* దేశ అత్యున్నత పురస్కారం
* ఆర్థికంగా దేశాన్ని మలుపుతిప్పిన ప్రధాని
నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న దక్కింది. దేశాన్ని సంస్కరణల వైపు తీసుకెళ్లడంలో ప్రధానిగా సంచలన నిర్ణయాలు తీసుకున్న పీవీకి ఆలస్యంగానైనా భారతరత్న వరించడం.. దేశ ప్రజలతోపాటు మరీ ముఖ్యంగా తెలుగువారికి ఒక గౌరవంగా నిలిచింది. అయితే దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించిన పీవీ నరసింహా రావుకు మాత్రం ప్రధాని పదవి అనుకోకుండా దక్కింది. ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి దాదాపుగా నిష్క్రమించిన సమయంలో అనూహ్యంగా ప్రధానమంత్రి పదవి వరించింది. దీంతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తొలి దక్షిణ భారతీయుడిగా, అందులోనూ మన తెలుగు వ్యక్తి గా పీవీ చరిత్ర సృష్టించారు.
ప్రపంచం దృష్టిని భారత్ వైపు చూసేలా చేసిన ప్రధానమంత్రి పీవీ నరసింహారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా.. ఆ తర్వాత కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పీవీ.. రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత ప్రధాని పదవి వరించడం గమనార్హం. అనంతరం వివిధ రంగాల్లో ఆయన చేపట్టిన సంస్కరణలు.. ఇప్పటికీ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి.
1921 జూన్ 28 వ తేదీన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో పాములపర్తి వెంకట నరసింహారావు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ, బాంబే, నాగ్‌పుర్ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించిన పీవీ.. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957 నుంచి 1977 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పలుమార్లు ఎన్నికైన పీవీ.. పలు మంత్రి పదవులను నిర్వహించారు. ఇక 1971 నుంచి 1973 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత లోక్‌సభకు ఎన్నికైన పీవీ.. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు.
1957 లో ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పీవీ నరసింహారావు.. 1991 లో ఏకంగా దేశ ప్రధానిగా ఎదిగారు. అది కూడా అప్పటివరకు ఏ ఎంపీకి రాని 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించి గిన్నిస్ రికార్డు కూడా దక్కించుకున్నారు. ఇక గాంధీ, నెహ్రూ కుటుంబాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన తొలి ప్రధానిగా రికార్డు సృష్టించారు. అంతే కాకుండా 1991 వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా దక్షిణ భారత రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఎంపీలు.. ప్రధాని కాలేదు. కానీ 1991 లో ప్రధాని బాధ్యతలు చేపట్టి ఆ పీఠాన్ని అధిష్ఠించిన తొలి దక్షిణ భారతీయుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు.
అయితే రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావించిన పీవీ నరసింహారావు.. 1991 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ.. హత్యకు గురి కావడంతో పీవీకి ప్రధాని పదవి వరించింది. రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థిగా పీవీ కనిపించారు. దీంతో ఆయనను హుటాహుటిన ఉపఎన్నికలో గెలిపించి ప్రధానిని చేశారు. 1991 లో నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఏకంగా 5 లక్షల మెజారిటీతో అఖండ విజయం సాధించిన పీవీ.. ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. 1991 నుంచి 1996 వరకు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
1991 లో పీవీ ప్రధాని అయ్యే సమయానికి దేశంలో పరిస్థితి దారుణంగా తయారైంది. దివాలా తీసే స్ధాయికి చేరుకున్న భారత దేశ ఆర్ధిక వ్యవస్థలకు పీవీ పునరుజ్జీవనం కల్పించేందుకు సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందుకే పీవీని భారత దేశ ఆర్ధిక సంస్కరణల పితామహుడు అని పిలుస్తారు. పంజాబ్‌లో తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానికే దక్కింది. ఇక 1998 లో అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమం మొదలు పెట్టింది కూడా పీవీ ప్రభుత్వమే కావడం గమనార్హం. అదేవిధంగా మరో భారతరత్న పురస్కారం పొందిన ఎల్ కే అద్వానీ తన రధయాత్ర నిర్వహించడం, అయోధ్యలో బాబ్రీ మసీదుని కరసేవకులు కూల్చి వేయడం పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన చారిత్రక ఘటనలు కావడం విశేషం.