తెలుగు ప్రజలకు ఏడాది పొడవునా ఎన్ని పండగలు, పర్వదినాలు వచ్చినా సరే సంక్రాంతిని మాత్రమే పెద్ద పడగ..పెద్దల పండగ గా భావిస్తారు…
సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అని అంటారు. ప్రతి నెలా ఒక రాశి చొప్పున సూర్యుడు పన్నెండు రాశులలో సంచరిస్తాడు. ఆవిధంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు రాష్టాలలో ప్రముఖంగా జరుపుకుంటారు . ఈ పండుగను ఆంధ్రప్రదేఎష్ లో విశేషంగా జరుపుకుంటారు.
ధనుర్మాసం ప్రారంభంతోనే సంక్రాంతి పండుగ సందడి ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండుగ ముఖ్యంగా మూడు రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ అని మూడు రోజుల పండుగ. కొన్ని ప్రాంతాలలో ముక్కనుమ పండుగను నాలుగో రోజు కూడా జరుపుకుంటారు.
భోగి పండుగను ధనుర్మాసం చివరి రోజున జరుపుకుంటారు. ఈరోజున శ్రీ రంగనాథునితో గోదాదేవి కళ్యణం జరిగి, గోదాదేవి శ్రీ రంగనాథునిలో లీనమై వుతుంది. ఈరోజుతో గోదాదేవి వ్రతం కూడా పూర్తవుతుంది.
భోగి రోజున తెల్లవారు జామున భోగి మంటలు వేస్తారు. భోగి మంటలకోసం తాటి ఆకులను ఉపయోగిస్తారు. ఇంట్లో ఉన్న పాత సామాను కూడా భోగి మంటల్లో వేస్తారు. అవసరం లేని వస్తువుల పట్ల మమకారం ఉండ కూడదనే వేదాంత సత్యాన్ని తెలియజేస్తుంది. భోగి మంటల్లో కాచిన వేడి నీటితో స్నానం చేయడం ఆనవాయితీ.
భోగి రోజున బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోసి పెద్దలు ఆశీర్వదిస్తారు. స్వయంగా శ్రీమన్నారాయణుడు పెద్దల రూపంలో ఆశీర్వదిస్తాడని ప్రజల నమ్మకం. రేగు పండ్లు, పూలు, నాణాలు కలిపి భోగి పళ్ళు తయారు చేస్తారు. వచ్చిన పెద్దలను పండు తాంబూలంతో సత్కరిస్తారు. భోగి పండుగ రోజున కోస్తా ఆంధ్రలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడి పుంజుల పోటీలు కన్నుల పండువగా జరుగుతాయి. ఈ పందేల్లో లక్షల కొద్ది పందెం కాస్తారు. కోడి పందేల్లో జీవహింస ఉండటమే కాకుండా, కోడి పందేల్లో జరిగే మోసాల వల్ల, ఎంతో మంది డబ్బులు పోగొట్టు కుంటారు. అందుకని ప్రభుత్వం కోడి పందేలను నిషేధించింది.
ఉత్తరాయణ పుణ్యకాలమైన రెండవ రోజును సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పంటల పండుగ అని కూడా అంటారు. కొత్తధాన్యం, కొత్త బెల్లం, కొత్త నువ్వులు ఇంటికి చేరుతాయి. కొత్త బెల్లం కొత్త బియ్యం తో వండిన పొంగలి భగవంతునికి కృతజ్ఞత గా నివేదిస్తారు. భగవంతుని అనుగ్రహం వల్లే కదా పంట చేతికి వచ్చేది. భగవంతునికి తొలి నివేదన చేసేంతవరకు, పంటలు ఇంటి కోసం వాడక పోవడం విశేషం.
మూడవ రోజును కనుమ పండుగగా జరుపుకుంటారు. కనుమ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. రైతులకు వ్యవసాయం చేయడానికి పశు పక్ష్యాదులు ఎంతో సహాయం చేస్తాయి. అందుకు కృతజ్ఞతగా పశు పక్ష్యాదులను కనుమ పండుగ రోజున పూజించడం ఆనవాయితీ. పశువులను పరిశుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు వేసి, పూసలు గంటలతో అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాలలో పోటీలు కూడా నిర్వహిస్తారు. తమిళనాడులో జల్లికట్టు అనే ప్రమాదకరమైన క్రీడను జరుపుకుంటారు. ప్రభుత్వం నిషేధించినప్పటికి జల్లికట్టు క్రీడలు జరగటం విశేషం.
కనుమ పండుగ రోజున మాంసాహారం, మినప్పప్పుతో చేసిన గారెలు ప్రత్యేక ఆహారం. అలవాటు ఉన్నవారు పీకలదాకా మద్యం సేవిస్తారు. శాఖాహారులు మినప గారెలతో సరి పెట్టుకుంటారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు.కొన్ని ప్రాంతాలలో నాల్గవ రోజున ముక్కనుమ పండుగను జరుపుకుంటారు. కనుమ పండుగ రోజున మాంసాహారం తిన కూడదని, ముక్కనుమ రోజున మాంసాహారం తింటారు.
సంక్రాంతి పండుగ సమయంలో వాతావరణం చాల చల్లగా ఉంటుంది. చల్లటి వాతావరణంలో నువ్వులతో చేసిన పీండి వంటలు తినడం ఆరోగ్యకరం. అరిశెలు సంక్రాంతికి ప్రత్యేక మైన పిండి వంట. పిల్లలు పతంగులు ఎగురవేసి ఆడుకుంటారు. కొన్ని నగరాలు, పట్టణాలలో గాలిపటాలను ఎగరేసే క్రీడలు (పతంగుల పోటీలు) నిర్వహిస్తారు.
అయితే ఈ ఏడాది కోవిడ్ మూడో వేవ్ మొదలైనందున నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా సంక్రాంతి జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరం..