు పద్యాలు నేర్పించి ప్రతీ ఏటా పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ పోటీలను ఇతర దేశాలలో నివసిస్తున్న పిల్లలకు నేర్పించి వారిని కూడా ఈ పోటీలలో భాగస్వాములను చేయాలన్న తలంపుతో ఈ ఏడాది మరికొన్ని దేశాలకు ఈ ప్రక్రియను విస్తరించారు.
ఆస్ట్రేలియాలో మొదటిసారిగా ఈ కార్యక్రమం ‘తెలుగుమల్లి’ అధ్వర్యంలో నిర్వహించబడింది. మొదటి రౌండ్ లోని మూడు విభాగాలలో (6-9, 10-13, 14-18 వయసు) 45 మంది పిల్లలు పాల్గొని ప్రతీ విభాగం నుండి రెండవ రౌండ్ కి ముగ్గురేసి పిల్లలు ఎంపిక కాబడ్డారు. భారత, అమెరికా దేశాలతో పాటు సుమారు 20 దేశాల నుండి పాల్గొన్న 78 మంది పిల్లల పోటీలలో ఆస్ట్రేలియా, మెల్బోర్న్ నగరానికి చెందిన కార్తీక నందిరాజుకు (10-13 విభాగం) ప్రత్యేక బహుమతి లభించడం ముదావహం.
పుట్టింది భారత దేశమే అయినా చిన్నప్పటి నుండి మెల్బోర్న్ నగరంలోనే పెరిగి ప్రస్తుతం 6వ తరగతి చదువుతుంది. ఒకటిన్నర సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులు తోటి కుటుంబ సమూహాలతో సాయి భజనకు వెళ్ళినపుడు భజన పాటలు పాడటంతో తన సంగీత అరంగేట్రం చేసింది. పిన్న వయసులోనే తనకి సంగీతంలో ఉన్న పరిజ్ఞానాన్ని గుర్తించి తల్లిదండ్రులు శ్రీమతి విజయ మరియు శ్రీ చంద్ర శేఖర్ నందిరాజులు సంగీతం మరియు నృత్యం నేర్పించాలని అనుకున్నారు. అక్క మౌనిక (14-18 వయసు, భాగవత ఆణిముత్యాలు మొదటి రౌండ్ లో మొదటి బహుమతి గెల్చుకుంది) సంగీతం నేర్చుకోవడం చూసి తాను కూడా అదే బాటలో నృత్యం కన్నా సంగీతానికి ప్రాముఖ్యతనిస్తూ అక్క నేర్చుకుంటున్న గురువులు శ్రీమతి సుందరి సరిపల్లె గారి వద్దే తన ఆరవ ఏట సంగీత తరగతులు ప్రారంభించింది.
చిన్నప్పటి నుండి నేర్చుకోవాలన్న కుతూహలం, సాధించాలన్న పట్టుదల, ఏ విధమైన సంశయం లేకుండా గురువు గారిని అడిగి తెలుసుకోవడం, చెప్పిన పాఠం తు.చ. తప్పకుండా అప్పజెప్పడం, అక్కకు చెప్పిన పాఠాలు తనకు కూడా అప్పుడే చెప్పాలని మారాం చేయడం కార్తీకకున్న మంచి గుణాలని గురువులు శ్రీమతి సుందరి గారు చెప్పారు. చిన్నప్పటినుండి తెలుగులో మంచి పద ఉచ్చారణ కలిగి చక్కని సంభాషణ చతురత కలిగి ఉండడం కార్తీకకు సంగీతంలో పట్టు సాధించి చక్కని మెళుకువలు నేర్చుకోవడంలో ఉపయోగపడ్డాయని సుందరి గారు చెప్పారు.
‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లు జెట్ వారు నిర్వహించే రంగస్థల సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతీ ఏటా పాల్గొని వారి ప్రసంశలందుకొన్న కార్తీక ప్రస్తుతం సంగీతంతో పాటు నృత్యం నేర్చుకుంటోంది. టెన్నిస్ లో కూడా ముందుండి ప్రస్తుతం స్కూలు ఫైనల్ కి చేరుకుంది. గురువులు శ్రీమతి సుందరి గారి వార్షికోత్సవంలో ప్రతీ ఏటా పాల్గొని బహుమతులందుకొంది.
కార్తీక ఇక ముందు కూడా సంగీతంలో మంచి గాయనిగా ప్రసిద్ధికెక్కి మరెన్నో అంతర్జాతీయ బహుమతులందుకోవాలని ‘తెలుగుమల్లి’ ఆశిస్తుంది.
గురువులు శ్రీమతి సుందరి సరిపల్లె…
సద్గురువుల ఆశీర్వాదం, సంప్రదాయాల సహవాసం, వాగీశ్వరి కటాక్షం, స్వరాల సమారోహం, తరతరాల పరంపర, భావితరాలకు అందివ్వాలన్న తపన శ్రీమతి సుందరి గారిలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. వారు గత 20 ఏళ్లుగా మెల్బోర్న్ నగరంలో నివసిస్తూ ‘స్వర సాధన’ సంగీత కళాశాల ద్వారా చాలా మంది పిల్లలకు సంగీతం నేర్పిస్తున్నారు. సంగీతంలో వారికున్న పరిజ్ఞానం అమోఘం. మెల్బోర్న్ లో శ్రీమతి సుందరి గారి వద్ద సంగీతం నేర్చుకుంటున్న విద్యార్ధులంటే కనుబొమ్మలెగరేయాల్సిందే. వారికి తోడుగా పద్యాలు నేర్పించడంలో వారి శ్రీవారు శ్రీ సూర్యనారాయణ గారు అందె వేసిన చేయి. భువన విజయం ప్రదర్శించిన పద్య నాటకాలు “శ్రీకృష్ణ రాయాబారము” మరియు “శ్రీ పార్వతీ కల్యాణము” నాటకాలకు వారిరివురూ పద్యాలు పాడి పలువురికి శిక్షణ కూడా ఇచ్చారు.