ఆస్ట్రేలియాలో డార్విన్ కాకుండా మిగిలిన ముఖ్యమైన నగరాలలో తెలుగువారు తమతో తెలుగు ‘ధనం’ గా తెచ్చుకున్న పండగలలో ఉగాది ప్రత్యేకంగా జరుపుకుంటున్నట్లు మనం వింటున్నాము. అయితే డార్విన్ లో కూడా గత ఆరేడేళ్ళ నుండి ఉగాదితో పాటు సంక్రాంతి, బతుకమ్మ, వనభోజనాలు కూడా జరుపుకుంటున్నట్లు తెలియరావడం చాలా ముదావహం. ఈ విషయం తెలియరావడంతో ఇంచుమించు వృత్తాకారంలో ఉన్న ఆస్ట్రేలియాలో తెలుగుదనం పరిపూర్ణం అయినట్లే. డార్విన్ లో 300 పై చిలుకు తెలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. గత శతాబ్దంలో వేళ్ళపై లెక్కించగలిగిన కుటుంబాలతో మొదలై ఇప్పుడు వందల్లోకి చేరుకుంది.
తెలుగు అసోసియేషన్ అఫ్ నార్తర్న్ టెరిటరీగా 2019లో నమోదైనా, 2016 నుండి ఈ సంస్థ మన పండగలను తు.చ. తప్పకుండా జరుపుకుంటుందని అధ్యక్షులు డా.చిట్టినేని వెంకట శ్రీనివాస రావు గారు చెప్పారు. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వపరంగా అక్కడి ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులు కూడా హాజరై ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. తెలుగు భాషా సంస్కృతులు పండగ రూపంలో జరుపుకోవడం అభినందిస్తున్నారు. గత నెల 26వ తేదీన జరిగిన “శోభకృత్” నామ సంవత్సర ఉగాదికి ముఖ్యమంత్రి నటాష ఫైల్స్, ఆర్ధిక మంత్రి ఈవా లాలెర్, డిజిటల్ డెవలప్మెంట్ మంత్రి గారీ ఆకిట్ మరియు ప్రతిపక్ష నాయకులు జేరార్డ్ మాలీ గార్లు వచ్చి మన తెలుగువారందరినీ ఆశీస్సులందజేయడం చాలా సంతోషకరమైన విషయం.
ఈ సందర్భంగా తెలుగు పాటలు, ఉగాది గురించి వివరాలు, భరత నాట్యం, ఒళ్ళు గగుర్పొడిచే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఎంతోమంది దేశనాయకుల ఫాన్సీ దుస్తుల రూపకం మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసారు. చిరుప్రాయంలోనే ఈ తెలుగు సంఘం ఎంతో నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో సాగిస్తున్న సాంస్కృతిక ప్రయాణం వీక్షకులకు కనులవిందు చేస్తుంది.
సుమారు 300 మంది హాజరైన ఈ కార్యక్రమానికి తెలుగు సంఘం సభ్యులే వంటలు చేసి పెట్టడం శ్లాఘనీయం. లవకుమార్ బొల్లినేని, నగేష్ గుమ్మల, ప్రమోద్ మిశ్రా, సాజి వల్లికలై, అప్పారావు అదరి, శ్రీ హర్ష, శ్రీనివాస్ బిట్ల – జయ హకీమ్, షేక్ హకీమ్ మరియు కేశవాచారి గార్లు మరెంతోమంది స్వచ్చంద సేవకుల సహాయంతో వంటల చేసి పసందైన విందు అందరికీ అందించారు.
చాలామంది వ్యాపార సంస్థలతో పాటు వ్యక్తిగతంగా ఆర్ధిక సహాయం చేసారని శ్రీ శ్రీనివాసరావు గారు చెప్పారు. కార్యవర్గ సభ్యులు, ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొని సహాయం చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.