కోవిడ్ నుంచి కోలుకున్నా కొత్త ముప్పు బ్లాక్ ఫంగస్
కరోనా సోకిన వారిలో, కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ముకోర్ అనే ఫంగస్ వల్ల వ్యాపిస్తుంది. ఇది సైనస్, కళ్లు, బ్రెయిన్ పై తీవ్రమైన ప్రభావం చూపి మరణానికి కూడా దారితీస్తుంది.
మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొంతమంది ఈ ఫంగస్ బారిన పడి కంటి చూపు కోల్పోవడం, మరికొంతమంది మరణించడం ఇప్పుడు కలవరపెడుతోంది. మ్యూకోర్మైకోసిస్ అని పిలిచే ఈ ఇన్ఫెక్షన్ తాలూకూ కేసులు ఇప్పుడు మెల్లగా పెరుగుతున్నాయి.
మ్యూకోర్మైకోసిస్ అనేది చాలా అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ ఫంగస్ సాధారణంగా మట్టి, కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయల్లో కనిపించే బూజులో ఉంటుంది. అలాగే ఇది గాలిలో, మనుషుల ముక్కు నుంచి కారే స్రవాల్లో కూడా ఉంటుంది. అయితే కరోనా నుంచి కోలుకునే సమయంలో తలెత్తే సమస్యల వల్ల, ఇమ్యూనిటీ బాగా దెబ్బతినడం వల్ల ఈ బ్లాక్ ఫంగస్ గాలిద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత ఇది వెంటనే కంటి లోపలికి ప్రవేశించి, కంటిపై దాడి చేస్తుంది. ఫలితంగా కంటిచూపు కోల్పోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఈ ఫంగస్ మెదడు వరకు వ్యాపించి మెదడుని కూడా డ్యామేజ్ చేసే ప్రమాదముంది.
లక్షణాలు:
ఈ లక్షణాలు కోవిడ్ రోగుల్లో, కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొద్ది రోజుల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
ముఖం ఒకవైపు భాగం నొప్పిగా ఉండటం
కంటి చూపు మందగించడం
కండ్లు, ముక్కు చుట్టూ ఎర్రబడటం
ఛాతి నొప్పి, శ్వాస సమస్యలు, వాంతిలో రక్తం రావడం
ఎవరికి ఎక్కువంటే? :
డయాబెటిస్ సమస్య తీవ్రంగా ఉన్నవారికి.
స్టెరాయిడ్ల వల్ల ఇమ్యూనిటీ కోల్పోయినవారికి.
ఐసీయూలో దీర్ఘకాలంగా చికిత్సపొందుతున్నవారికి.
అవయవమార్పిడి చికిత్స చేసుకొన్నవారికి.
ఎలా సంక్రమిస్తుంది?
కొవిడ్-19 చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడాల్సి వస్తోంది. అయితే ఈ స్టెరాయిడ్ల వల్ల ఇమ్యూనిటీ తగ్గి రక్తంలో చక్కెరస్థాయులు పెరుగుతున్నాయి. ఇలా రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉందని డాక్టర్లు కనుగొన్నారు. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అలాగే దీన్ని వెంటనే గుర్తించగలిగితే సరైన వైద్యం అందించి రోగి ప్రాణాలను కాపాడొచ్చు.
అప్రమత్తంగా ఉండాలంటే :
కోవిడ్ పేషెంట్లు రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగకుండా చూసుకోవాలి.
స్టెరాయిడ్లను మరీ ఎక్కువగా కాకుండా సరైన మోతాదులో వాడాలి.
యాంటీ బయాటిక్స్/యాంటీ ఫంగల్ మెడిసిన్స్ ను కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి.
బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.