ఓం ఆదిత్యాయనమ:


సూర్యుడు లేని ప్రపంచాన్ని ఊహించలేం. సూర్యుడు కర్మసాక్షి. మాఘశుక్ల సప్తమి నాడు తొలిసారిగా ఈ భూమికి కనిపించి రథమెక్కాడట భాస్కరుడు. ఈరోజు ఆకాశంలో నక్షత్రాలు రథాకారం దాల్చుతాయి. అందుకే రథసప్తమి అయిందని పురాణాలు అంటున్నాయి. సూర్యుడు ఆధ్యాత్మిక విశేషమే కాదు… భౌతిక, ఖగోళ, శారీరక ప్రాముఖ్యం కలిగిన గ్రహనాయకుడు కూడా. సమస్త మానవాళి ఆరోగ్యం- భాస్కర ప్రసాదంగా చెబుతారు. విదేశీయులు కూడా సూర్యస్నానం చేసేది అందుకే. ఉదయకాలం పూట కాసేపు సూర్యకాంతికి ఎదురునిలచోవడంలో అంత రార్ధం ఆరోగ్యసూత్రమే. మన సంప్రదాయాల్లోని సంధ్యా వందన నియమం అందుకే నని అంటారు.

సూర్యుడు ఆవిర్భవించిన రథ సప్తమి ఎంతో విశేషమైన పండుగ. ఈ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటారు. ఈ రథసప్తమి 2026 జనవరి 25వ తేదీ రోజున త్రిమూర్తి స్వరూపుడైన సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆ పర్వదినం రోజు సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యం, శ్రేయస్సు, సిరిసంపదలు కలుగుతాయని భావిస్తుంటారు.
ఈ రథసప్తమి రోజున సూర్యుడు ఉత్తరాయణ ప్రయాణాన్ని మొదలు పెడతాడని పండితులు చెబుతారు. ప్రతియేటా ఈ రథసప్తమి వేడుకలను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సూర్యభగవానుడికి విశేషంగా పూజలు నిర్వహిస్తారు. సకల ప్రాణులకూ ఆరోగ్యాన్ని ఇచ్చే దైవం ఆదిత్యుడు. మయూరుడనే కవి కుష్ఠురోగ పీడితుడైన సమయంలో సూర్యుడిని ఆరాధించి, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి.. సూర్య శతకాన్ని రచించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాడనే పురాణ కథనం ఉంది.

అరసవల్లిలో నిత్యపూజలు
అజ్ఞాన తిమిరాన్ని కోటి కోట్ల అరుణ కిరణాలతో చెల్లాచెదురు చేసి సమస్త జీవరాశులను మేల్కొలిపే ఆదిదేవుడు ఆదిత్యుడు. అటువంటి సూర్యభగవానుడు మూర్తీభవించిన దైవంగా శ్రీకాకుళం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో అరసవల్లిలో నిత్యపూజలు అందుకుంటున్నాడు. ప్రపంచంలో నిత్యారాధన జరిగే ఏకైక సూర్య దేవాలయం ఇదొక్కటి మాత్రమే కావడం ఈ ఆలయ విశిష్టతను చాటి చెబుతోంది. ఆరోగ్య ప్రదాతగా నిలిచిన ఆదిత్యుని జయంతి రథసప్తమినాడే జరుగుతుంది.

చరిత్ర పుటల్లో అరసవల్లి…
చరిత్ర పుటలను తిరగేస్తే అరసవల్లి లోని శ్రీ సూర్య దేవాలయాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగ రాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ క్రీస్తు శకం 545 లో నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన వారసుడు ఒకటో దేవేంద్రవర్మ క్రీస్తు శకం 648లో సూర్యగ్రహణ సమయా న ఆదిత్య విష్ణుశర్మ, భానుశర్మలనే బ్రాహ్మణులకు అరసవల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానం ఇచ్చినట్టు ఆలయ పరిసరాల్లోని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం క్రీస్తు శకం 1077- 1150 సంవత్సరాల మధ్య జీవించిన అనంత శర్మ చోడ గంగ దేవ రాజు సూర్యదేవునికి, శ్రీకూర్మ నాథునికి కొంత భూమి దానం చేసినట్లు అరసవల్లి లో దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 1609 నాటి శాసనంలో అరసవల్లిలో ఓ విద్యాలయం విద్యార్థులకు ఉచిత భోజన వసతితోపాటు చెరువు తవ్వడానికి భూ దానం చేసినట్లు తెలిపారు. క్రీస్తు శకం 1434లో తూర్పుగంగ వంశం అంతరించినంత వరకు ఆదిత్యుడికి నిత్య పూజలు కొనసాగించారు.

కళింగ దేశ రాజధాని శ్రీముఖలింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న, సూరప్ప అనే సోదరులు రాజు దర్శనానికి వెళ్లి, తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నవించారు. ఆ సోదరుల దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్యదేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమించినట్టు కొన్ని రచనల ఆధారంగా తెలుస్తోంది. కృష్ణా తీర ప్రాంతానికి చెందిన ఈ సోదరులు శ్రీముఖలింగం వస్తున్నప్పుడు వంశధార నదిలో ఒక తాళపత్ర గ్రంధం దొరికిందని, అందులో సూర్యదేవుని పూ జా విధానాలు ఉన్నాయని వారు మహరాజుకు తెలిపినట్టు చరిత్ర చెబుతుంది.

వారి వారసులే ఇప్పటికీ ఆలయ అర్చకులు గా కొనసాగుతున్నారు. గంగ వంశ రాజులు తరువాత గజపతులు అరసవల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆలయాలను సంరక్షించారు. క్రీస్తు శకం 1599 లో హజరత్‌ కులీకుతుబ్‌షా శ్రీ కూర్మం వరకూ దండయాత్ర జరిపి అరసవల్లి ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు సౌత్‌ ఇండియన్‌ ఇన్‌స్క్రిప్షిన్స్‌ 5వ సంపుటం ఆధారంగా తెలుస్తోంది. ఆ తర్వాత ఏ ప్రాముఖ్యత లేని ఈ ఆలయాన్ని 1778లో యలమంచిలి పుల్లాజీ పంతులు పునరుద్దరించారు. ఆ సమయానికి నల్లని గ్రానైట్‌ శిలతో రూపొందించిన మూలవిరాట్‌ విగ్రహం తప్ప మరే అవశేషం మిగిలి లేదు. అలా కాలక్రమంలో యిప్పిలి జోగారావు ఆలయ ధర్మకర్తగా ఉన్న సమయంలో సారవకోట మండలం అలుదు నివాసి వరుదు బాబ్జీ రావు ఆదిత్య ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు.

సూర్యజయంతే రథసప్తమి…
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తరువాత మాఘమాస శుద్ద సప్తమిని రథసప్తమి గా పేర్కొంటారు. ఈ సప్తమి రోజు సౌర కుటుంబానికి కేంద్రమైన సూర్యుడు ఉద్భవించి నట్టు చెబుతారు. సూర్యోదయాన్నే… ‘సప్తసప్తమహాసప్త’ శ్లోకాన్ని జపిస్తూ స్నానమాచరిస్తే విశేష ఫలితాలు ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ చెబుతున్నారు. ఇంద్ర పుష్కరిణిలో భక్తులు తలపై జిల్లేడు ఆకులు, రేగుపండ్లు, నువ్వులు పోసుకుని మూడుసార్లు అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తే పునర్జన్మ ఉండదని అనాదిగా వస్తున్న నమ్మకం. రథసప్తమి రోజున స్త్రీ సాంగత్యాన్ని, తైలం, మాంసాహారాన్ని ఎవరు త్యజిస్తారో వారికి సూర్యలోకం ప్రాప్తిస్తుందని చెబుతారు. స్వామి నిజరూప దర్శన పూజలతో భక్తులకు నవగ్రహ దోష నివృత్తి జరిగి ఆరోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయని నమ్మకం. అందువల్లే రథసప్తమి రోజున లక్షలాది మంది భక్తులు సూర్య దర్శనం కోసం తరలివస్తారు.

రథసప్తమి విశిష్టత.. పురాణాల ప్రకారం, రథసప్తమి నాడే సూర్య భగవానుడు తన రథంపై ఏడు గుర్రాలతో ఉత్తర దిశగా (ఉత్తరాయణం) ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు మరియు ఇంద్రధనుస్సులోని ఏడు రంగులకు ప్రతీక.
సూర్య కిరణాల్లోని శక్తి వల్ల శరీరానికి డి-విటమిన్ అందడమే కాకుండా, చర్మ వ్యాధులు నయమవుతాయని నమ్మకం. చలికాలం ముగిసి వసంత కాలం ప్రారంభాన్ని ఈ పండుగ సూచిస్తుంది. ఇది వ్యవసాయ పనులకు కూడా శుభప్రదమైన సమయం. ఈ రోజు సముద్రంలో లేదా నదుల్లో స్నానం చేయడం ఉత్తమం. వీలుకాకపోతే ఇంట్లోనే తలపై జిల్లేడు ఆకులను పెట్టుకుని స్నానం చేయాలి. అర్ఘ్యం: సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం (నీటిని వదలడం) సమర్పించాలి.

ఆదిత్య హృదయం: ఈ రోజు ‘ఆదిత్య హృదయం’ లేదా ‘సూర్యాష్టకం’ పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, విజయం లభిస్తాయి. ప్రసాదం: చిక్కుడు ఆకులపై పరమాన్నం వండి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం తెలుగు వారి సంప్రదాయం.

రథసప్తమి నాటి శిరస్నానం వేళ పఠించ వలసిన శ్లోకం..
శ్లో!! య దాజన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు,
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానా న్మే సప్తసప్తికే!
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి.

జన్మజన్మాంతారాలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసి న సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన రథసప్తమీ! నిన్ను స్మరిస్తూ ఈ స్నానంతో నశించుగాక!

Scroll to Top